English | Telugu
కియారా బర్త్ డే: ముచ్చటగా మూడు ప్రకటనలు?
Updated : Jun 26, 2021
ప్రస్తుతం హిందీనాట బిజీగా ఉన్న యువ కథానాయికల్లో కియారా అద్వానీ ఒకరు. `కబీర్ సింగ్`, `గుడ్ న్యూజ్`.. ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన ఈ సొగసరి.. ప్రస్తుతం `షేర్ షాహ్`, `భూల్ భులైయ్యా 2`, `జగ్ జగ్ జీయో`, `మిస్టర్ లేలే` చిత్రాలు చేస్తోంది. వీటిలో `షేర్ షాహ్` చిత్రీకరణ పూర్తిచేసుకోగా.. మిగిలినవి షూటింగ్ దశలో ఉన్నాయి. మరోవైపు.. పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో కియారా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న `ఎన్టీఆర్ 30`లోనూ.. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఏస్ కెప్టెన్ శంకర్ జట్టుకట్టనున్న సినిమాలోనూ కియారా పేరే ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే `అపరిచితుడు`కి హిందీ వెర్షన్ గా రానున్న చిత్రంలోనూ రణ్ వీర్ సింగ్ కి జోడీగా కియారాని నటింపజేసే ప్రయత్నాలు శంకర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ మూడు సినిమాలకి సంబంధించి నాయిక కియారానా కాదా అన్న విషయంపై జూలై 31న క్లారిటీ రానుంది. ఎందుకంటే.. ఆ రోజే కియారా 29వ పుట్టినరోజు.
తమ చిత్రాల్లో కథానాయికగా నటించేది ఎవరు? అన్న విషయంపై ఆయా హీరోయిన్ల పుట్టినరోజునే టార్గెట్ చేసుకుని ప్రకటనలు ఇవ్వడం ఆనవాయితీగా మారిందిప్పుడు. ఇటీవల కాలంలో `సర్కారు వారి పాట`, `సలార్` వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కి సంబంధించి.. ఈ తరహాలోనే హీరోయిన్ ఎనౌన్స్మెంట్స్ వచ్చాయి. మరి.. కియారా విషయంలోనూ అదే జరుగుతుందేమో చూడాలి. ఒకవేళ ఈ మూడు సినిమాల్లోనూ కియారానే హీరోయిన్ అయితే మాత్రం ముచ్చటగా మూడు ప్రకటనలకు జూలై 31న ఆసార్కమున్నట్టే. చూద్దాం.. ఏం జరుగుతుందో?