English | Telugu
"ఊహలు గుసగుసలాడే".. ఎన్టీఆర్ 'బందిపోటు'కి 60 ఏళ్ళు !
Updated : Aug 14, 2023
నటరత్న నందమూరి తారక రామారావు, జానపద బ్రహ్మ బి. విఠలాచార్య కాంబినేషన్ లో పలు చిత్రాలు వచ్చాయి. వీటిలో సింహభాగం బాక్సాఫీస్ ముంగిట సంచలనం సృష్టించాయి. వాటిలో 'బందిపోటు' ఒకటి. ఎన్టీఆర్, బి. విఠలాచార్య కలయికలో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇందులో ఎన్టీఆర్ కి జంటగా కృష్ణకుమారి నటించగా.. రాజనాల, చిత్తూరు నాగయ్య, గుమ్మడి, రేలంగి, రమణారెడ్డి, మిక్కిలినేని, వంగర, రాజబాబు, బాలకృష్ణ, గిరిబాబు, ఈవీ సరోజ, లీలావతి, పుష్పవల్లి, మీనా కుమారి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. త్రిపురనేని మహారథి కథ, మాటలు అందించగా.. బి. విఠలాచార్య స్క్రీన్ ప్లే సమకూర్చారు. రాజలక్ష్మి ప్రొడక్షన్స్ పతాకంపై సుందరలాల్ నహతా, డూండీ నిర్మించారు.
ఘంటసాల సంగీతమందించిన ఈ చిత్రానికి దాశరథి, సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, కొసరాజు సాహిత్యమందించారు. ఇందులోని "ఊహలు గుసగుసలాడే", "వగలరాణివి నీవే" పాటలు బాగా ప్రాచుర్యం పొందగా "మల్లియల్లో మల్లియల్లో", "ఊ అంటే తెలియని", "అంతా నీ కోసం", "మంచితనం కలకాలం" అంటూ సాగే గీతాలు కూడా రంజింపజేశాయి. 1963 ఆగస్టు 15న విడుదలై ఘనవిజయం సాధించిన 'బందిపోటు'.. మంగళవారంతో 60 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.