English | Telugu
కృష్ణ 'సింహగర్జన'కి 45 ఏళ్ళు.. ఎన్టీఆర్ సినిమాపై పోటీ..!
Updated : Aug 25, 2023
నటరత్న నందమూరి తారక రామారావు, నటశేఖర కృష్ణ సినిమాల మధ్య పలు పర్యాయాలు బాక్సాఫీస్ వార్ జరిగింది. మరీముఖ్యంగా.. 1977 సంక్రాంతికి ఒకే కథాంశంతో 'దాన వీర శూర కర్ణ', 'కురుక్షేత్రం' చిత్రాలు పోటీపడ్డాయి. వీటిలో ఎన్టీఆర్ 'దాన వీర శూర కర్ణ' సంచలన విజయం సాధించింది. ఇదే తరహాలో 1978 ఆగస్టులోనూ రెండు వారాల వ్యవధిలో ఒకే జోనర్ (జానపదం)లో వీరి సినిమాలు పోటీపడ్డాయి. ఎన్టీఆర్ నటించిన 'సింహబలుడు' ఆగస్టు 11న జనం ముందు నిలిస్తే.. కృష్ణ నటించిన 'సింహగర్జన' ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో 'సింహబలుడు' భారీ బడ్జెట్ కారణంగా యావరేజ్ గా నిలిస్తే.. 'సింహగర్జన' మాత్రం మంచి విజయం సాధించింది.
ఇక 'సింహగర్జన' సినిమా విషయానికి వస్తే.. మత్తగజాల కుంభస్థలాలపై లంఘించి, గర్జనలు చేసి చీల్చి చెండాడిన ఇద్దరు కొదమ సింగాల్లాంటి యువకుల పరాక్రమ విక్రమాల స్వైర్య విహార గాథ ఇది. ఇందులో పగలు అనే మారుపేరుతో సాగే శివ వర్మ అనే యువకుడి పాత్రలో కృష్ణ కనిపిస్తే.. రాత్రి అనే మారుపేరుతో సాగే కేశవ వర్మ అనే యువకుడి వేషంలో గిరిబాబు దర్శనమిచ్చారు. అలాగే దుష్టులైన రాకుమారుల పాత్రల్లో మోహన్ బాబు, శరత్ బాబు అలరించగా.. గుమ్మడి, కాంతారావు, ధూళిపాళ, కేవీ చలం, సంగీత, అంజలీ దేవి, జయమాలిని, త్యాగరాజు, మిక్కిలినేని, జగ్గారావు, రమాప్రభ, పుష్ప కుమారి, జయవాణి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక కృష్ణకి జంటగా లత సందడి చేశారు. హాస్య బ్రహ్మ జంధ్యాల సంభాషణలు సమకూర్చిన ఈ సినిమాకి కొమ్మినేని దర్శకత్వం వహించారు.
పాటల విషయానికి వస్తే.. చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన గీతాలకు ఆచార్య ఆత్రేయ, సి. నారాయణరెడ్డి, ఆరుద్ర, గోపి, జాలది, నాగభైరవి సాహిత్యమందించారు. ఇందులోని "కత్తులు కలిసిన శుభసమయంలో", "అమ్మ రావే తల్లి రావే", "సాహసమే మా జీవమురా", "తొలకరి సొగసులు", "అమ్మా దుర్గా మాత" అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. గిరిబాబు సమర్పణలో జయభేరి ఇంటర్నేషనల్స్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు, యర్రా శేషగిరి రావు నిర్మించిన 'సింహగర్జన'.. 1978 ఆగస్టు 26న విడుదలైంది. శనివారంతో ఈ జనరంజక చిత్రం 45 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.