English | Telugu
భర్తకు ఇస్తున్నంత తనకూ ఇవ్వాలన్న దీపిక.. మరొకర్ని చూసుకుంటున్న భన్సాలి!
Updated : Aug 11, 2021
'రామ్ లీల', 'బాజీరావ్ మస్తానీ', 'పద్మావత్'.. సంజయ్ లీలా భన్సాలి, రణవీర్ సింగ్, దీపికా పడుకోనే కాంబినేషన్‌లో వచ్చి, బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించిన సినిమాలు. వాళ్లు కలిసి పనిచేసి ప్రతిసారీ తెరపై మ్యాజిక్ ఆవిష్కృతమైంది. కొంత కాలంగా భన్సాలి డైరెక్షన్‌లో 'బైజు బావ్‌రా' వస్తుందనే టాక్ వినిపిస్తూ ఉంది. మొదట రణబీర్ కపూర్, కార్తీక్ ఆర్యన్ హీరోలుగా ఈ సినిమా తియ్యాలని భన్సాలి భావిస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇటీవల ఒక హీరోగా రణవీర్ సింగ్‌ను భన్సాలి ఖరారు చేసినట్లు తెలిసింది. హీరోయిన్‌గా దీపికా పడుకోనేను తీసుకుంటున్నట్లు ప్రచారంలోకి వచ్చింది.
రణవీర్, దీపిక మళ్లీ కలిసి నటిస్తున్నారనే వార్త బయటకు రావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. కానీ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా నుంచి దీపిక బయటకు వచ్చేసింది. భర్త రణవీర్ సింగ్‌కు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారో, అంత తనకూ ఇవ్వాలని దీపిక పట్టుపట్టింది. రణవీర్ ప్రస్తుతం సినిమాకు రూ. 25 కోట్లు వసూలు చేస్తున్నాడు. అంత రెమ్యూనరేషన్‌ను దీపిక అడగడంతో, అంత ఇచ్చుకోలేమని నిర్మాతలు చెప్పేశారు. దాంతో ఆ సినిమా నుంచి దీపిక తప్పుకుంది.
ఇప్పటికే భన్సాలి, రణవీర్, దీపిక కాంబినేషన్‌లో మూడు సినిమాలు వచ్చాయి కాబట్టి, నాలుగో సినిమా చేస్తే జనాలకు ఆ కాంబినేషన్‌పై విసుగు పుడుతుందని, దీపిక ఈ సినిమాలో చేయకపోవడమే మంచిదనీ బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.