English | Telugu
దర్శకేంద్రుడితో శ్రీదేవి ఫస్ట్ ఫిల్మ్.. శోభన్, జయసుధ, తలైవా మిస్.. అప్పుడే 45 ఏళ్ళయిందా!?
Updated : Aug 31, 2023
అతిలోక సుందరి శ్రీదేవి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబోలో 23 సినిమాలు వచ్చాయి. వాటిలో సింహభాగం ఘనవిజయం సాధించాయి. అలా సంచలనం సృష్టించిన సినిమాల్లో.. 'పదహారేళ్ళ వయసు' ఒకటి. రాఘవేంద్రరావు, శ్రీదేవి కాంబోలో ఇదే ఫస్ట్ ఫిల్మ్ కావడం విశేషం. అయితే, ఇది ఒరిజినల్ మూవీ కాదు. తమిళంలో భారతీరాజా రూపొందించిన సెన్సేషనల్ మూవీ '16 వయతినిలే'కి రీమేక్. శ్రీదేవి, కమల్ హాసన్, రజినీకాంత్ నటించిన సదరు తమిళ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతమందించారు. ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. ఇందులో శ్రీదేవితో పాటు చంద్రమోహన్, మోహన్ బాబు, నిర్మలమ్మ, నవకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. వాస్తవానికి ఈ సినిమా కోసం శ్రీదేవి నటించిన పాత్రలో జయసుధ, చంద్రమోహన్ అభినయించిన పాత్రలో శోభన్ బాబు, మోహన్ బాబు పోషించిన వేషంలో రజినీకాంత్ నటించాల్సింది. కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు.
16 ఏళ్ళ ప్రాయంలో మల్లి (శ్రీదేవి) అనే అమ్మాయికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొంది? అనేదే 'పదహారేళ్ళ వయసు' సినిమా. చక్రవర్తి బాణీలు కట్టిన ఈ చిత్రంలో "సిరిమల్లె పువ్వా" (రెండు వెర్షన్స్), "పువ్వు లాంటి మల్లి పుష్ఫించెనమ్మా", "కట్టుకథలు చెప్పి నేను నవ్విస్తే", "వయసంతా ముడుపుకట్టి", "పంటచేలో పాలకంకి నవ్వింది" అంటూ సాగే పాటలు విశేషాదరణ పొందాయి. రాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై అంగర సత్యం, మిద్దే రామారావు, అంగర లక్ష్మణరావు నిర్మించిన 'పదహారేళ్ళ వయసు'.. 1978 ఆగస్టు 31న జనం ముందు నిలిచింది. విడుదలైన దాదాపు ప్రతీ థియేటర్ లోనూ శతదినోత్సవం జరుపుకున్న ఈ సంచలన చిత్రం.. నేటితో 45 వసంతాలు పూర్తిచేసుకుంది.