Read more!

English | Telugu

బాలీవుడ్‌ వెళ్తున్న తెలుగు డైరెక్టర్‌.. రణవీర్‌సింగ్‌తో ప్లానింగ్‌!

ఏ డైరెక్టర్‌ అయినా తను చేసే సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలనే కోరుకుంటాడు. తన సినిమాతో ఆడియన్స్‌ని మెప్పించాలనే చూస్తాడు. అయితే ఒక్కోసారి వారి అంచనాలు తారుమారు అవుతూ ఉంటాయి. ఎంతో హోప్స్‌ పెట్టుకొని, మరెంతో కష్టపడి చేసిన సినిమాలను ప్రేక్షకులు తిప్పి కొడుతుంటారు. అలాంటి అనుభవమే ‘ఏజెంట్‌’ సినిమాతో ఎదురైంది దర్శకుడు సురేందర్‌రెడ్డికి. ఇప్పటివరకు అతను డైరెక్ట్‌ చేసిన సినిమాలు పది. వాటిలో అతనొక్కడే, కిక్‌, రేసుగుర్రం, ధృవ, సైరా చిత్రాలు అతని కెరీర్‌లో హిట్‌ సినిమాలుగా నిలిచాయి. అయితే గత ఏడాది అఖిల్‌తో చేసిన ‘ఏజెంట్‌’ అతని కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌ అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత చాలా మంది హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. గత ఏడాది పవన్‌కళ్యాణ్‌తో సురేందర్‌రెడ్డి సినిమా చెయ్యబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. అయితే పవన్‌కళ్యాణ్‌ ఇప్పటికే మూడు సినిమాలు పూర్తి చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం రాజకీయంగా ఎంతో బిజీగా ఉన్న పవన్‌ ఆ సినిమాలను పూర్తి చేయలేకపోతున్నాడు. పైగా ఎలక్షన్స్‌ కూడా రాబోతున్నాయి. ఆ హడావిడి అంతా ముగిస్తేగానీ అతను షూటింగ్‌కి వచ్చే అవకాశం లేదు. 

ఈ పరిస్థితుల్లో సురేందర్‌రెడ్డికి పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం లేదు. తెలుగు హీరోల నుంచి సరైన స్పందన రాకపోవడంతో బాలీవుడ్‌లో తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు సురేందర్‌. ఈమధ్యకాలంలో బాలీవుడ్‌లో భారీ విజయాల్ని అందుకున్న జవాన్‌, యానిమల్‌ సినిమాల దర్శకులు అట్లీ, సందీప్‌రెడ్డి వారే కావడంతో సౌత్‌ నుంచి తమని ఏ డైరెక్టర్‌ సంప్రదించినా అక్కడి హీరోలు పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ హీరో రణవీర్‌సింగ్‌ తన నెక్స్‌ట్‌ మూవీ సురేందర్‌రెడ్డితో చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. సురేందర్‌ చెప్పి లైన్‌ రణవీర్‌కి నచ్చడంతో పూర్తి సబ్జెక్ట్‌ గురించి చర్చించేందుకు ముంబై రావాల్సిందిగా సురేందర్‌రెడ్డిని ఆహ్వానించాడట. అతను చెప్పిన పూర్తి స్క్రిప్ట్‌ రణవీర్‌కి నచ్చితే ఈ సంవత్సరంలోనే సినిమా స్టార్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ‘ఏజెంట్‌’ చిత్రం సురేందర్‌కి మంచి గుణపాఠం నేర్పింది కాబట్టి ఈసారి ఆచి తూచి అడుగేసే అవకాశం ఉంది కాబట్టి సబ్జెక్ట్‌, బడ్జెట్‌ విషయాల్లో ఫుల్‌ క్లారిటీతో ముందుకెళ్తున్నాడు సురేందర్‌రెడ్డి. ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయితే సురేందర్‌రెడ్డి చేసే మొదటి బాలీవుడ్‌ సినిమా ఇదే అవుతుంది.