Read more!

English | Telugu

లతా మంగేష్కర్‌తో ఒక్క పాట కూడా పాడించని ఒకప్పటి బాలీవుడ్‌ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌!

బాలీవుడ్‌లో ఒకప్పటి టాప్‌ సింగర్స్‌ ఎవరూ అంటే ఠక్కున లతా మంగేష్కర్‌, మహ్మద్‌ రఫీ, కిషోర్‌కుమార్‌, ముఖేష్‌, ఆశా భోస్లే.. ఇలా ఓ పది మంది పేర్లు చెబుతాం. అలాగే బాలీవుడ్‌లోని టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఎవరు అంటే.. ఎస్‌.డి.బర్మన్‌, శంకర్‌ జైకిషన్‌, ఖయ్యాం, రవీంద్రజైన్‌, ఆర్‌.డి.బర్మన్‌లతోపాటు ఒ.పి.నయ్యర్‌ పేరు కూడా వినిపిస్తుంది. ఈ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ అందరూ పైన చెప్పుకున్న టాప్‌ సింగర్స్‌తో పాటలు పాడించారు ఒక్క ఒ.పి.నయ్యర్‌ తప్ప. అవును. ఇది నిజమే. భారతదేశం గర్వించదగిన సింగర్‌, భారతరత్న, దాదా సాహెఫాల్కే అవార్డు, పద్మభూషణ్‌.. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు లత. అంతేకాదు కోట్లాది మంది సంగీత సంగీత ప్రియుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నేటింగేల్‌ ఆఫ్‌ ఇండియా లతా మంగేష్కర్‌తో ఒక్క పాట కూడా పాడించకుండా టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకోవడం సాధ్యమేనా?.. తనకు సాధ్యమేనని ప్రూవ్‌ చేశారు ఓంకార్‌ ప్రసాద్‌ నయ్యర్‌. 

లాహోర్‌లోని ఓ రేడియో స్టేషన్‌లో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఒ.పి.నయ్యర్‌ ఆ తర్వాత ముంబై చేరుకొని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. 1952లో వచ్చిన ‘ఆస్మాన్‌’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో సంగీత దర్శకుడుగా పరిచయమయ్యారు. అప్పటివరకు ఉన్న సంగీత దర్శకుల సంగీతానికి భిన్నంగా స్వరాలను సమకూర్చడం, ఆర్కెస్ట్రాను కూడా విభిన్నంగా కండక్ట్‌ చేయడం వంటి వినూత్న ప్రక్రియల వల్ల అనతికాలంలోనే సంగీత దర్శకుడిగా మంచి పేరు, రిథమ్‌ కింగ్‌ అనే బిరుదును సంపాదించుకున్నారు. 1956లో వచ్చిన ‘సిఐడి’ చిత్రంలోని పాటలు చాలా పెద్ద హిట్‌ అయ్యాయి. ఆ సినిమాతో ఒ.పి.నయ్యర్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిపోయారు. ఎంతమందిలో ఉన్నా ఒ.పి.నయ్యర్‌ను ఇట్టే గుర్తు పట్టొచ్చు. ఎందుకంటే నెత్తిమీద ఎప్పుడూ హ్యాట్‌తో డిఫరెంట్‌ గెటప్‌తో ఉంటారాయన. అలాగే ఎన్ని పాటల మధ్యలోనైనా ఇది ఒ.పి.నయ్యర్‌ స్వరపరచిన పాట అని సంగీత ప్రియులెవరైనా ఇట్టే చెప్పగలరు. అలా తన సంగీతానికి ఒక మార్క్‌ని క్రియేట్‌ చేసుకున్నారు నయ్యర్‌. 

ఒ.పి.నయ్యర్‌ చేసిన పాటల్లో పెద్ద విజయం సాధించిన పాటలు కోకొల్లలు. ‘ఓ లేకే పహలా పహలా ప్యార్‌’, ‘పుకార్‌తా ఛలా హూ మై..’, ‘బాబూజీ ధీరే ఛల్‌నా..’, ‘మై ప్యార్‌ కా రాహీ హూ..’, ‘దీవాన హువా బాదల్‌’ వంటి పాటలు మచ్చు తునకలు మాత్రమే. 1951, 1970 మధ్యలో అప్పటి టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌లో ఒ.పి.నయ్యర్‌ ఒకరు. 1994 వరకు కొనసాగిన తన కెరీర్‌లో కొన్ని వందల సినిమాలకు సంగీతాన్ని అందించారు. ప్రముఖ బాలీవుడ్‌ సింగర్స్‌లో ఒకరైన ఆశా భోంస్లే.. ఒ.పి.నయ్యర్‌ సంగీతంలో పాడిన పాటల ద్వారానే టాప్‌ సింగర్‌గా ఎదిగారు. ఆయన సంగీత దర్శకత్వంలో అప్పటి టాప్‌ సింగర్స్‌ అందరూ పాడారు. కానీ, లతా మంగేష్కర్‌తో ఒక్క పాట కూడా పాడించలేదు నయ్యర్‌. మ్యూజిక్‌ ఇండస్ట్రీలో ఉంటూ అందులో టాప్‌ పొజిషన్‌లో ఉన్న సింగర్‌తో పాడించకుండా సంగీత దర్శకుడిగా ఉన్నత స్థాయికి చేరుకోవడం ఒ.పి.నయ్యర్‌కే సాధ్యమైంది. అంతేకాదు, నయ్యర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన తర్వాత మొదటి మూడు సంవత్సరాలు మహ్మద్‌ రఫీతో కూడా పాడించలేదు. ఆ సమయంలో మహేంద్రకపూర్‌కి అవకాశాలు ఇచ్చారు 

ఇక దక్షిణ భారతదేశంలోని సినిమా సంగీతంపై ఒ.పి.నయ్యర్‌ ప్రభావం బాగా ఉండేది. ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ నయ్యర్‌ ప్రభావంతో చేసిన పాటే. ఎంతో గొప్ప సంగీతదర్శకులైన ఎం.ఎస్‌. విశ్వనాథన్‌.. నయ్యర్‌ ప్రభావంతో చాలా పాటలు చేశారు. ఇళయరాజా పగలిల్‌ ఒరు ఇఱవు సినిమాలో చేసిన అద్భుతమైన పాట ‘ఇళమై ఎనుం పూంగార్ట్రు పాడియదు ఓర్‌ పాట్టు’ పాటకు నయ్యర్‌ ‘జాయియే ఆప్‌ కహా జాయేంగే’’ పాట స్ఫూర్తినిచ్చిందేమో అని అనిపిస్తుంది. సత్యం, మణిశర్మ వంటి సంగీత దర్శకులు కూడా నయ్యర్‌ ప్రభావంతో పాటలు చేశారు. ఒ.పి.నయ్యర్‌ తెలుగులో చేసిన ఒకే ఒక సినిమా ‘నీరాజనం’. ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. దీనికి ఉత్తమ సంగీత దర్శకుడుగా నంది పురస్కారాన్ని అందుకున్నారు నయ్యర్‌. భారతదేశంలో మహ్మద్‌ రఫీ తర్వాత అంతటి గొప్ప గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం అని ఒ.పి.నయ్యర్‌ ప్రశంసించడం అప్పట్లో ఎంతో విశేషంగా చెప్పుకున్నారు.