English | Telugu
షారుక్ ఖాన్ మూవీలో నయనతార క్యారెక్టర్ ఏమిటో తెలిసింది!
Updated : Nov 9, 2021
కొద్ది వారాలుగా షారుక్ ఖాన్ వ్యక్తిగతంగా సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నాడు. కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్టవడంతో, తన ప్రాజెక్టుల షూటింగ్స్‌ను ఆయన వాయిదా వేసుకున్నాడు. బెయిల్ మీద ఆర్యన్ ఇంటికి వచ్చేయడంతో, తిరిగి షూటింగ్స్ కొనసాగించాలని ఆయన డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా అట్లీ డైరెక్ట్ చేస్తోన్న లయన్ మూవీ నెక్ట్స్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ మధ్యలో ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సిన నయనతార డేట్స్ సమస్య కారణంగా తప్పుకుందంటూ ప్రచారం జరిగింది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టంగా తెలిసింది.
యూనిట్ సభ్యుల్లో ఒకరు, నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె ఈ సినిమాని వదిలేయలేదు. అలాంటి కథలు మీడియా ఎందుకు అల్లుతుందో తెలీదు. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వ్యక్తిని ఇంకా ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కాదు. ఇది సరైన పని కాదు అని చెప్పారు.
ఏదేమైనప్పటికీ, ఈ సినిమాలో నయనతార చేస్తున్న క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ తెలియవచ్చింది. ఈ మూవీలో నయనతార ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. షారుక్ ఖాన్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. తప్పుడు నేరారోపణల కారణంగా జైలు జీవితం అనుభవిస్తోన్న స్త్రీలను కాపాడి, వారిని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి వ్యతిరేకంగా పోరాడే శక్తులుగా మలిచే వ్యక్తి కథ ఇది. వారి కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీసాఫీసర్‌గా నయనతార కనిపిస్తారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్‌తో ఆమె తలపడతారు. వారి మధ్య రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది. అని ఆ యూనిట్ మెంబర్ తెలిపారు.