English | Telugu

చిరుకి 'మెగాస్టార్' టైటిల్ ఇచ్చిన సినిమాకి 35 ఏళ్ళు.. ఆ చిత్రమేంటో తెలుసా!

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎందరో స్టార్స్  ఉన్నారు. అయితే.. మెగాస్టార్ మాత్రం ఒక్కరే. అతడే.. చిరంజీవి. 1978లో విడుదలైన 'ప్రాణం ఖరీదు' చిత్రంతో తెరంగేట్రం చేసిన చిరు.. కెరీర్ ఆరంభంలో ఎన్నో విజయాలు చూసినా 1983లో రిలీజైన 'ఖైదీ'తోనే స్టార్ డమ్ చూశారు. తదుపరి ప్రయాణంలోనూ పలు సంచలనాలకు చిరునామాగా నిలిచారు చిరు. ఈ క్రమంలో తన పేరుకి ముందు ఎన్నో టైటిల్స్ తోడయ్యాయి. అయితే ఎక్కువ కాలంగా వినిపిస్తున్న బిరుదు మాత్రం మెగాస్టార్ నే. గత 35 ఏళ్ళుగా ఈ టైటిల్ చిరుకి పర్యాయపదంగా మారింది.  

ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. 'ఖైదీ' చిత్రం టైటిల్స్ లో తన పేరు ముందు ఎలాంటి బిరుదు ఉండదు. అయితే, తరువాత వచ్చిన సినిమాల టైటిల్స్ లో 'నటకిశోర', 'డైనమిక్ హీరో', 'యంగ్ డైనమిక్ అండ్ డేరింగ్ హీరో',  'డేరింగ్ డాషింగ్', 'సుప్రీమ్ హీరో', 'సుప్రీమ్ స్టార్'  వంటివి జోడించారు. ఇక 'మెగాస్టార్' అనే టైటిల్ ట్యాగ్ ని ఇచ్చింది మాత్రం.. 1988లో విడుదలైన 'మరణ మృదంగం' కోసమే. అలా మెగాభిమానులకు ఎంతో స్పెషల్ గా నిలిచిన 'మరణ మృదంగం' చిత్రం విడుదలై.. ఈ ఆగస్టు 4కి సరిగ్గా 35 ఏళ్ళు. ఈ సందర్భంగా 'మరణ మృదంగం' సినిమా తాలూకు ఙ్ఞాపకాల్లోకి వెళితే.. 

* 'అభిలాష', 'ఛాలెంజ్', 'రాక్షసుడు' వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ తరువాత చిరంజీవి, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, సంగీత దర్శకుడు ఇళయరాజా, నిర్మాత కె.ఎస్. రామారావు, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'మరణ మృదంగం'. 

* 'రాక్షసుడు'లో కథానాయికలుగా నటించిన రాధ, సుహాసిని.. ఇందులోనూ చిరుకి జోడీగా సందడి చేశారు. 

* యండమూరి రచించిన 'మరణ మృదంగం' నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.  

* 'అభిలాష', 'ఛాలెంజ్', 'రాక్షసుడు' తరహాలో ఈ చిత్రం అఖండ విజయం సాధించకపోయినా.. హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది.

* ఈ సినిమాలోని పాటలన్నింటికీ దిగ్గజ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించారు.

* "కరిగిపోయాను", "సరిగమ పదనిస", "కొట్టండి తిట్టండి", "గొడవే గొడవమ్మా", "జుంగిలి జిమా".. ఇలా ఇందులోని గీతాలన్ని విశేషాదరణ పొందాయి. 

* "గొడవే గొడవమ్మా" పాటకి చిరంజీవి స్వయంగా కొరియోగ్రఫీ అందించడం విశేషం.