English | Telugu
ఎన్టీఆర్ కొత్త సినిమాకి మెగాస్టార్ మూవీ టైటిల్ ఫిక్స్!
Updated : Oct 19, 2024
‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి భారీ హిట్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘దేవర’ మొదటి పార్ట్ ఇటీవల విడుదలై సందడి చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇదిలా ఉంటే.. ‘వార్2’ చిత్రంతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ‘దేవర’ పూర్తయిన తర్వాత ‘వార్2’ సెట్స్‌కి వెళ్ళారు ఎన్టీఆర్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ కానున్న ‘వార్2’ చిత్రం ఇదే పేరుతో హిందీలో రిలీజ్ అవుతుంది. తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి టైటిల్‌ని మార్చి ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌ని యాడ్ చేస్తున్నారు. మెయిన్ టైటిల్ ‘వార్2’ ఉంటూనే ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌ను ట్యాగ్‌గా పెడుతున్నారని సమాచారం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ద్వారా ఎన్టీఆర్‌లోని నట విశ్వరూపాన్ని చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు ‘వార్2’లో మరోసారి ఆ అనుభూతిని పొందబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషించే పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ భారీ స్పై థ్రిల్లర్ వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ కాబోతోంది. 1988లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన సినిమాకి ‘యుద్ధభూమి’ అనే టైటిల్‌ని పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఘనవిజయం సాధించింది. దాదాపు 36 సంవత్సరాల తర్వాత అదే టైటిల్‌ని ఎన్టీఆర్ సినిమాకి ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది.
‘వార్2’ చిత్రంలో ఎన్టీఆర్ పోర్షన్‌కి సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరి వరకు జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో రూపొందే సినిమా సెట్స్‌కి వెళతారు ఎన్టీఆర్. కెజిఎఫ్ సిరీస్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్స్‌తో మంచి ఊపు మీదున్న ప్రశాంత్‌నీల్‌తో ఎన్టీఆర్ చేసే సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. హీరోని ఎలివేట్ చేయడంలో, డిఫరెంట్‌గా చూపించడంలో ప్రశాంత్ నీల్ స్టైలే వేరు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని ఎలా చూపించబోతున్నారు అనే క్యూరియాసిటీ ఎన్టీఆర్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. దానికి తగ్గట్టుగానే సినిమా ఉంటుందనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.