English | Telugu
ఆ సినిమా నుంచి కీరవాణి ఔట్.. జి.వి.ప్రకాష్ ఇన్.. కారణం ఇదే!
Updated : Aug 1, 2024
ఒక సినిమా ప్రారంభమైన తర్వాత అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్కోసారి మారుతుంటారు. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి మార్పులు చాలా అరుదుగా జరుగుతూ ఉండేవి. కానీ, ఈమధ్య నటీనటులు, టెక్నీషియన్స్ కొన్ని సినిమాల నుంచి బయటికి వచ్చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విషయంలోనూ అదే జరిగింది. మొదట సంగీత దర్శకుడుగా కీరవాణినే ఎంపిక చేసుకున్నారు. కానీ, నిర్మాత, సంగీత దర్శకుడి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు రావడం వల్ల కీరవాణి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి వచ్చేశాడు. అతని స్థానంలో తమిళ్ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌ను తీసుకున్నారు.
ఆ సినిమా పేరు ‘స్కై ఫోర్స్’. అక్షయ్‌కుమార్, సునీల్‌శెట్టి ప్రధాన పాత్రల్లో సందీప్ కెల్‌వాని, అభిషేక్ అనిల్‌కపూర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 1965 ఇండో పాకిస్తాన్ వార్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీగా రూపొందించారు. ఈ సినిమా కోసం మొదట కీరవాణిని సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. పాటలు మాత్రం జి.వి.ప్రకాష్‌కుమార్‌తో చేయించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం కీరవాణిని తీసుకున్నారు. అయితే నిర్మాతల్లో ఒకరైన దినేష్ విజాన్‌తో క్రియేటివ్ డిఫరెన్స్‌లు తలెత్తడంతో కీరవాణి ఈ సినిమా నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు.
ఈ ఏడాది జూలై 12న విడుదలైన అక్షయ్‌కుమార్ సినిమా ‘సర్‌ఫిరా’కి జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించాడు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ‘స్కైఫోర్స్’ నుంచి కీరవాణి బయటికి వచ్చేయడంతో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని కూడా జి.వి.ప్రకాష్‌తోనే చేయిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి మ్యూజిక్ విభాగంలో ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకున్న కీరవాణిని ఈ సినిమా నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.