English | Telugu
కాంతారావు 'భలే మొనగాడు'కి 55 ఏళ్ళు.. విఠలాచార్య మార్క్ జానపద చిత్రం
Updated : Jul 12, 2023
'జానపదబ్రహ్మ'గా తెలుగునాట ప్రత్యేక గుర్తింపు పొందారు దర్శకుడు బి. విఠలాచార్య. కథానాయకుడు కాంతారావు కూడా పలు జానపద చిత్రాలతో ఆకట్టుకున్నారు. అలాంటి ఈ ఇద్దరి కలయికలో కొన్ని సినిమాలు తెరకెక్కాయి. వాటిలో 'భలే మొనగాడు' ఒకటి. కృష్ణకుమారి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జూనియర్ ఏవీ సుబ్బారావు, చలం, విజయలలిత, వీజే శర్మ, రామదాసు, త్యాగరాజు, పొట్టి వీరయ్య ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. వీటూరి కథ, మాటలు సమకూర్చారు.
విజేతపుర రాజ్యానికి చెందిన రాకుమారి (కృష్ణకుమారి)ని పెళ్ళాడడానికి విజయసేనుడు (కాంతారావు) అనే యువకుడు చేసిన సాహసాల నేపథ్యంలో 'భలే మొనగాడు' రూపొందింది. పక్కా విఠలాచార్య మార్క్ తో సాగే ఈ జానపద చిత్రానికి ఎస్పీ కోదండపాణి అందించిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. "మనిషి తలుచుకుంటే గిరులు ఝరులు పొంగవా", "ఇంద ఇంద తీసుకో", "కవ్వించేలేరా", "ఏ ఊరు నీ పయనం", "ఏలుకొను రాజు", "సిన్నదాన్నిరా" అంటూ సాగే గీతాలు ఆకట్టుకున్నాయి. సునందిని పిక్చర్స్ పతాకంపై పి. మల్లికార్జునరావు నిర్మించిన 'భలే మొనగాడు'.. 1968 జూలై 12న జనం ముందు నిలిచింది. నేటితో ఈ జానపద చిత్రం 55 వసంతాలు పూర్తిచేసుకుంది.