English | Telugu

మాజీ 'మిస్ట‌ర్ ఇండియా' ఆత్మ‌హ‌త్యా య‌త్నం.. బాలీవుడ్ న‌టుడిపై కేసు!

ప్రముఖ ఫిజిక్ బిల్డర్, మాజీ "మిస్టర్ ఇండియా" మనోజ్ పాటిల్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్, మరో నలుగురిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం తెల్లవారుజామున ఆత్మ‌హ‌త్యా య‌త్నం నుంచి ప్రాణాల‌తో బయటపడిన పాటిల్ ప్రస్తుతం విలే పార్లేలో బిఎమ్‌సి ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న‌ ఆర్‌ఎన్ కూపర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన‌ ఇండియ‌న్ బాడీ బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ (ఐబీబీఎఫ్‌) నిర్వ‌హించిన పోటీలో ప్ర‌తిష్ఠాత్మ‌క‌ మిస్ట‌ర్ ఇండియా - మెన్స్ ఫిజిక్ ఓవ‌రాల్ చాంపియ‌న్‌షిప్స్‌-2016 టైటిల్‌ను పాటిల్ సాధించాడ‌ని ఐబీబీఎఫ్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ హీరాలాల్ సేఠ్ తెలిపారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం, ఓషివ‌రాలోని సాయిలీలా అపార్ట్‌మెంట్‌లో ఉన్న త‌న ఫ్లాట్‌లో కొన్ని నిద్ర‌మాత్ర‌లు మింగ‌డం ద్వారా పాటిల్ త‌న జీవితాన్ని అంతం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే స‌కాలంలో కుటుంబ‌స‌భ్యులు అత‌డిని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి, అత్య‌వ‌స‌ర చికిత్స అంద‌జేయ‌డంతో ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

మోడ‌లింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న 29 సంవ‌త్స‌రాల పాటిల్ ఇటీవ‌ల ఓషివ‌రా పోలీసుల‌కు ఓ ఫిర్యాదు స‌మ‌ర్పించాడు. ఆ ఫిర్యాదు లేఖ‌లో న‌టుడు సాహిల్ ఖాన్‌, మ‌రికొంత‌మంది క‌లిసి త‌న ప్రొఫెష‌న‌ల్ కెరీర్‌లో స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నార‌నీ, సోష‌ల్ మీడియా ద్వారా ప‌రువు ప్ర‌తిష్ఠ‌ల‌కు భంగం వాటిల్ల చేస్తున్నార‌నీ ఆరోపించాడు. వారిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశాడు.

పాటిల్ లేఖ ఆధారంగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు, అత‌ను పూర్తిగా కోలుకున్నాక అత‌ని నుంచి స్టేట్‌మెంట్ తీసుకొని, ఆ త‌ర్వాత ద‌ర్యాప్తు కొన‌సాగించ‌నున్నారు. ఇప్ప‌టికైతే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అరెస్టులూ చేయ‌లేదు.

సంద‌ర్భ‌వ‌శాత్తూ, పాటిల్ త‌న‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌ను గురువారం ఖాన్ తోసిపుచ్చాడు. ఈ వ్య‌వ‌హారం పాటిల్‌కు, న్యూఢిల్లీకి చెందిన రాజ్ ఫౌస్‌దార్ అనే వ్య‌క్తికి మ‌ధ్య సంబంధించిన‌ద‌ని తెలిపాడు. ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్ప‌డం, నేర‌పూరిత బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టం, ప‌రువు న‌ష్టం, నేరాల‌కు పాల్ప‌డ‌టం లాంటి సెక్ష‌న్ల కింద సాహిల్ ఖాన్‌, ఇత‌రుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.