Read more!

English | Telugu

రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే.. మరోసారి ప్రూవ్‌ చేసిన సల్మాన్‌ఖాన్‌!

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అభిమానులకు అండగా ఉంటాడు, అవసరమైన సాయం చేస్తాడు. అందుకే అతన్ని అందరూ భాయ్‌ జాన్‌ అని ప్రేమగా పిలుస్తారు. తాజాగా సల్మాన్‌ ఖాన్‌ ఓ చిన్నారి పట్ల చూపించిన ప్రేమకు అభిమానులు, సాధారణ ప్రజలు ఫిదా అవుతున్నారు. ఆరేళ్ళ క్రితం తన అభిమానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మరోసారి రియల్‌ హీరో అనిపించుకున్నాడు. 

వివరాల్లోకి వెళితే.. ముంబైలో నివసిస్తున్న జగన్బీర్‌ అనే నాలుగేళ్ళ బాలుడు 2018 నుంచి బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. జగన్‌కు 3 ఏళ్ల వయసులో మెదడులో కణితి రావడంతో కంటి చూపు దెబ్బతింది. ఆ తర్వాత ఢల్లీి ముంబైలో వైద్యం చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. తండ్రితో కలిసి ముంబై వెళ్లాడు జగన్‌. సల్మాన్‌ ఖాన్‌ను చూడడం కోసమే తను ఆ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నానని చెప్పిన వీడియో అప్పట్లో వైరల్‌ కావడంతో.. విషయం తెలుసుకున్న సల్మాన్‌ నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఆ బాలుడ్ని కలుసుకొని మాట్లాడాడు. ఆ చిన్నారికి ధైర్యం చెప్పాడు. చికిత్స తీసుకుని క్యాన్సర్‌ను జయించిన తర్వాత మళ్లీ కలుస్తానని జగన్‌కి మాటిచ్చాడు సల్మాన్‌. 

జగన్‌కి ఇప్పుడు 9 ఏళ్లు. దాదాపు ఆరేళ్ళు కీమో థెరపీ చేయించుకొని క్యాన్సర్‌ను జయించాడు. దీంతో జగన్‌కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు సల్మాన్‌. ముంబైలోని బాంద్రా రెసిడెన్సీకి జగన్‌ కుటుంబాన్ని పిలిపించి వారితో మాట్లాడాడు సల్మాన్‌. ఆ బాలుడికి 96 శాతం కంటిచూపు తిరిగి వచ్చిందని, ఇప్పుడు అందరు పిల్లల్లాగే స్కూల్‌కి వెళుతున్నాడని అతని తల్లి సుక్బీర్‌ కౌర్‌ చెప్పింది. తమ పిల్లాడి పట్ల చూపిన ప్రేమ, చేసిన సాయం, చెప్పిన ధైర్యం ఎప్పటికీ మరచిపోలేమని జగన్‌ కుటుంబ సభ్యులు ఎంతో ఎమోషనల్‌గా చెప్పారు. సల్మాన్‌ చేసిన ఈ మంచి పనిని సోషల్‌ మీడియాలో కొనియాడుతున్నారు. ఒక అభిమాని పట్ల అంత కేర్‌ తీసుకున్న సల్మాన్‌ రియల్‌ హీరో అని కామెంట్స్‌ పెడుతున్నారు.