English | Telugu
'నిన్నే పెళ్లాడతా'లో హీరోయిన్ చాన్స్‌ను వదిలేసుకున్న మీనా! ఎందుకంటే...
Updated : Sep 3, 2021
హీరో నాగార్జున, డైరెక్టర్ కృష్ణవంశీ కెరీర్లలో 'నిన్నే పెళ్లాడతా' ఎంతటి మెమరబుల్ మూవీయో మనందరికీ తెలుసు. ఆ సబ్జెక్టు కానీ, ఆ సినిమాలోని పాటలు కానీ మరచిపోదామన్నా మరపుకు రావు. నాగార్జున-టబు మధ్య కెమిస్ట్రీ, వాళ్ల రొమాన్స్ ఆడియెన్స్‌ను అమితంగా అలరించింది. చాలా మందికి తెలీని విషయం ఏమంటే.. నిజానికి ఆ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఫస్ట్ చాయిస్ టబు కాదు, మీనా! యస్. మీరు చదువుతోంది నిజం.
అప్పుడే సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా 'ముత్తు' విడుదలై, సూపర్ డూపర్ హిట్టయింది. అందులో హీరో హీరోయిన్లు రజనీ, మీనాపై తీసిన "థిల్లానా థిల్లానా" సాంగ్ అందర్నీ ఊపేస్తోంది. రజనీ-మీనా కెమిస్ట్రీకి ఆడియెన్స్ దాసోహమయ్యారు. అప్పుడు 'నిన్నే పెళ్లాడతా'లో హీరోయిన్‌గా మీనాను ఊహించుకున్నారు కృష్ణవంశీ. ఆమెను సంప్రదించారు. అయితే కాల్షీట్స్ 60 రోజులు కావాలని అడిగారు. ఆ సినిమా నిర్మాతలు ఎవరో కాదు.. అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్లే.
ఆ టైమ్‌లో మీనా డిమాండ్ మామూలుగా లేదు. చాలా సినిమాలతో యమ బిజీగా ఉంది. 20 రోజుల కాల్షీట్స్ ఇవ్వడమే గగనంలా ఉన్న స్థితి ఆమెది. అలాంటిది 60 రోజులు ఎలా ఇవ్వడం! "అయ్యో.. అన్ని రోజులంటే కష్టం. ఇవ్వలేను" అని చెప్పేశారు మీనా.
నిజానికి నాగార్జున సరసన, కృష్ణవంశీ డైరెక్షన్‌లో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేసి ఆ సినిమాని ఒప్పుకుంటారు. కానీ అప్పటికే తను ఒప్పుకున్న సినిమాలకు న్యాయం చెయ్యాలనీ, ప్రొఫెషనల్‌గానే ఉండాలనీ, కమిట్‌మెంట్‌ను విడనాడకూడదని భావించి ఆమె 'నిన్నే పెళ్లాడతా'లో చెయ్యలేనని బాధపడుతూనే చెప్పారు. అలా ఆమె సారీ చెప్పడంతో, అప్పుడు టబుకు ఆ పాత్రను ఇచ్చారు కృష్ణవంశీ. ఈ నిజాన్ని ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు మీనా.