English | Telugu

'సూప‌ర్ డాన్స‌ర్' షో షూటింగ్‌కు మ‌ళ్లీ డుమ్మా కొట్టిన శిల్పాశెట్టి!

డాన్స్ రియాలిటీ షో 'సూప‌ర్ డాన్స‌ర్' సీజ‌న్ 4కు శిల్పాశెట్టి ఒక జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. అశ్లీల చిత్రాల కేసులో భ‌ర్త రాజ్ కుంద్రాను జూలై 19న ముంబై పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో శిల్ప మాన‌సిన వేద‌న‌కు గురైంది. దాంతో గ‌త‌వారం 'సూప‌ర్ డాన్సర్' షో షూటింగ్‌కు హాజ‌రు కాలేక‌పోయింది. నెక్ట్స్ ఎపిసోడ్‌కు సంబంధించి మంగ‌ళ‌వారం ఈ షో షూటింగ్ నిర్వ‌హించ‌గా, మ‌రోసారి శిల్ప డుమ్మా కొట్టింది. ఆ షో నిర్వాహ‌కుల‌కు ఆమె అందుబాటులో లేకుండా పోయిందంటున్నారు.

జూలై 19 నుంచి కూడా షో నిర్వాహ‌కులతో కానీ, చాన‌ల్ వారితో కానీ శిల్ప క‌మ్యూనికేష‌న్‌లో లేద‌ని తెలుస్తోంది. ఈ కిడ్స్ రియాలిటీ షోకు డైరెక్ట‌ర్ అనురాగ్ బ‌సు, కొరియోగ్రాఫ‌ర్ గీతా క‌పూర్ కూడా జ‌డ్జిలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శిల్ప గైర్హాజ‌రీతో సెల‌బ్రిటీ క‌పుల్ రితీశ్ దేశ్‌ముఖ్‌, జెనీలియా డిసౌజాల‌ను గెస్ట్‌లుగా పిలిచి, వారితో షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. గ‌త‌వారం శిల్ప షూటింగ్‌కు డుమ్మా కొట్ట‌డంతో, ఆమె చైర్‌లో స్టార్ గెస్ట్‌గా క‌రిష్మా క‌పూర్ కూర్చుంది.

పోయిన శుక్ర‌వారం జుహూలోని వారి ఇంటిలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు త‌నిఖీలు చేప‌ట్టిన‌ప్పుడు శిల్పా, రాజ్.. వారితో వాగ్వాదానికి దిగారంటూ ప్ర‌చారంలోకి వ‌చ్చింది. త‌న భ‌ర్త కార్య‌కలాపాలు త‌న‌కు తెలీవంటూ శిల్ప ఏడ్చింద‌ని పోలీసు వ‌ర్గాలు తెలిపాయి.