English | Telugu

‘బాహుబలి’కి పదేళ్లు.. ఈ సినిమా క్రియేట్‌ చేసిన రికార్డులివే!

ఒకప్పుడు భారతీయ సినిమా అంటే ప్రధానంగా బాలీవుడ్‌ను చెప్పుకునేవారు. దేశంలోని వివిధ భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ బాలీవుడ్‌ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ప్రాంతీయ భాషా చిత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్‌ అయ్యేవి. మిగతా భాషల్లోకి అనువాద చిత్రాలుగా ఆ తర్వాత రిలీజ్‌ చేసేవారు. అలాంటి సమయంలో టాలీవుడ్‌ నుంచి ఎస్‌.ఎస్‌.రాజమౌళి.. ఓ సంచలనంగా వార్తల్లోకి వచ్చారు. అప్పటికి రాజమౌళి 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలు పలు భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా డైరెక్టర్‌గా అతనికి మంచి పేరు తెచ్చాయి. ఆ తరుణంలో ‘బాహుబలి’ పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. తెలుగు సినిమా స్టామినా ఇది కాదు, అంతకుమించి అని నిరూపించేందుకు, ఇండియాలోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌తో చిత్రాన్ని రూపొందించేందుకు పథకం రచించారు. అప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమ కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తూ ‘బాహుబలి.. ది బిగినింగ్‌’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఈ సినిమా నిర్మాణంలో రామోజీ ఫిలింసిటీ కూడా భాగస్వామ్యం అయింది. 180 కోట్లతో ఇండియాలోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా ‘బాహుబలి’ చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. తెలుగు, తమిళ్‌ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకున్న ‘బాహుబలి’ చిత్రాన్ని 2015 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 4,000 స్క్రీన్స్‌లో రిలీజ్‌ చేశారు. ఒక అద్భుత దృశ్యకావ్యంగా రూపొందిన ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా నిర్మాణం వెనుక ఎలాంటి ఆసక్తికర విశేషాలు ఉన్నాయి, రిలీజ్‌ తర్వాత తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఏ విధంగా చేరుకుంది, కలెక్షన్లపరంగా ఎలాంటి రికార్డులు సృష్టించింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

‘బాహుబలి’ వంటి బిగ్‌స్కేల్‌ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆలోచన రాజమౌళికి అంతకుముందే ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ట్రయల్‌గా రామ్‌చరణ్‌తో ‘మగధీర’ చిత్రాన్ని రూపొందించారు. అలాంటి ఫోక్లోర్‌ చిత్రాలను కూడా తాను సమర్థవంతంగా డీల్‌ చెయ్యగలను అని ఆ సినిమాతో ప్రూవ్‌ చేసుకున్నారు. దాంతో ‘బాహుబలి’ ప్రాజెక్ట్‌ మీద రాజమౌళికి కాన్ఫిడెన్స్‌ వచ్చింది. 2009లో ‘మగధీర’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. 40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ సినిమా తర్వాత మర్యాద రామన్న, ఈగ చిత్రాలను రూపొందించి మరో రెండు సూపర్‌హిట్‌లను తన ఖాతాలో వేసుకున్నారు రాజమౌళి. 2010లో మర్యాద రామన్న విడుదలైంది. ఆ మరుసటి సంవత్సరమే రెబల్‌స్టార్‌ ప్రభాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. 2013 జనవరిలో ప్రభాస్‌, రాజమౌళి కాంబినేషన్‌లో ‘బాహుబలి’ వర్కింగ్‌ టైటిల్‌తో సినిమా చేస్తున్నట్టు ఎనౌన్స్‌ చేశారు. 2013 జూలై 6న కర్నూలులోని రాక్‌ గార్డెన్స్‌లో షూటింగ్‌ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్‌ రెండు సంవత్సరాలపాటు జరిగింది.

‘బాహుబలి’ చిత్రం మూడు సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉంది. స్క్రిప్ట్‌కి సంబంధించి సంవత్సర కాలం చర్చలు జరిగాయి. ఆ తర్వాత షూటింగ్‌ రెండు సంవత్సరాలపాటు జరిగింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ఆరు నెలలు కొనసాగాయి. ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ సెట్స్‌ నిర్మించారు. ఈ సెట్స్‌ నిర్మాణం వెనుక వేల మంది కృషి ఉంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు 2000 మంది జూనియర్‌ ఆర్టిస్టులను, 300 గుర్రాలను, డజనుకి ఏనుగులను ఉపయోగించారు. ఈ యుద్ధ సన్నివేశం సినిమాకి పెద్ద హైలైట్‌గా మారింది. ఆ యుద్ధాన్ని చిత్రీకరించిన తీరు చూసి బాలీవుడ్‌ మేకర్స్‌ సైతం ఆశ్చర్యచకితులయ్యారు.

ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు రాజమౌళి. ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకునే ‘బాహుబలి’ సిరీస్‌ను ప్రారంభించారు. ప్రతినాయకుడు భళ్లాళదేవుడు క్యారెక్టర్‌ కోసం దగ్గుబాటి రానాను ఎంపిక చేశారు. వీరిద్దరి తర్వాత సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర శివగామి. ఈ పాత్ర కోసం మొదట శ్రీదేవిని సంప్రదించారు. పారితోషికం అధికంగా డిమాండ్‌ చెయ్యడం వల్లే ఆమెను కాదని.. రమ్యకృష్ణను అప్రోచ్‌ అయ్యామని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాలో ఎంతో కీలకంగా కనిపించే కట్టప్ప క్యారెక్టర్‌ను సత్యరాజ్‌తో చేయించారు. భళ్లాలదేవుడి దుష్ట చర్యలను సమర్థించే తండ్రి పాత్రలో నాజర్‌ కనిపిస్తారు. భళ్లాల దేవుడి చెరలో ఏళ్ల తరబడి మగ్గే దేవసేన పాత్రను అనుష్కతో చేయించారు. పోరాట యోధురాలు అవంతికగా తమన్నా నటించారు. ఈ క్యారెక్టర్ల చుట్టూనే ‘బాహుబలి’ మొదటి భాగం నడుస్తుంది. నటీనటులు వారి వారి క్యారెక్టర్లలో జీవించారని చెప్పాలి. పెర్‌ఫార్మెన్స్‌ విషయంలో ఏ ఒక్కరూ రాజీ పడకుండా రాజమౌళి కోరుకున్న ఎఫెక్ట్‌ను తెచ్చారు.

ఏ ప్రొడక్ట్‌కి అయినా మార్కెటింగ్‌ అనేది చాలా కీలకం. దాన్ని ఈ సినిమా విషయంలో పూర్తి స్థాయిలో వినియోగించారు రాజమౌళి. సినిమా ఎనౌన్స్‌ చేసిన నాటి నుంచి రిలీజ్‌ అయ్యే వరకు.. అంటే దాదాపు 2 సంవత్సరాలపాటు ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో రన్‌ అవుతూనే ఉండేది. తమ సినిమాను ప్రమోట్‌ చేసుకునేందుకు అన్ని మాధ్యమాలను పర్‌ఫెక్ట్‌గా వాడుకున్నారు మేకర్స్‌. దీంతో సినిమాకి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. థియేటర్స్‌లో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు, ప్రభాస్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేశారు. దేశంలోనే కాదు, విదేశాల్లో సైతం భారీ ఓపెనింగ్స్‌తో ‘బాహుబలి.. ది బిగినింగ్‌’ విడుదలై మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ కలెక్షన్ల వర్షం కురిపించింది. అమెరికాలో మొదటి రోజు 15 కోట్లు కలెక్ట్‌ చేసి కొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. అలాగే వరల్డ్‌వైడ్‌గా అన్ని వెర్షన్స్‌ కలిపి మొదటివారం 165 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇండియాలో ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన మొదటి సినిమా బాహుబలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన నాలుగో సినిమా. ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో 391 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఆగస్ట్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు వసూలు చేసింది. ఒక్క ఇండియాలోనే 511 కోట్లు వసూలు చేసిన ఏకైక చిత్రంగా బాహుబలి నిలిచింది. అంతకుముందు ‘పికె’ చిత్రం 440 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దాన్ని బాహుబలి క్రాస్‌ చేసింది. ఈ సినిమా బయ్యర్స్‌కి 180 కోట్లు లాభాల్ని తెచ్చిపెట్టింది. ‘బాహుబలి.. ది బిగినింగ్‌’ రిలీజ్‌ అయి 10 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌.