English | Telugu

మిథున్‌ చక్రవర్తికి గుండెపోటు.. ఆందోళనలో అభిమానులు!

బాలీవుడ్‌ సీనియర్‌ హీరో మిథున్‌ చక్రవర్తి అస్వస్థతతో కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రి చేరారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం గుండె నొప్పి రావడంతో వెంటనే ఆయన్ని హాస్పిటల్‌కి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే వివరాలు వెల్లడిరచలేదు ఆస్పత్రి వర్గాలు. గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు మిథున్‌. రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్‌ జరిగింది. ఇప్పుడు గుండె నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. మిథున్‌ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

1976లో ‘మృగయా’ అనే బెంగాలి చిత్రంతో పరిచయమైన మిథున్‌ చక్రవర్తి తొలి చిత్రంతోనే ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోగా ఎంతో పాపులర్‌ అయ్యారు. 1982 వరకు పాతికపైగా సినిమాల్లో నటించిన మిథున్‌ ‘డిస్కో డాన్సర్‌’ చిత్రంతో తిరుగులేని హీరోగా ఎదిగారు. తన డాన్సులతో యూత్‌ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు పలు భాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించారు. మూడుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ ఏడాది మిథున్‌కు పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించించి కేంద్ర ప్రభుత్వం.