English | Telugu

ఎనిమిదేళ్ళ వయసులో శవం పక్కన ఒంటరిగా గడిపిన దిలీప్‌కుమార్‌.. ఇంట్రెస్టింగ్ స్టోరీ.!

పాతతరం బాలీవుడ్‌ హీరోల్లో దిలీప్‌కుమార్‌కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పోషించిన పాత్రల ద్వారా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. విషాద రసాన్ని అభినయించడంలో దిలీప్‌కుమార్‌కి చాలా మంచి పేరు ఉంది. అందుకే ఆయన్ని కింగ్‌ ఆఫ్‌ ట్రాజెడీ అనేవారు. అంతేకాదు, కొన్ని సినిమాల్లో హాస్యరసంలోనూ చక్కని అభినయాన్ని కనబరచి కింగ్‌ ఆఫ్‌ కామెడీ అని కూడా అనిపించుకున్నారు. దిలీప్‌ కుమార్‌ది ఒక విభిన్నమైన మనస్తత్వం. ఆయన నలుగురిలో కలిసేవారు కాదు. ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడేవారు. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో కూడా షాట్‌ పూర్తి చేసిన తర్వాత దూరంగా కూర్చునేవారు. అందరికీ ఆయన ప్రవర్తన విచిత్రంగా అనిపించేది. దిలీప్‌ గురించి తెలియనివారు ఆయనకు పొగరు అనుకునేవారు. నిజానికి అలా దూరంగా ఉండడం వెనుక ఒక బలీయమైన కారణం ఉంది. అదేమిటంటే..

దిలీప్‌ చిన్న వయసులో జరిగిన ఓ ఘటన ఆయన మనసులో గాఢమైన ముద్ర వేసింది. అందుకే ఎవరితోనూ కలవకుండా ఒంటరిగానే గడిపేవారు. ఎనిమిదేళ్ళ వయసులో ఉండగా ఆయన బంధువు ఒకరు చనిపోయారు. ఆ మృతదేహాన్ని ఒక గదిలో ఉంచారు. పిల్లలెవరూ ఆ గదిలోకి వెళ్ళకూడదని పెద్దవారు చెప్పారు.  అలా ఎందుకన్నారో దిలీప్‌కి అర్థం కాలేదు. తన స్నేహితుల్ని అడిగినా చెప్పలేదు. అక్కడ ఏముందో తెలుసుకోవాలని ఆ గదిలోకి నెమ్మదిగా వెళ్లాడు. ఈలోగా అక్కడికి వచ్చిన కొందరు తలుపు తీసి ఉండడం గమనించి తలుపు వేసి బయట గడియ పెట్టి వెళ్లిపోయారు. ఆ క్షణం అక్కడ ఉన్న శవాన్ని చూసి ఎంతో భయపడ్డాడు దిలీప్‌. భయంతో కేకలు వేశాడు. తలుపులు బాదుతూ అరవసాగాడు. కానీ, దగ్గరలో ఎవరూ లేకపోవడంతో అతని కేకలు ఎవరికీ వినిపించలేదు. తను ఏ పరిస్థితుల్లో ఉన్నానో చూసుకొని గొల్లున ఏడవడం మొదలుపెట్టాడు. అలా కొన్ని గంటలపాటు మృతదేహంతోనే గడపాల్సి వచ్చింది. 

ఆరోజు జరిగిన ఘటన దిలీప్‌కుమార్‌ మనసుపై ఎంతో ప్రభావం చూపింది. అతనిలో అతిభయం అనేది చోటు చేసుకుంది. ఆ భయంతోనే ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడూ ఇంట్లో ఒంటరిగానే ఉండేవాడు. అలా ఆయనకు ఒంటరితనం అలవాటైపోయింది. ఆ తర్వాత బొంబాయిలో ఉన్నత విద్యను అభ్యసించారు. సినిమాలంటే ఆసక్తి ఉండడం వల్ల నటుడిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించడం ద్వారా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయినా చిన్నతనంలో ఆయన మనసులో పడిన ముద్ర అలాగే ఉండిపోయింది. ట్రాజెడీ పాత్రలను పోషించడంలో అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు అంటారు ఆయన సన్నిహితులు. దిలీప్‌కుమార్‌ సొంతంగా ‘గంగ జమున’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్‌ కోసం ఔట్‌డోర్‌ వెళ్ళారు. షూటింగ్‌ లొకేషన్‌లో యూనిట్‌ సభ్యులు బస చేసేందుకు హోటల్‌లో అందరికీ రూమ్స్‌ ఇప్పించి తను మాత్రం బయటికి వచ్చి ఓ చెట్టు కింద పడుకున్నారట. 1961లో విడుదలైన ‘గంగ జమున’ చిత్రం ఆరోజుల్లో హయ్యస్ట్‌ కలెక్షన్స్‌ సాధించిన చిత్రం రికార్డు సృష్టించింది.