English | Telugu
క్షమాపణ చెప్పిన నానా.. అయినా ట్రోలింగ్ ఆపని నెటిజన్లు!
Updated : Nov 16, 2023
భారతదేశంలో సినిమాల గురించి, సినిమా తారలకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. హీరోలు, హీరోయిన్లు.. ఆఖరికి క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. తమ అభిమాన తారలు ఎక్కడ కనిపించినా వారితో మాట్లాడాలని, వారితో కలిసి ఫోటోలు తీయించుకోవాలని అభిమానులు ఎగబడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఒక్కోసారి అపశృతులు కూడా దొర్లుతుంటాయి. కొన్నిసార్లు అభిమానుల పట్ల తారలు దురుసుగా ప్రవర్తిస్తుంటారు. దాని వల్ల ఆయా తారలు ట్రోలింగ్‌కి గురవుతారు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నానాపటేకర్ ఓ ఫ్యాన్‌పై చెయ్యి చేసుకున్నారు. షూటింగ్‌లో ఉన్న నానా పటేకర్‌తో సెల్ఫీ దిగాలని ఉత్సాహం చూపించిన అతనిపై నానా చేయిచేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నానా తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. ఒక అభిమాని పట్ల అలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని నానాకి హితబోధ చేశారు.
జరిగిందేమిటంటే.. నానా పటేకర్ ఓ సినిమా షూటింగ్ కోసం వారణాసి వెళ్లారు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి పెద్ద ఎత్తున జనం వచ్చారు. అక్కడికి వచ్చిన ఓ పిల్లాడు నానాతో ఫొటో దిగాలని అనుకున్నాడు. అయితే, దానికి సీరియస్ అయిన నానా అతనిపై చేయి చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నానా పటేకర్ స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ‘నేను ఓ పిల్లాడిపై చెయ్యి చేసుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన మా సినిమాలో భాగంగానే జరిగింది. మేము సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నాము. ఓ టేక్ కంప్లీట్ అయ్యింది. ఇంకో టేక్ కోసం రిహార్సల్ చేస్తున్నాము. ఆ సమయంలో ఓ పిల్లాడు అనుకోని విధంగా సీన్‌లోకి ఎంటర్ అయ్యాడు. నేను అతడ్ని మా టీంలోని వ్యక్తి అనుకున్నాను. స్క్రిప్ట్‌ను ఫాలో అవుతూ ఆ పిల్లాడిని కొట్టాను. అతడు మా టీంలో వ్యక్తి కాదని తర్వాత తెలిసింది. నేను అతడ్ని కలుసుకునే ప్రయత్నం చేశాను. అప్పటికే అతడు వెళ్లిపోయాడు. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు. మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’ అని అన్నారు.
నానా పటేకర్ వివరణ పట్ల నెటిజన్లు సంతృప్తి చెందినట్టుగా కనిపించడం లేదు. ఆ సీన్ సినిమాలో భాగం అయినప్పటికీ తన పక్కన నిలబడ్డ వ్యక్తి సీన్‌లో ఉండే పిల్లాడేనని అనుకున్నానని నానా చెప్పడం సిల్లీగా ఉందని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. అభిమానుల్ని అవమానించే ఘటనలు గతంలో అనేకం జరిగాయని, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే నానా ఈ వీడియో రిలీజ్ చేశారని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉంది అనేది దెబ్బ తిన్న ఆ కుర్రాడే చెబితే నమ్మశక్యంగా ఉంటుందని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.