Read more!

English | Telugu

Sharukh Target 3000 Crores: మీకు తెలుసా.. షారూక్‌ ఖాన్‌ టార్గెట్‌ 3,000 కోట్లు!

బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ ఈ సంవత్సరం వరసగా రెండు బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పఠాన్‌’ ఈ ఏడాది జనవరి 25న వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. అప్పటికి షారూక్‌ ఖాన్‌ కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది ‘పఠాన్‌’. ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లు కలెక్షన్‌తో రికార్ట్‌ క్రియేట్‌ చేసింది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో రూపొందిన ‘జవాన్‌’ సెప్టెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి రూ.1150 కోట్లు కలెక్ట్‌ చేసింది. ప్రస్తుతం షారూక్‌ ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ ‘డంకీ’ పైనే అందరి దృష్టీ ఉంది. సాధారణంగా స్టార్‌ హీరోలు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. కానీ, షారూక్‌ మాత్రం స్పీడ్‌ పెంచాడు. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. మూడో సినిమా ‘డంకీ’ డిసెంబర్‌ 22న రిలీజ్‌ కాబోతోంది. 

ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్స్‌తో రూ.2000 కోట్లకుపైగా కలెక్షన్లు కొల్లగొట్టిన షారూక్‌ ‘డంకీ’తో హ్యాట్రిక్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో మరో రూ.1000 కోట్లు రాబట్టాలని షారూక్‌ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. అయితే అది ఎంతవరకు సాధ్యం అనేది ప్రశ్న. ఎందుకంటే ‘పఠాన్‌’, ‘జవాన్‌’ రెండూ పూర్తి యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలు. అలాంటి సినిమాల కలెక్షన్స్‌ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటాయి. ‘డంకీ’ విషయానికి వస్తే.. ఇది పూర్తి విభిన్నమైన సబ్జెక్ట్‌. కామెడీ ఉంటూనే ఎమోషన్స్‌ను క్యారీ చేసే సినిమా. మరి ఈ సినిమా అంత భారీ కలెక్షన్లు రాబట్టగలదా? అంటే కష్టమనే చెప్పాలి. షారూక్‌ ఆ ఫీట్‌ సాధించాలంటే ఉన్న ఒకేఒక్క హోప్‌ రాజ్‌కుమార్‌ హిరాని. టాలీవుడ్‌లో రాజమౌళిలాగే బాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాని. అతని దర్శకత్వంలో వచ్చిన గత సినిమాలన్నీ సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆ కోవలోనే ‘డంకీ’ కూడా సూపర్‌హిట్‌ అవుతుందని, అయితే కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని బాలీవుడ్‌ ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా షారూక్‌ ఖాన్‌ 2023లో ‘డంకీ’తో హ్యాట్రిక్‌ కొట్టడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.