Read more!

English | Telugu

రావు గోపాల‌రావు అంత్య‌క్రియ‌లు ఎలా జ‌రిగాయో, అక్క‌డ‌ ఏం జ‌రిగిందో తెలుసా?

 

రావు గోపాల‌రావు ఎలాంటి న‌టుడో ఇప్ప‌టి యంగ్ జ‌న‌రేష‌న్‌కు తెలియ‌క‌పోవ‌చ్చు కానీ, నిన్న-మొన్న‌టి త‌రాల‌కు బాగా తెలుసు. తెలుగు సినిమాల్లో విల‌నిజాన్ని కొత్త‌పుంత‌లు తొక్కించిన న‌టునిగా రావు గోపాల‌రావు ల‌బ్ధ‌ప్ర‌తిష్ఠులు. అన‌కాప‌ల్లికి చెందిన ఆయ‌న మొద‌ట రంగ‌స్థ‌లంపై పేరు తెచ్చుకొని, ఆన‌క సినిమాల్లోకి వ‌చ్చి, మొద‌ట చిన్న పాత్ర‌లు చేశారు. క్రాంతికుమార్ నిర్మించిన 'శార‌ద‌'లో చేసిన మున‌స‌బు పాత్ర మంచి పేరు తెస్తే, బాపు చిత్రం 'ముత్యాల ముగ్గు'లో చేసిన కాంట్రాక్ట‌ర్ కేర‌క్ట‌ర్ ఆయ‌న కెరీర్‌ను స‌మూలంగా మార్చేసి, వెనుతిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా చేసింది.

కోట శ్రీ‌నివాస‌రావు, గొల్ల‌పూడి మారుతీరావు లాంటి న‌టుల రాక‌తో రావు గోపాల‌రావుకు అవ‌కాశాలు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా, 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' లాంటి సినిమాల్లో చేసిన పాత్ర‌ల‌తో త‌నేమిటో ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఉన్న‌ట్లుండి ఆరోగ్యం క్షీణించ‌డంతో పాటు, ఆర్థిక‌ప‌ర‌మైన విష‌యాల్లో ముందుచూపు లేక‌పోవ‌డంతో చాలా న‌ష్ట‌పోయారు. న‌మ్మిన‌వాళ్లు ద‌గా చేశారు. అనారోగ్యానికి చికిత్స కోసం చాలా డ‌బ్బే ఖ‌ర్చుపెట్టాల్సి వ‌చ్చింది.

చివ‌ర‌కు పోరాటం చాలించి, 1994 ఆగ‌స్ట్ 13న రావు గోపాల‌రావు క‌న్నుమూశారు. అప్ప‌టికింకా తెలుగు చిత్ర‌సీమ పూర్తిగా మ‌ద్రాసు నుంచి హైద‌రాబాద్ త‌ర‌లిపోలేదు. మ‌ద్రాసులో ఉన్న సినీ ప్ర‌ముఖులు కొంత‌మంది ఆయ‌న పార్థివ‌దేహానికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. ఆరోజు మ‌ధ్యాహ్నం ఆయ‌న అంతిమ‌యాత్ర మొద‌లైంది. న‌టులు అల్లు రామ‌లింగ‌య్య‌, పి.ఎల్‌. నారాయ‌ణ‌, నిర్మాత జ‌య‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ రేలంగి న‌ర‌సింహారావు లాంటి కొద్దిమందే ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు. 

పెద్దకొడుకు రావు ర‌మేశ్‌, రెండో కొడుకు క్రాంతి అశ్రున‌య‌నాల‌తో తండ్రి భౌతిక దేహానికి అగ్ని సంస్కారం జ‌ర‌ప‌బోతున్నంత‌లో "ఆగండి" అంటూ కొంత‌మంది త‌మిళ‌మిత్రులు అక్క‌డ‌కు వ‌చ్చారు. చుట్టూ చూసి, "ఇంకా ఎవ‌రైనా రావాలా?" అని త‌మిళంలోనే అడిగారు. లేద‌ని అల్లు రామ‌లింగ‌య్య చెప్పారు. అప్పుడు వాళ్లంతా క‌న్నీరు పెట్టుకుంటూ, రావు గోపాల‌రావు భౌతిక‌దేహానికి న‌మ‌స్క‌రిస్తూ, "ఇలాంటి గొప్ప‌న‌టుడు దేశంలోని మ‌రే ప్రాంతంలోనైనా ఉంటే, వారి అంత్య‌క్రియ‌లు ఇంత సాదాసీదాగా, పేల‌వంగా జ‌ర‌గ‌వు. అంత గొప్ప‌మ‌నిషి, మాన‌వ‌త్వం క‌లిగిన మ‌హ‌నీయునికి ఇలా అగ్నిసంస్కారం జ‌ర‌గ‌డం బాధ‌గా ఉంది" అన్నారు.

నిజ‌మే.. రావు గోపాల‌రావు ఎలాంటి న‌టుడు! త‌న డైలాగ్ డిక్ష‌న్‌తో హీరోల‌ను కూడా ఎలా డామినేట్ చేసేవారు!! అలాంటి న‌టుడు ప‌ర‌మ‌ప‌దిస్తే, తోటి న‌టుల్లో చాలామంది ఆయ‌న‌ను క‌డ‌సారి చూసుకొనేందుకు కూడా వెళ్ల‌లేదు. క‌నీసం ఆఖ‌రిసారిగా అయినా ఆయ‌న‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌కాల‌ని ఎవ‌రూ అనుకోలేదు. సినీ రంగం నుంచి ఆయ‌న అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న‌ది ఎక్కువ‌గా చిన్న‌స్థాయి కార్మికులే.