English | Telugu

55 ఏళ్ళ పద్మాలయా.. సాధించిన విజయాలు, సృష్టించిన రికార్డులు!

ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలన్న ఆలోచనతో పాతరోజుల్లో కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభమయ్యాయి. వాటిలో విజయ వాహిని, అన్నపూర్ణ పిక్చర్స్‌, నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్స్‌, పి.ఎ.పి., భరణి పిక్చర్స్‌... ఇలా పలు సంస్థలు ఎన్నో అపురూపమైన సినిమాలను నిర్మించాయి. ఆ తర్వాత డి.రామానాయుడు సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. 1970వ దశకం వచ్చేసరికి సూపర్‌స్టార్‌ కృష్ణ సారధ్యంలో పద్మాలయా సంస్థ ప్రారంభమైంది. ఈ సంస్థ ద్వారా ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. అలా చిత్ర నిర్మాణ రంగంలో పద్మాలయాకు ఒక విశిష్ట స్థానం లభించింది. పద్మాలయా మూవీస్‌, పద్మాలయా పిక్చర్స్‌, పద్మాలయా స్టూడియోస్‌.. ఇలా పలు బేనర్లలో చిత్రాలను నిర్మించిందీ సంస్థ. తెలుగులో 18, హిందీలో 16, తమిళ్‌లో 3, కన్నడలో ఒక సినిమా.. మొత్తం పద్మాలయా నిర్మించిన సినిమాలు 38. ఈ సంస్థ నిర్మించిన తొలి సినిమా ‘అగ్ని పరీక్ష’ 1970 జూలై 10న విడుదలైంది. పద్మాలయా సంస్థ ప్రారంభమై 55 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంస్థ గురించి, ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాల గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

1965లో తేనెమనసులు చిత్రంతో హీరోగా పరిచయమైన కృష్ణ చాలా తక్కువ సమయంలోనే బిజీ హీరో అయిపోయారు. 5 సంవత్సరాల్లో 48 సినిమాల్లో హీరోగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే తన అభిరుచికి తగ్గ సినిమాలు రావడం లేదనే బాధ ఆయనలో ఉండేది. అందుకే పద్మాలయా మూవీస్‌ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బేనర్‌లో ఉన్న లక్ష్మీదేవి చిత్రాన్ని బాపు గీయగా, పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌ లోగోను క్రియేట్‌ చేశారు. పద్మాలయా మూవీస్‌ బేనర్‌పై తొలి చిత్రంగా అగ్నిపరీక్ష చిత్రాన్ని నిర్మించారు. 1970 జూలై 10న విడుదలైన ఈ చిత్రానికి కె.వరప్రసాదరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆర్థిక విజయం సాధించకపోయినా ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో కృష్ణ, విజయనిర్మల జంటగా నటించారు. తొలి సినిమా విజయం సాధించకపోయినా నిరాశపడలేదు కృష్ణ. అప్పటివరకు ఎవరూ చేయని ఒక విభిన్నమైన సినిమాను నిర్మించాలనుకున్నారు.

అదే సమయంలో గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ, మెకన్నాస్‌ గోల్డ్‌ వంటి సినిమాలు రిలీజ్‌ అయి ఇండియాలోనూ ఘనవిజయం సాధించాయి. ఆ జోనర్‌లో ఒక సినిమా చేస్తే బాగుంటుందన్న ఆలోచన కృష్ణకు వచ్చింది. అప్పటివరకు ఇండియాలోని ఏ భాషలోనూ కౌబాయ్‌ సినిమా రాలేదు. కె.ఎస్‌.ఆర్‌.దాస్‌ దర్శకత్వంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ చిత్రాన్ని ప్రారంభించారు. ఇండియాలోని పలు రేర్‌ లొకేషన్స్‌లో ఈ చిత్రం షూటింగ్‌ జరిగింది. 1971 ఆగస్ట్‌ 27న విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాను తమిళ్‌, హిందీ భాషల్లో కూడా డబ్‌ చేశారు. అలాగే ట్రెజర్‌ హంట్‌ పేరుతో ఇంగ్లీష్‌లోనూ అనువదించారు. ఈ సినిమా లెక్కకు మించిన దేశాల్లో విడుదలై అక్కడ కూడా విజయం సాధించింది. ఒక తెలుగు సినిమా ఇంగ్లీష్‌లోకి అనువాదమై విదేశాల్లో విడుదల కావడం అదే ప్రథమం.

ఆ తర్వాత ఎన్‌.టి.ఆర్‌., కృష్ణ హీరోలుగా నిర్మించిన దేవుడు చేసిన మనుషులు, కృష్ణ హీరోగా నిర్మించిన మాయదారి మల్లిగాడు ఘనవిజయాలు సాధించి పద్మాలయా అగ్ర నిర్మాణ సంస్థగా నిలిచింది. ఈ సంస్థకు, హీరో కృష్ణకు 1974 సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు వంటి హీరోలతో తెరకెక్కించాలని కొందరు నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. కానీ, ఎవరి వల్లా అది కాలేదు. సీతారామరాజు కథతో సినిమా చెయ్యాలనే ఆలోచన కృష్ణకు ఎప్పటి నుంచో వుంది. దాన్ని కార్యరూపంలో పెట్టి ఎన్నో వ్యయప్రయాసలకోచ్చి ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రాన్ని నిర్మించారు. కొంతభాగం షూటింగ్‌ జరిగిన తర్వాత దర్శకుడు వి.రామచంద్రరావు కన్నుమూశారు. మిగిలిన భాగాన్ని తెరకెక్కించే బాధ్యతను కృష్ణ తీసుకొని చిత్రాన్ని పూర్తి చేశారు కృష్ణ. తన కెరీర్‌లో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా కూడా ఇదేనని కృష్ణ స్వయంగా చెప్పారు. ఈ సినిమా 1974 మే 1న విడుదలై సంచలన విజయం సాధించింది. సీతారామరాజుగా నటించిన కృష్ణ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పద్మాలయా బేనర్‌లోనే కురుక్షేత్రం, ఈనాడు చిత్రాలు నిర్మించారు. కురుక్షేత్రం నిరాశపరిచినా ఈనాడు మాత్రం ఘనవిజయం సాధించింది.

చిత్ర నిర్మాణంలో మరింత ముందుకు వెళ్లే ఉద్దేశంతో 1984లో పద్మాలయా స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కృష్ణ. 1986లో విడుదలైన సింహాసనం పద్మాలయా స్టూడియోలో నిర్మాణం జరుపుకున్న మొదటి సినిమా. కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన సినిమా ఇది. తెలుగులో నిర్మించిన తొలి 70ఎంఎం సినిమా ఇదే. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, వంశీ, పండంటి సంసారం వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించింది పద్మాలయా సంస్థ.

తెలుగులో సూపర్‌హిట్‌ అయిన కృష్ణ సినిమాలను హిందీలో జితేంద్ర హీరోగా చాలా సినిమాలు నిర్మించింది పద్మాలయా సంస్థ. ఈ బేనర్‌ ద్వారా 16 హిందీ సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం ఘనవిజయం సాధించిన సినిమాలే ఉండడం విశేషం. తమిళ్‌లో రజినీకాంత్‌తో ఒక సినిమా, శివాజీ గణేశన్‌తో రెండు సినిమాలు నిర్మించారు. కన్నడలో అంబరీష్‌ హీరోగా ఒక సినిమా నిర్మించారు. 2004లో సూపర్‌స్టార్‌ కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన హిందీ చిత్రం ‘ఇష్క్‌ హై తుమ్‌సే’ పరాజయాన్ని చవి చూసింది. ఈ సంస్థ నిర్మించిన చివరి సినిమా ఇదే. పద్మాలయా సంస్థకు ఉన్న రికార్డులు మరే సంస్థకూ లేవంటే అతిశయోక్తి కాదు. తెలుగులో తొలి కౌబాయ్‌ సినిమా ‘మోసగాళ్ళకు మోసగాడు’. ఇంగ్లీష్‌లో అనువాదమై పలు దేశాల్లో విడుదలైన తొలి తెలుగు సినిమా ఇదే. అలాగే తొలి సినిమా స్కోప్‌ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’. ఇలా ఏ నిర్మాణ సంస్థా బ్రేక్‌ చేయలేని రికార్డులను పద్మాలయా తన సొంతం చేసుకుంది.