English | Telugu
బయోగ్రఫీః మధుర స్వరాల విశ్వనాథన్!
Updated : Jul 13, 2023
(జూలై 14.. ఎమ్మెస్ విశ్వనాథన్ వర్థంతి సందర్భంగా)
తను "ఏ తీగ పువ్వు" అయినా.. "భలే భలే" బాణీలతో పలు చిత్రసీమల్లో పరిమళించిన సంగీతకుసుమం. "పల్లవించవా నా గొంతులో" అంటూనే "సరిగమలు గలగలలు" వినిపించిన అమరగీతాల గని. "పిల్లలు దేవుడు చల్లనివారే" అంటూ చిన్నారుల భావాలు చాటిచెప్పినా.. "కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళోయ్ వెర్రెక్కిఉన్నోళ్ళు" అంటూ కుర్రకారు హుషారు తెలియజెప్పినా.. "కన్నెపిల్లవని కన్నులున్నవ"ని కవ్విస్తూనే "పదహారేళ్ళ ప్రాయం చేసే చిలిపి పనులు" వ్యక్తపరిచినా.. "మౌనమే నీ భాష ఓ మూగ మనసా" అంటూ మనసు భాషను ఆవిష్కరించినా, "కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు" అంటూ కన్నుల భావాన్ని ప్రకటించినా.. "గాలికి అదుపు లేదు.. కడలికి అంతులేదు" అంటూ వేదాంతం పలికినా, "అరె ఏమిటి ఈ లోకం" అంటూ లోకంపై విరుచుకుపడినా అది ఆ మధుర స్వరానికే చెల్లింది. ఆ స్వరానికి మరోపేరే.. మెలోడీ కింగ్ ఎమ్మెస్ విశ్వనాథన్.
1928 జూన్ 24న కేరళలోని ఎలప్పుల్లి గ్రామంలో జన్మించిన మనయంగద్ సుబ్రమనియన్ విశ్వనాథన్ అలియాస్ ఎమ్మెస్ విశ్వనాథన్ ది.. చిన్నప్పట్నుంచి అనేక మలుపులతో సాగిన జీవితమనే చెప్పాలి. నాలుగేళ్ళ చిరుప్రాయంలోనే విశ్వనాథన్ తండ్రి చనిపోవడంతో.. ఆయన తల్లి కుటుంబ పోషణ భారమై పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలన్నారు. అయితే చివరి నిమిషంలో తాత రక్షించడంతో.. విశ్వనాథన్ జీవితం మరో మలుపు తిరిగింది. ఆనక జైలర్ అయిన మేనమామ చెంత చేరిన ఎమ్మెస్.. ఓ థియేటర్ లో బఠాణీలు అమ్ముతూ సినిమా సంగీతంపై క్రమంగా ఆసక్తి పెంచుకున్నారు. అదే సమయంలో నటుడిగా చిన్న వేషం దక్కినా.. హార్మోనియం నేర్చుకుంటూ ముందుకు సాగారు. ఆ హార్మోనియం అభ్యాసమే.. ప్రముఖ సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బురామన్ వద్ద సహాయకుడిగా అవకాశాన్ని కల్పించింది. అక్కడే వయోలినిస్ట్ అయిన టీకే రామ్మూర్తి తో జరిగిన పరిచయం, సాగిన ప్రయాణం విశ్వనాథన్ జీవితంలో మరో మేలిమలుపు.
'రత్నమాల', 'లైలా మజ్ను', 'చండీరాణి' వంటి చిత్రాలకు సి.ఆర్. సుబ్బురామన్ వద్ద సహాయకులుగా పనిచేసిన విశ్వనాథన్ - రామ్మూర్తి .. 'దేవదాసు' విడుదలకు ముందు సుబ్బురామన్ ఆకస్మికంగా మరణించడంతో 'జగమే మాయ' పాటకు బాణీ కట్టారు. అలాగే అప్పటికే సుబ్బురామన్ ఖాతాలో ఉన్న మరో ఆరు చిత్రాలను కూడా పూర్తిచేశారు. ఆపై విశ్వనాథన్ - రామ్మూర్తి కలిసి 'సంతోషం', 'తెనాలి రామకృష్ణ', 'ఇంటికి దీపం ఇల్లాలే', 'మంచి చెడు', 'ఆడ బ్రతుకు', 'కర్ణ'.. ఇలా దాదాపు 100 సినిమాలకు సంయుక్తంగా స్వరాలు సమకూర్చారు. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో ఈ ద్వయం హవా చాటారు. దాదాపు 13 ఏళ్ళ పాటు ఈ ఇద్దరు జట్టుగా ముందుకు సాగారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు విశ్వనాథన్ - రామ్మూర్తి.
సోలో కంపోజర్ గా టర్న్ అయ్యాక 700కి పైగా చిత్రాలకు ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతమందించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి దక్షిణాది భాషలకే పరిమితం కాకుండా హిందీ చిత్ర పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు ఎమ్మెస్. ఇక ఎంతోమంది దర్శకులతో ఎమ్మెస్ ప్రయాణం సాగినా.. కె. బాలచందర్ కాంబినేషన్ ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. 'సత్తెకాలపు సత్తెయ్య', 'అంతులేని కథ', 'మరో చరిత్ర', 'ఇది కథ కాదు', 'అందమైన అనుభవం', 'గుప్పెడు మనసు', '47 రోజులు', 'తొలి కోడి కూసింది', 'కోకిలమ్మ'.. ఇలా ఈ కలయికలో వచ్చిన చిత్రాలన్నీ సంగీతం పరంగా భలేగా మెప్పించాయి. అంతేకాదు.. 'లేత మనసులు', 'మనసే మందిరం', 'సింహబలుడు', 'చిలకమ్మ చెప్పింది', 'పెళ్ళీడు పిల్లలు', 'సామ్రాట్ అశోక' వంటి ఇతర దర్శకుల చిత్రాలూ విశ్వనాథన్ ఖాతాలో ఉన్నాయి. ఇక ఎందరో నేపథ్యగాయకులు, గీత రచయితలు ఎమ్మెస్ విశ్వనాథన్ స్వరకల్పనతోనే వెలుగులోకి వచ్చారు.
సంగీత దర్శకుడిగా విశేషంగా రాణించిన ఎమ్మెస్.. గాయకుడిగానూ తనదైన ముద్రవేశారు. అలాగే నటుడిగా ఎనిమిది తమిళ చిత్రాల్లో కనిపించిన విశ్వనాథన్.. బుల్లితెరపైనా సందడి చేశారు. తమిళనాట 'మెల్లిసై మన్నార్'గా పేర్గాంచిన ఎమ్మెస్ విశ్వనాథన్.. 'మెలోడీ కింగ్'గా మన్ననలు పొందారు. నాటి ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా 'తిరై ఇసై చక్రవర్తి' బిరుదుతో సన్మానం పొందారు. 2015 జూలై 14న భౌతికంగా మనల్ని వీడిన విశ్వనాథన్.. తన స్వరాలతో మాత్రం ఎప్పటికీ చేరువగానే ఉంటారు.