English | Telugu

మనోజ్‌ లాంటి నీచుడిని తానింతవరకు చూడలేదు.. సునీల్ షాకింగ్ కామెంట్స్!

పోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌ కుంద్రాను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ వివాదంపై కమెడియన్‌ సునీల్‌ పాల్‌ స్పందించాడు. రాజ్‌ కుంద్రాను అరెస్ట్ చేసినందుకు ఓ వైపు పోలీసులను అభినందిస్తూనే.. మరోవైపు మనోజ్‌ భాజ్‌పాయ్‌, పంకజ్‌ త్రిపాఠి వంటి నటులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పోర్నోగ్రఫీ రాకెట్‌ గుట్టు రట్టు చేసి.. రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేయడం సబబైనదే అని సునీల్‌ పాల్‌ అన్నారు. అంతేకాదు, సెన్సార్‌ లేకపోవడంతో కొందరు పెద్ద తలకాయలు అడ్డగోలుగా వెబ్‌సిరీస్‌లు తీస్తున్నారని.. అవి ఇంట్లోవాళ్లతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయని విమర్శించారు. మనోజ్‌ భాజ్‌ పాయ్‌ పెద్ద నటుడే కావచ్చు. కానీ అతని లాంటి సభ్యత లేని వ్యక్తిని, నీచుడిని తానింతవరకు చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అతడు నటించిన ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌ లో.. భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో సంబంధం, మైనర్‌ బాలికకు బాయ్‌ ఫ్రెండ్‌, చిన్న పిల్లాడు వయసుకు మించి ప్రవర్తించడం.. ఓ కుటుంబం ఇలా ఉంటుందా? ఇవా మీరు చూపించేది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక పంకజ్‌ త్రిపాఠి నటించిన మీర్జాపూర్‌ పనికిరాని వెబ్‌ సిరీస్‌ అని.. అందులో చేసిన వాళ్లంటేనే తనకు అసహ్యమని సునీల్‌ పాల్‌ అన్నారు. పోర్న్‌ పై నిషేధం విధించినట్లుగానే ఈ పనికిరాని వెబ్‌ సిరీస్‌ లను కూడా బ్యాన్‌ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం కళ్లకు కనిపించేదే కాదు, ఆలోచనల్ని చెడగొట్టేది కూడా పోర్న్‌ కిందకే వస్తుందని సునీల్‌ పాల్‌ వ్యాఖ్యానించారు.