Read more!

English | Telugu

ఒకే రోజు మూడు టాప్ హిందీ ఫిల్మ్‌ల‌ను దాటేసిన‌ 'కేజీఎఫ్ 2'

 

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేప‌థ్యంతో ప్ర‌శాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' మూవీ హిందీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు న‌మోదు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. బుధ‌వారం వ‌చ్చిన‌ రూ. 6.25 కోట్ల‌తో క‌లుపుకొని 'కేజీఎఫ్ 2' హిందీ వెర్ష‌న్ వ‌సూళ్లు రూ. 343.13 కోట్ల‌కు చేరుకున్నాయి. ఈ క్ర‌మంలో ఒకే రోజు ఆ సినిమా స‌ల్మాన్ ఖాన్ 'టైగ‌ర్ జిందా హై', ఆమిర్ ఖాన్ 'పీకే', ర‌ణ‌బీర్ క‌పూర్ 'సంజు' సినిమాల లైఫ్‌టైమ్ వ‌సూళ్ల‌ను దాటేసి, ఇండియాలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో మూడో స్థానాన్ని ఆక్ర‌మించింది.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌మ జీవిత కాలంలో 'టైగ‌ర్ జిందా హై' రూ. 339.16 కోట్లు, 'పీకే' రూ. 340.80 కోట్లు, 'సంజు' రూ. 342.53 కోట్ల‌ను వ‌సూలు చేశాయి. ఇప్పుడు ఆ మూడింటినీ దాటేసింది 'కేజీఎఫ్ 2'. ఈ సినిమా కంటే ముందున్న‌వి రెండే రెండు సినిమాలు. రూ. 510.99 కోట్ల‌తో ప్ర‌భాస్ 'బాహుబ‌లి 2' అగ్ర స్థానంలో ఉండ‌గా, రూ. 387.38 కోట్ల‌తో ఆమిర్ ఖాన్ ఫిల్మ్ 'దంగ‌ల్' రెండో స్థానంలో ఉంది.

విశేష‌మేమంటే టాప్ 3లోని రెండు సినిమాలు సౌత్ నుంచి వ‌చ్చిన డ‌బ్బింగ్ సినిమాలు కావ‌డం. రాకీ భాయ్‌గా య‌శ్ ప‌ర్ఫార్మెన్స్‌, స‌న్నివేశాల్ని ప్ర‌శాంత్ నీల్ తీర్చిదిద్దిన విధానం, మ‌ద‌ర్ సెంటిమెంట్ క‌లిసి 'కేజీఎఫ్ 2'ను హిందీ బెల్ట్‌లో మాన్‌స్ట‌ర్ హిట్‌గా నిలిపాయి. రానున్న రోజుల్లో ఈ మూవీ 'దంగ‌ల్‌'ను దాటేసి, సెకండ్ ప్లేస్‌లో నిలిచినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.