Read more!

English | Telugu

ముంబై వీధుల్లో చెప్పుల్లేకుండా తిరిగిన షారుఖ్.. బాలీవుడ్ బాద్షా అయ్యాడు

ఆ హీరో ఒకప్పుడు ముంబై వీధుల్లో  చెప్పులు లేకుండా సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించినా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత  డైలీ సీరియల్స్ లో నటించి ఎంతగానో పేరు ప్రఖ్యాతులని సంపాదించాడు. మళ్ళీ సినిమాల్లో అవకాశం పొంది భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ హీరోగా ఎదిగాడు. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్. ఈ రోజు బాద్ షా పుట్టిన రోజు. నేటితో 58 సంవత్సరాలని పూర్తి చేసుకుంటున్న షారుఖ్ భాయ్ కి మన తెలుగు వన్ తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

దేశ రాజధాని ఢిల్లీలో 1965 నవంబర్ 2 న పుట్టిన షారుఖ్ బ్యాచిలర్ అఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన తర్వాత నటన మీద మక్కువతో సినీ రాజధాని ముంబై కి చేరి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.కానీ సినిమాల్లో అవకాశాలు రాకపోయేసరికి సీరియల్స్ లో హీరోగా చేసాడు. 1980 వ సంవత్సరంలో హిందీలో వచ్చిన ఎన్నో హిట్ సీరియల్స్ లో షారుక్ భాయ్ నే హీరో. అవన్నీ కూడా ఎంతో ప్రజాధరణ పొందాయి. మనలో ఎంత టాలెంట్ ఉన్నా కూడా  అవకాశం ఇచ్చే వారెవరైనా ఉంటేనే  మనమేంటో నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ షారుక్ కి కూడా రాజ్ కన్వార్  అనే దర్శకుడి రూపంలో  తానేంటో నిరూపించుకునే అవకాశం వచ్చింది. రాజ్ కన్వార్ దర్శకత్వంలో దీవానా అనే సినిమాలో రిషి కపూర్ ,దివ్య భారతి లతో కలిసి  విలన్ నుంచి హీరోగా మారే క్యారక్టర్ లో  షారుక్ సూపర్ గా నటించి బాలీవుడ్ మొత్తం కూడా  ఎవరు ఈ షారుక్ అని తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఆ తర్వాత చమత్కార్,రాజు బన్ గయా జెంటిల్మన్ ,దిల్ ఆశానా హై, మాయ మేంసాబ్ ,కింగ్ అంకుల్ లాంటి చిత్రాల్లో నటించాడు. కానీ ఆ చిత్రాలు  ఆశించినంత విజయం అవ్వలేదు.

ఇక ఆ తర్వాత హిందీ చిత్ర సీమ మొత్తం  యాక్టింగ్ ని ఇలా  కూడా చేయచ్చా అనుకునే రీతిలో షారుక్ నటించిన బాజీగర్, డర్ సినిమాలు విడుదల అయ్యి సంచలన విజయం సాధించాయి. రొమాంటిక్ థ్రిల్లర్ గా వచ్చిన బాజీగర్ మూవీ లో లవర్ బాయ్ గా, విలన్ గా షారుఖ్ విజృంబించి నటించాడు.ముఖ్యంగా అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం లో వచ్చిన బాజిగర్ మూవీతో అయితే  షారుక్ కి అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. ఆ తర్వాత కభీ హాన్ ఖబీనా, అంజామ్, సల్మాన్ ఖాన్ తో కలిసి చేసిన కరణ్ అర్జున్  లాంటి సినిమాలు వచ్చి షారుఖ్ బాలీవుడ్ లో శాశ్వత స్థానాన్ని సంపాదించడానికి కారణం అయ్యాయి.

తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా కొన్ని సినిమాల పరాజయం తర్వాత షారుక్ నటించిన  దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే అనే సినిమా వచ్చింది. ఆ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కుటుంబాలు కుటుంబాలు రిపేటడ్ గా డివిడిఎల్ ని చూసారు. రాజ్ మల్హోత్రా గా షారుక్ నటనకి ఫిదా అవ్వని  భారతీయ ప్రేక్షకుడు లేడు. తెలుగులోకి కూడా ప్రేమించి పెళ్లాడుతా అనే పేరుతో డబ్ అయ్యి  ఎన్నో సెంటర్స్ లో 50 రోజులు, 100 రోజులు ఆడింది. ఈ సినిమాతోనే తెలుగు వాళ్ళకి  హిందీ సినిమాలు చూసే అలవాటు అయ్యిందని  చెప్పవచ్చు. ఈ సినిమాలోని పాటలు నేటికీ మారుమోగిపోతూనే ఉంటాయి. 20 సంవత్సరాల క్రితం విడుదలయిన ఈ సినిమా ఇప్పటికి ముంబై లో ఆడుతూనే ఉంది.

షారుక్ కి డివిడిఎల్ తో వచ్చిన క్రేజ్ దృష్ట్యా  డివిడిఎల్ తర్వాత వచ్చిన  కొన్ని సినిమాలు షారుక్ ఇమేజ్ ని  అందుకోలేక పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత  హృతిక్ రోషన్ ఫాదర్ రాకేష్ రోషన్ దర్శకత్వం లో వచ్చిన కోయిల మూవీతో  షారుక్ మళ్ళీ హిట్  ట్రాక్ లోకి వచ్చాడు. అక్కడనుంచి షారుక్ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షక హృదయాల ని గెలిచింది. పరదేస్, దిల్ తో పాగల్ హై ,అఛానక్, కుచ్ కుచ్ హోతా హై ,బాద్ షా, హే రామ్, జోష్,దిల్ సే ,కభీ ఖుషి కభీ గమ్, దేవదాస్ ,శక్తీ ,కల్ హో న హో,వీర్ జార్, డాన్, చక్ దే ఇండియా, ఓం శక్తి ఓం ,మై నేమ్ ఈజ్ ఖాన్,చెన్నై ఎక్సప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, ఫ్యాన్, ది జోయా ఫ్యాక్టరీ, బ్రహ్మాస్త్ర, పఠాన్ లాంటి ఎన్నో చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలని పోషించి భారతీయ సినీ ప్రేక్షకులని తన నటనతో అలరిస్తూ వస్తున్నాడు.లేటెస్ట్ గా  జవాన్ సినిమా తో 1000 కోట్ల రికార్డు కలెక్షన్స్ ని కొల్లగొట్టిన షారుక్ కి  మా తెలుగు వన్ మీడియా తరుపున బర్త్ డే విషెస్.2005  లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న షారుక్ 91 లోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్,ప్రొడ్యూసర్ అయినటువంటి గౌరీ ని వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి ముగ్గురు పిల్లలు.