English | Telugu

వేణు 'కళ్యాణ రాముడు'కి 20 ఏళ్ళు.. 'చిరునవ్వుతో' కాంబో రిపీట్!

వైవిద్యానికి పెద్దపీట వేసే కథానాయకుల్లో తొట్టెంపూడి వేణు ఒకరు. 'స్వయంవరం', 'చిరునవ్వుతో' చిత్రాలతో అప్పటి యువతరాన్ని విశేషంగా అలరించిన వేణు.. 'హనుమాన్ జంక్షన్', 'పెళ్ళాం ఊరెళితే' వంటి మల్టిస్టారర్ మూవీస్ తోనూ ఎంటర్టైన్ చేశారు. ఈ విజయవంతమైన సినిమాల తరువాత వేణు నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనరే 'కళ్యాణ రాముడు'. 2002 నాటి మలయాళ చిత్రం 'కళ్యాణ రామన్' (దిలీప్, నవ్యా నాయర్) ఆధారంగా రూపొందిన ఈ కుటుంబ కథా చిత్రంలో.. వేణు కి జోడీగా నికిత నటించగా ప్రభుదేవా, సుమన్, నాజర్, సునీల్, ఎమ్మెస్ నారాయణ, చిత్తజల్లు లక్ష్మీపతి, రాజా రవీంద్ర, రఘుబాబు, జేవీ సోమయాజులు, అల్లు రామలింగయ్య, గిరిధర్, సన తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.

కథ విషయానికి వస్తే..  ఈవెంట్ మేనేజర్ అయిన కళ్యాణ రాముడు (వేణు).. ఓ కళ్యాణ మండపంలో పరిచయమైన కళ్యాణి (నికిత)తో క్రమంగా ప్రేమలో పడతాడు. అయితే రాము కుటుంబానికో చరిత్ర ఉంటుంది. అదేమిటంటే.. ఆ ఇంటికి కోడళ్ళుగా వెళ్ళిన వారు సంపూర్ణ ఆయుర్దాయంతో బతకరు. కళ్యాణి అక్క విషయంలోనూ ఇదే జరుగుతుంది.  ఈ నేపథ్యంలో.. రాము, కళ్యాణి పెళ్ళి జరిగిందా? లేదా? అన్నదే మిగిలిన సినిమా. వినోదానికి పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన ఈ సుఖాంత కథ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది.

'చిరునవ్వుతో' (2000) వంటి ఘనవిజయం తరువాత వేణు - దర్శకుడు జి. రామ్ ప్రసాద్ - ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ - మెలోడీబ్రహ్మ మణిశర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా విజయపథంలో పయనించింది. ఇక పాటల విషయానికి వస్తే.. "ప్రేమించుకున్నవాళ్ళు" మినహాయిస్తే మిగిలినవన్నీ ఒరిజినల్ వెర్షన్ లోనివే యథాతథంగా వాడుకున్నారు. వాటికి బెర్నీ - ఇగ్నటియస్ బాణీలు కట్టారు. కాగా 2003 జూలై 18న జనం ముందు నిలిచిన 'కళ్యాణ రాముడు'.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.