English | Telugu
జూనియర్ ఎన్టీఆర్.. దేశంలో పద్దెనిమిదేళ్లకే మాస్ స్టార్ అయిన ఏకైక యాక్టర్!
Updated : May 20, 2021
ఏ నటుడికైనా వారసత్వం అనేది ఒక ప్లస్ పాయింట్ మాత్రమే. అంతే తప్ప వారసత్వంగా నటన రాదు. ఈ విషయం చాలా సార్లు చాలా మంది విషయంలో రుజువైంది. అయితే ఆ వారసత్వాన్ని పునాదిగా చేసుకొని నటనను సాధన ద్వారా అంచెలంచెలుగా ఇంప్రూవ్ చేసుకుంటూ తారాపథంలోకి దూసుకెళ్లడమనేది అప్పుడప్పుడు జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ అదే జరిగింది. నిజం చెప్పాలంటే తెలుగు సినీ చరిత్రలో కేవలం ఇరవయ్యేళ్ల వయసుకే టాప్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నది ఒక్క తారక్ మాత్రమే.
హీరోగా తొలి చిత్రం 'నిన్ను చూడాలని' (2001) విడుదలయ్యాక తారక్‌కు ప్రోత్సాహాల కంటే విమర్శలే ఎక్కువగా లభించాయి. అతని శరీరాకృతిని దృష్టిలో పెట్టుకొని అతడికి బండోడు అనే సర్టిఫికెట్లు కూడా వచ్చాయి. అతడి నటనను చూసి విమర్శకుల పెదవి విరిచారు. ఆ సినిమా ఏమాత్రం తారక్‌కు తీపి జ్ఞాపకాల్ని ఇవ్వలేదు. అప్పుడతని వయసు ఎంతనీ! జస్ట్.. 17 యియర్స్!! అదే అతడిలోని పట్టుదలను తట్టి లేపింది. తన నటనలోని చిన్న చిన్న లోపాల్ని సరిచేసుకుంటూ 'స్టూడెంట్ నెం.1'గా వస్తే యువత ఆదరించారు. రాఘవేంద్రరావు, అశ్వినీదత్ లాంటివారు నిర్మాతలుగా, రాజమౌళి లాంటి తపన ఉన్న కొత్త దర్శకుడి చేతిలో రూపుదిద్దుకున్న ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌కు ఎంతో మేలు చేసింది. డాన్స్, ఫైట్స్ ఈజీగా చేయడంతో పాటు, సన్నివేశాల్లో అనాయాసంగా నటించేయడం, హాస్యం, రౌద్రం కలగలిసిన క్యారెక్టర్ అవటాన అతడిలోని నటుడు ఎలివేట్ అవడం.. ఆ చిత్రం ద్వారా రావాల్సిన గుర్తింపు వచ్చింది.
ఫ్యాక్షనిజం హిట్ సినిమాల ముడిసరుకుగా మారివున్న వాతావరణం.. అప్పటికే బాబాయ్ బాలకృష్ణ 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చివున్నాడు. ఇప్పుడు ఆ తరహా నేపథ్యంలోనే వి.వి. వినాయక్ అనే యువకుడు ఒక కథను తారక్‌కు వినిపించాడు. మరోమాట చెప్పాల్సిన పనిలేకపోయింది అతడికి. అట్లా వచ్చింది.. 'ఆది'. ఆ సినిమా రిలీజయ్యాక ఏ విమర్శకులైతే అతడ్ని తేలిగ్గా తీసేశారో, వారే జూనియర్ ఎన్టీఆర్ నటన గొప్పగా ఉంది అని ప్రశంసించారు.
ఆ వయసు కుర్రాళ్లకు సాధ్యపడని రౌద్రరసాన్ని తన హావభావాల ద్వారా సులువుగా పలికించి ప్రశంసలు అందుకున్నాడు తారక్. అతడి పాత్రలోని విభిన్న ఛాయలు, ఆయా సన్నివేశాల్లో అతడి పరిపక్వ నటన ముందు హీరోయిన్ కీర్తి చావ్లా డమ్మీ అయిపోయినా నష్టం కలగలేదు. ఎవరూ ఊహించని రీతిలో తెలుగు ప్రేక్షకులు 'ఆది'కి నీరాజనం పట్టారు. పద్దెనిమిదేళ్ల కుర్రాడు అంతా తానే అయ్యి నడిపించిన ఆ చిత్రం 98 థియేటర్లలో వంద రోజుల పండగ చేసుకుందంటే మామూలు విషయం ఎంత మాత్రం కాదు. అంతకు ముందు బహుశా దేశంలోని ఏ ఇతర భాషల్లోనూ ఏ హీరో కూడా ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద విజయం సాధించి ఉండలేదు.
'ఆది' మూవీతో తారక్ మాస్ ఇమేజ్ అమాంతంగా ఎన్నో రెట్టు పెరిగి పెద్ద స్టార్‌ని చేసింది. ఆ సినిమా తర్వాత కొన్ని పేరుమోసిన పత్రికలు సైతం నంబర్ వన్ హీరో చిరంజీవికి జూనియర్ ఎన్టీఆర్ పోటీ అవనున్నాడని రాశాయంటేనే అతడి ఇమేజ్ ఏ రేంజ్‌కు పెరిగిందీ అర్థమవుతుంది. ఆ తర్వాత రాజమౌళి రూపొందించిన 'సింహాద్రి' సినిమా తారక్ స్టార్‌డమ్‌ను మరో లెవల్‌కు చేర్చింది. చిన్నవయసులోనే ఊహాతీతమైన స్థాయికి చేరడంతో ఆ మూవీ తర్వాత ఏం చేసినా ప్రేక్షకులకు తక్కువగానే కనిపిస్తూ వచ్చింది. ఆ రకంగా చూస్తే కెరీర్ పరంగా తారక్‌కు ఆ సినిమా మేలు కంటే నష్టమే ఎక్కువ కలగించింది. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'సింహాద్రి' ఇమేజ్ బరువును 'జనతా గ్యారేజ్' దాకా మోస్తూ వచ్చాడు తారక్.
కొరటాల శివ డైరెక్ట్ చేసిన 'జనతా గ్యారేజ్' మూవీతో అతను రిలీఫ్ ఫీలయ్యాడు. ఆ సినిమా తారక్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవడమే కాకుండా, బయ్యర్లందరికీ మంచి లాభాలు తెచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన 'అరవింద సమేత' కూడా తారక్‌కు సంతృప్తినిచ్చింది. ఇప్పుడు మరోసారి రాజమౌళి డైరెక్షన్‌లో 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. రజాకార్లను తరిమికొట్టిన గోండు బెబ్బులి కొమరం భీమ్ పాత్రను అతను పోషిస్తున్నాడు. అయితే ఇది మనం చదువుకున్న చరిత్ర కథ కాదు. రజాకార్లపై పోరాటానికి ఆయత్తం కాకముందు ఇంటి నుంచి వెళ్లిపోయిన భీమ్ ఏం చేశాడనే కల్పిత కథతో తీస్తున్న సినిమా. ఈ సినిమాతో తారక్ ఇమేజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు.