English | Telugu

శిల్పాశెట్టి భర్తకు మరో షాక్‌.. చేసిన పాపాలు ఎక్కడికిపోతాయి!

పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ నటి, శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రాకు మరో షాక్‌ తగిలింది. రాజ్‌ కుంద్రాపై న్యాయ పోరాటంలో నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి విజయం సాధించాడు. సత్యయుగ్ గోల్డ్ స్కీమ్ వివాదంలో జోషికి సంబంధించిన కిలో బంగారాన్ని ఆయనకు అప్పగించాలని.. అలాగే కోర్టు ఖర్చులకు గాను మరో 3 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అప్ప‌ట్లో 'సత్యయుగ్ గోల్డ్' అనే కంపెనీకి చైర్మ‌న్‌ గా ఉన్న రాజ్ కుంద్రా.. బంగారంపై ఆదాయం అందిస్తామంటూ ఓ స్కీమ్ పెట్టాడు. దాన్ని న‌మ్మిన స‌చిన్ జోషి కిలో బంగారాన్ని ఆ కంపెనీలో పెట్టుబడిగా పెట్టాడు. అయితే, ఐదేళ్లు పూర్త‌యిన త‌ర్వాత స‌చిన్ జోషీకి బంగారం తిరిగి ఇవ్వ‌కుండా ఆ కంపెనీ అడ్డుగోలుగా వ్య‌వ‌హ‌రించింది. దీనిపై స‌చిన్ జోషి కోర్టుకెళ్లగా.. కేసుని ప‌రిశీలించిన న్యాయ‌స్థానం.. స‌చిన్ జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది. రాజ్‌ కుంద్రా కంపెనీ స‌చిన్‌ కు కిలో బంగారాన్ని అప్పగించడంతోపాటు.. కోర్టు ఖర్చుల కింద 3 లక్షలు రూపాయలు చెల్లించాలని ముంబై హైకోర్టు ఆదేశించింది.

ఈ తీర్పుపై స్పందించిన సచిన్‌ జోషి 'నిజం ఏదో ఒక‌రోజు బ‌య‌ట‌కు వ‌స్తుంది' అన్నారు. తను కష్టపడి దాచుకున్న డబ్బును అక్రమంగా కాజేయాలని చూశారని తెలిపారు. తన బంగారాన్ని తనకివ్వమని అడిగితే, రివర్స్‌లో తనపైనే బురద చల్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి న్యాయమే గెలిచిందన్నారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా బాధితులు చాలామంది ఉన్నారని.. చేసిన పాపాలు ఎక్కడికిపోతాయి.. కర్మ అనుభవించక తప్పదని పేర్కొన్నారు.