Read more!

English | Telugu

9 భాషల్లో రీమేక్‌ అయిన ఏకైక ఇండియన్‌ మూవీ గురించి తెలుసా?

నిర్మాత యం.యస్‌.రాజు తన కెరీర్‌లో చేసిన సూపర్‌హిట్‌ సినిమాల్లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ ఒకటి. సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై 2005లో ఆయన నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్‌ హిట్‌గా నిలిచింది. సిద్ధార్థ్‌, త్రిష జంటగా నటించిన ఈ సినిమాలో రియల్‌స్టార్‌ శ్రీహరి ఓ కీలక పాత్ర పోషించారు. 2004లో ప్రభాస్‌, త్రిష జంటగా నటించిన ‘వర్షం’ చిత్రంలోని సూపర్‌హిట్‌ సాంగ్‌ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా..’ పాటనే టైటిల్‌గా పెట్టి రూపొందించిన ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద హిట్‌ అయింది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు దేవిశ్రీప్రసాదే సంగీతాన్ని అందించడం విశేషం. 

ప్రేమజంటగా సిద్ధార్థ్‌, త్రిష ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపిస్తారు. వారి కెమిస్ట్రి కూడా బాగా వర్కవుట్‌ అయింది. ఇక హీరోయిన్‌ అన్నయ్య పాత్ర పోషించిన శ్రీహరికి ఇది ఒక మైల్‌స్టోన్‌లాంటి సినిమా. హీరో తండ్రిగా నటించిన ప్రకాష్‌రాజ్‌ ఈ సినిమాలో బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఎంతో ఆసక్తికరంగా సాగే కథ, కథనాలతో ఆద్యంతం అద్భుతంగా రూపొందించారు ప్రభుదేవా. సిద్ధార్థ్‌, త్రిషల మధ్య సాగే ప్రేమను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అనవసరమైన సన్నివేశం అంటూ లేని సినిమా ఇది. ప్రతి సీన్‌ సినిమాకి ఇంపార్టెంటే అనిపిస్తుంది. 

ఈ సినిమాకి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఉత్తమ చిత్రం అవార్డుతోపాటు 9 ఫిలింఫేర్‌ అవార్డులు గెలుచుకున్న ఏకైక సౌత్‌ సినిమాగా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ రికార్డు క్రియేట్‌ చేసింది. అంతేకాదు ఈ సినిమా 5 నంది అవార్డులను కూడా గెలుచుకుంది. ఉత్తమ నటిగా త్రిష, ఉత్తమ సహాయనటుడిగా శ్రీహరి, ఉత్తమ కమెడియన్‌గా సంతోషి నంది అవార్డులు అందుకున్నారు. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న ప్రభుదేవాకు దర్శకుడుగా ఇదే మొదటి సినిమా. అప్పటికి ‘బాయ్స్‌’ అనే డబ్బింగ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సిద్ధార్థ్‌కి తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమాతో తెలుగులోనూ అతనికి మార్కెట్‌ వచ్చింది. త్రిష ఈ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇక అప్పటివరకు హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆ సమయానికి ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమాతోనే శ్రీహరి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టర్న్‌ తీసుకున్నారు. అన్నింటినీ మించి 9 భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. అన్ని భాషల్లో రీమేక్‌ అయిన తొలి భారతీయ చిత్రంగా అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ సినిమా. సాధారణంగా ఎంత పెద్ద హిట్‌ అయిన సినిమా అయినా నాలుగైదు భాషలకు మించి రీమేక్స్‌ ఉండవు. కానీ, ఈ సినిమాను 9 భాషల్లో రీమేక్‌ చేశారంటే దానికి కారణం యూనివర్సల్‌గా ఉన్న స్టోరీ పాయింట్‌. ఈ చిత్రానికి వీరు పోట్ల కథను అందించారు. 1989లో సల్మాన్‌ ఖాన్‌, భాగ్యశ్రీ జంటగా రూపొందిన ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ చిత్ర కథను తయారు చేశారు వీరు పోట్ల. ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ద్వారా వచ్చిన డబ్బుతోనే తన తర్వాతి సినిమా ‘పౌర్ణమి’ నిర్మించారు యం.యస్‌.రాజు. 

కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ సినిమాకి అనుకున్న బడ్జెట్‌ రెండున్నర కోట్లు. అయితే ప్రభుదేవా ప్రతి సీన్‌ని ఎంతో అందంగా తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు. మొత్తం 100 రోజులపాటు ఈ సినిమా షూటింగ్‌ జరిగింది. రూ.4 కోట్లు బడ్జెట్‌ అయింది. 2005 జనవరి 14న సంక్రాంతి కానుకగా 90 ప్రింట్లతో ఈ సినిమా రిలీజ్‌ అయింది. నాలుగు వారాల్లో 160 ప్రింట్లకు చేరింది. 80 సెంటర్లలో 50 రోజులు, 35 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శితమైంది. రూ.24 కోట్లు గ్రాస్‌, రూ.16 కోట్లకుపైగా షేర్‌ కలెక్ట్‌ చేసి 2005లోని టాప్‌ 5 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’. 

ఈ చిత్రం 7 భారతీయ భాషల్లో, 2 విదేశీ భాషల్లో రీమేక్‌ అయింది. ఈ సినిమా ఏయే భాషల్లో రీమేక్‌ అయ్యిందో చూద్దాం. ఉనక్కం ఎనక్కం(తమిళం), నీనెల్లో నానల్లే(కన్నడ), ఐ లవ్‌ యు(బెంగాలీ), నింగోల్‌ తజబ(మణిపురి), సునా ఛాదీ మో రూపా ఛాదీ(ఒడియా), తేరా మేరా కీ రిష్తా(పంజాబీ), రామయ్య వస్తావయ్యా(హిందీ), నిస్సా అమర్‌ తుమీ(బంగ్లాదేశ్‌ బెంగాలీ), ది ఫ్లాష్‌ బ్లాక్‌: ఫర్కెరా హెర్దా(నేపాలీ).. ఇలా 9 భాషల్లో రీమేక్‌ అయిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ చిత్రం అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్‌ చిత్రంగా నిలవడం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి.