English | Telugu
కంగనాకు షాకుల మీద షాకులు... పారిపోతున్న బయ్యర్లు!
Updated : Oct 17, 2023
తాము చేసిన సినిమాలు ఒక్కోసారి పెద్ద హిట్ అవ్వచ్చు, ఒక్కోసారి డిజాస్టర్లు కావచ్చు. ఎప్పుడు ఏ సినిమాను జనం ఆదరిస్తారో చెప్పడం చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లోనూ లేడీ ఓరియంటెడ్ మూవీ ‘క్వీన్’తో వంద కోట్ల రూపాయల కలెక్షన్ సాధించిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. ఆ తర్వాత చేసిన ‘మణికర్ణిక’ ఆమెకు ఓ పీడకలగా మారిపోయింది. షూటింగ్ సమయంలో వచ్చిన విభేదాల కారణంగా అప్పటివరకు సినిమాను తీసిన క్రిష్ పేరును తప్పించి డైరెక్టర్‌గా తన పేరు వేసుకొని సినిమాను తన ఇష్టం వచ్చినట్టు తీసి పారేసింది. ఆ తర్వాత తన ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వరసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేసింది. టాలీవుడ్‌లోని కొందరిని టార్గెట్ చేసి కామెంట్స్ చేసింది. రాజకీయంగా బిజెపి భజన చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడిరది.హద్దు మీరి ఆమె చేసిన కామెంట్స్‌కి అందరూ చిరాకు పడ్డారు. ఇవన్నీ ఆమె చేస్తున్న సినిమాలపై ప్రభావం చూపించాయి. దీంతో ఆమె చేసిన సినిమాలు ఏవీ హిట్ అవ్వలేదు. ‘జడ్జిమెంటల్ హై క్యా’, ‘పంగా’, ‘దాకడ్’... ఇలా వరసగా వచ్చిన సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ అయిపోయాయి. ఆ సినిమాలు తీసిన నిర్మాతలు వందల కోట్ల మేర నష్టపోయారు. అక్కడితో ఆమె బ్యాడ్‌టైమ్ ఆగలేదు. సౌత్‌లో ‘తలైవి’, ‘చంద్రముఖి2’ కూడా ఘోర పరాజయాన్ని చవిచూశాయి. దీంతో ఆమె జీరోగా మారిపోయింది. ఇప్పుడు ఆమె చేసిన సినిమాలను కొనేందుకు ఒక్క బయ్యర్ కూడా ముందుకు రావడం లేదు.
ప్రస్తుతం ఆమె చేసిన సినిమాలు ‘ఎమర్జెన్సీ’, ‘తేజస్’ చిత్రాలకు బిజినెస్ జరగని పరిస్థితి ఏర్పడిరది. ‘ఎమర్జన్సీ’కి బిజినెస్ జరగకపోవడం వల్ల మొదట ప్రకటించిన విధంగా నవంబర్ 24న సినిమా రిలీజ్ చేయలేకపోతున్నామని కంగనా తెలియజేసింది. కానీ, బిజినెస్ జరగకపోవడమే దానికి కారణం అనే విషయాన్ని ప్రస్తావించలేదు. మరి కంగనా చేసిన ఈ రెండు సినిమాలకు మోక్షం ఎప్పుడు లభిస్తుందో చూడాలి.