English | Telugu
చిరంజీవి 'చూడాలని వుంది!'కి పాతికేళ్ళు.. మణిశర్మ స్థాయిని పెంచిన బ్లాక్ బస్టర్ !
Updated : Aug 26, 2023
మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యూసర్ సి. అశ్వనీదత్ ది హ్యాట్రిక్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే.. రెండో చిత్రం 'చూడాలని వుంది!' ఘనవిజయం సాధించింది. ఇక మూడో సినిమా అయిన 'ఇంద్ర' పలు రికార్డులను భూస్థాపితం చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వాస్తవానికి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' తరువాత అశ్వనీదత్.. చిరంజీవితో ఒకట్రెండు ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసినప్పటికీ అవి కొంతమేర నిర్మాణం జరుపుకుని ఆగిపోయాయి. దాంతో.. భారీ విరామం అనంతరం చిరు, దత్ కాంబోలో రెండో సినిమాగా 'చూడాలని వుంది' వెలుగులోకి వచ్చింది.
అండర్ వరల్డ్ డాన్ చేతిలో చిక్కుకుపోయిన తన కొడుకుని రక్షించుకోవడం కోసం.. రామకృష్ణ (చిరంజీవి) అనే ఓ తండ్రి చేసిన అన్వేషణ, పోరాటమే 'చూడాలని వుంది' సినిమా. కలకత్తా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఒక బిడ్డకి తండ్రిగా కనిపించి అలరించారు చిరు. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రైల్వే స్టేషన్ ఎపిసోడ్ లో లవర్ బాయ్ గానూ భలేగా ఎంటర్టైన్ చేశారు. అదేవిధంగా సౌందర్యతో సాగే సన్నివేశాల్లోనూ సరదాలు పంచారు. ఇక నృత్యాల్లోనూ, పోరాటాల్లోనూ తనదైన శైలిలో రంజింపజేశారు.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన 'చూడాలని వుంది'కి మెలోడీబ్రహ్మ మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమాతో స్వరకర్తగా మణిశర్మ దశ, దిశ మారిపోయిందనే చెప్పాలి. "యమహా నగరి", "రామ్మా చిలకమ్మా", "ఓ మారియా ఓ మారియా", "సింబలే సింబలే", "అబ్బబ్బా ఇద్దూ", "మనస్సా ఎక్కడున్నావ్".. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పట్లో సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. ఇక నేపథ్య సంగీతం సరేసరి. ఈ చిత్రానికిగానూ ఇటు 'నంది', అటు 'ఫిల్మ్ ఫేర్' అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు మణిశర్మ.
చిరంజీవికి జోడీగా సౌందర్య, అంజలా ఝవేరి నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ప్రతినాయకుడిగా నటించగా.. బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ధూళిపాళ, వేణుమాధవ్, మాస్టర్ తేజ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. తెలుగునాట శతదినోత్సవం జరుపుకున్న 'చూడాలని వుంది!'.. హిందీలో 'కలకత్తా మెయిల్' పేరుతో రీమేక్ అయింది. 1998 ఆగస్టు 27న రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన 'చూడాలని వుంది!'.. ఆదివారంతో 25 ఏళ్ళు పూర్తిచేసుకుంటోంది.