English | Telugu

అప్పుడు గ్లామ‌ర‌స్ హీరోయిన్‌.. ఇప్పుడు గూగుల్ ఇండియాకి ఇండ‌స్ట్రీ హెడ్‌!

మ‌హేశ్ భ‌ట్ తీసిన‌ 1996 నాటి సూప‌ర్ హిట్ మూవీ 'పాపా కెహ‌తే హై' సినిమాలో హీరోయిన్ గుర్తుందా? ఆమె.. మ‌యూరి కాంగో. ఆ సినిమాతో పాటు 'న‌సీమ్‌', 'బేతాబి', 'హోగి ప్యార్ కీ జీత్' త‌దిత‌ర సినిమాల్లో త‌న అంద‌చందాలు, అభిన‌యంతో ల‌క్ష‌లాది మంది హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన ఆమె 2009లో న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పేసింది. చివ‌రి సారిగా సైఫ్ అలీఖాన్‌, క‌రీన్ కపూర్ మూవీ 'కుర్బాన్‌'లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చిన ఆమె, త‌ర్వాత సిల్వ‌ర్ స్క్రీన్‌కు దూర‌మైంది. వెలుగు జిలుగుల ప్ర‌పంచానికి దూర‌మైన‌ప్ప‌టికీ, త‌ను క‌ల‌లు క‌న్న జీవితాన్ని నిజం చేసుకుంటోందామె.

స‌యీద్ అఖ్త‌ర్ మీర్జా డైరెక్ట్ చేసిన 'న‌సీమ్' (1995) మూవీతో మ‌యూరి కాంగో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత 'పాపా కెహ‌తే హై'లో జుగ‌ల్ హంస‌రాజ్ జోడీగా ఆమెకు ఆఫ‌ర్ ఇచ్చాడు మ‌హేశ్ భ‌ట్‌. ఆ సినిమాతో మ‌యూరి యువ‌త ఆరాధ్య‌తార‌గా మారింది. ఆమె బ్యూటీకి జ‌నం దాసోహ‌మ‌య్యారు.

ఓవైపు సినిమాలు చేస్తూనే, మ‌రోవైపు కాహిన్ కిస్సీ రోజ్‌, డాల‌ర్ బ‌హు, కిట్టీ పార్టీ, ఖుసుమ్‌, క్యా హ‌డ్స్ క్యా హ‌ఖీక‌త్ లాంటి టీవీ సీరియ‌ల్స్‌లోనూ న‌టించింది మ‌యూరి.

త‌ర్వాత క్ర‌మంగా గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ నుంచి దూరం జ‌ర‌గ‌డం ప్రారంభించింది. 2003లో ఆమె ఆదిత్య ధిల్లాన్ అనే ఎన్నారైను వివాహం చేసుకుంది. 2011లో వారికి కియాన్ అనే కొడుకు పుట్టాడు. భ‌ర్త‌తో క‌లిసి న్యూయార్క్‌కు మ‌కాం మార్చిన మ‌యూరి, అక్క‌డ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది.

కొంత కాలం 'ప‌ర్ఫార్మిక్స్‌'కు మేనేజింగ్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన ఆమె 2019 నుంచి గూగుల్ ఇండియాకు ఇండ‌స్ట్రీ హెడ్‌గా ప‌నిచేస్తూ వ‌స్తోంది.