English | Telugu
తాప్సీ సొంత ప్రొడక్షన్ కంపెనీ.. ఔట్‌సైడర్స్ ఫిలిమ్స్!
Updated : Jul 15, 2021
ఇటు సౌత్, అటు నార్త్ ఇండియన్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న తాప్సీ కొంత కాలంగా వరుస హిట్లతో కెరీర్‌లో ముందుకు దూసుకుపోతోంది. నటిగా ఒక దశాబ్దం కెరీర్‌ను కంప్లీట్ చేసిన ఆమె.. తన కెరీర్‌లో మరో మైలురాయిని చేర్చుకుంది. సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించింది. దాని పేరు.. 'ఔట్‌సైడర్స్ ఫిలిమ్స్'.ఇండస్ట్రీలో ఇన్‌సైడర్స్, ఔట్‌సైడర్స్ అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె తన ప్రొడక్షన్ హౌస్‌కు ఇలాంటి పేరు పెట్టడం గమనార్హం.
ఆమెతో పాటు ప్రాణ్‌జల్ ఖంద్‌డియా ఈ ప్రొడక్షన్ హౌస్‌లో పార్టనర్‌గా వ్యవహరించనున్నాడు. కంటెంట్ క్రియేటర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఆయనకు 20 ఏళ్ల అనుభవం ఉంది. సూపర్ 30, 83, సూర్మ, పికు, ముబారకన్, అజార్ లాంటి పేరుపొందిన సినిమా ప్రొడక్షన్‌లో ఆయన పాలుపంచుకున్నాడు. తాప్సీ నాయికగా 'రష్మీ రాకెట్' సినిమాని నిర్మిస్తున్నాడు.
సొంత నిర్మాణ సంస్థను లాంచ్ చేసిన సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ, "కొత్త జర్నీని ప్రారంభిస్తున్నందుకు, సినిమాపై నా ప్రేమను 'ఔట్‌సైడర్స్ ఫిలిమ్స్'తో విస్తరిస్తున్నందుకూ థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. సొంత ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటుచేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. 11 సంవత్సరాల నా కెరీర్‌లో ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ నాకిచ్చిన సపోర్ట్ కానీ, నాపై చూపించిన ప్రేమ కానీ అనిర్వచనీయమైనవి. ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే 'ఔట్‌సైడర్స్ ఫిలిమ్స్'ను స్టార్ట్ చేస్తున్నాను. నాలాగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావంతులకు ఇదొక వేదిక. అలాగే తెర ముందు, తెర వెనుక కూడా కొత్త ప్రతిభావంతులకు నేను, ప్రాణ్‌జల్ తలుపులు తెరిచి ఉంచుతున్నాం." అని చెప్పింది.