English | Telugu
రాముడి వేషంలో భీముడు.. ఒక సీన్ ఎలా తీశారంటే...
Updated : Jun 28, 2021
టాలీవుడ్‌లో తన తరం హీరోల్లో అత్యధికంగా 16 సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఘనత నందమూరి బాలకృష్ణకే సొంతం. వాటిలో తొలి చిత్రం 'అపూర్వ సహోదరులు' (1986) కాగా, మలి చిత్రం 'రాముడు-భీముడు' (1988). విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు నటించిన 'రాముడు-భీముడు' సినిమా కథకూ, బాలయ్య 'రాముడు-భీముడు' కథకూ సంబంధం లేదు. కేవలం టైటిల్స్ మాత్రమే ఒకటి. బాలయ్య సరసన నాయికలుగా సుహాసిని, రాధ నటించారు. తమిళ రచయిత గుహనాథన్ కథ అందించిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు రాశారు. కె. మురళీమోహనరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాల్ని మద్రాస్‌లోని ఏవీయం స్టూడియోలో చిత్రీకరించారు. వాటిలో ఓ సీన్ ఎలా తీశారంటే...
అది.. అత్యంత సంపన్నంగా కనిపిస్తోన్న భవనం. బాల్కనీలో పడక కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడు రాజశేఖరం అనే పెద్దాయన. కాళ్లను ముందున్న పీఠంపైన ఆనించి, నోట్లో పైపు పెట్టుకొని పొగపీల్చి వదులుతూ విలాసంగా కుర్చీలో ఊగుతున్నాడు. ఆయన పక్కనే మెట్లమీద నడివయసులో ఉన్న భార్య పార్వతి, ఆ పక్కనే కొడుకు రాముడు నిల్చొని ఉన్నారు.
రాజశేఖరం గంభీరంగా "ఊ.." అన్నాడు.
"ఇంకా నయం.. ఆ ముదనష్టపుదాన్ని కోడలిగా తెచ్చుకొని ఉండేవాళ్లం." అంది పార్వతి.
"అంతే కాదు మమ్మీ.. ఆ ముసల్డి మనవరాల్ని తీసుకొచ్చిందే.. అదీ నాటకమే! ఒకదాని సంగతి నేను బయటపెట్టేసరికి రెండోది పారిపోయింది." అన్నాడు రాముడు.
"రామూ.." అని పిలిచాడు రాజశేఖరం. ఆయన దగ్గరకు వెళ్లాడు రాముడు.
"నువ్వు గోళ్లు తినడం ఎప్పట్నుంచీ మానేశావు?" అనుమానంగా ప్రశ్నించాడు రాజశేఖరం.
రాముడు తడబడ్డాడు. కుడిచేతి చూపుడువేలిని నోట్లో పెట్టుకొని మునిపంటితో గోరుని కొరుకుతూ, "మామయ్య కూతురుకీ, నాకూ సంబంధంలేదని నిరూపించినప్పట్నుంచీ.." అని చెప్పాడు కంగారును అణచకుంటూ.
దాంతో తృప్తిచెందినట్లు, "వెరీ గుడ్.. స్వాతి ఏ ఊరిలో ఉందో వాకబుచేసి వెంటనే ఇంటికి వెళ్లి తీసుకురా.. పెళ్లి చేసేస్తాను." అన్నాడు రాజశేఖరం.
"ఓకే డాడ్.." అని ఆనందంలో వేలిని నోట్లో పెట్టుకొని గోరును అదేపనిగా కొరుక్కుంటూ, వెనక్కితిరిగి పరుగులాంటి నడక అందుకున్నాడు.
"ఒరే.. ఒరే.. వేలు పూర్తిగా తినేసేవు. తాళి కట్టేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది." అన్నాడు రాజశేఖరం నవ్వుతూ.
ఈ సీన్‌లో రాజశేఖరంగా జగ్గయ్య, పార్వతిగా శ్రీవిద్య, రాముడి వేషంలో ఉన్న భీముడిగా బాలకృష్ణ నటించారు.
సత్యం సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై సిహెచ్.వి.వి. సత్యనారాయణ నిర్మించిన 'రాముడు-భీముడు' చిత్రం 1988 అక్టోబర్ 20న రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్‌గా ఆడింది.