English | Telugu

వారానికి రియాకి రూ. 35 లక్షల ఆఫర్?

రియా చక్రవర్తి పేరు గుర్తు ఉందా! ఎక్కడో, ఎప్పుడో విన్నట్లు ఉంది కదూ. అదేనండి.. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రియురాలు. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో రియా చక్రవర్తి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు గుర్తు వచ్చింది కదా ఆమె! ఆమెకు బిగ్‌బాస్ 15లో ప్రవేశిస్తే... వారానికి రూ. 35 లక్షల పారితోషకం ఇచ్చేందుకు నిర్వాహకులు ఆఫర్ చేశారట. బిగ్ బాస్ 15 ప్రిమియర్‌కు ముందు ఆమెకు ఈ ఆఫర్ చేశారట. ఇప్ప‌టిదాకా ఇంత మొత్తం రెమ్యూన‌రేష‌న్ ఏ కంటెస్టెంట్‌కూ ఆఫ‌ర్ చేయ‌లేదు.

బిగ్ బాస్ హౌస్ ఉన్న స్టూడియోలో రియా క‌నిపించ‌డంతో ఆమె బీబీ 15లో భాగం కానున్న‌ద‌నే ప్ర‌చారం మొద‌లైంది. స్టూడియోలో ఆమెను డెనిమ్స్‌, గ్రే టాప్ ధరించడంతోపాటు లూయిస్ యూటన్ బ్యాగ్‌తో చూశానని బిగ్ బాస్‌లోని ఓ కంటెస్టెంట్ తేజస్వి ప్రకాశ్ వెల్లడించారు. అలాగే అదే రోజు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దల్జీత్ కౌర్ కూడా స్టూడియోలో క‌నిపించారు.

బిగ్ బాస్ ప్రిమియర్‌కు స్పెష‌ల్ అప్పీరెన్స్ ఇవ్వ‌డానికి రియా వ‌చ్చిందా, లేక కంటెస్టెంట్‌గా వ‌చ్చిందా అనే దానిపై స్ప‌ష్ట‌త రాలేదు. ప్ర‌స్తుతం రియా చక్రవర్తికి సంబంధించిన ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ప్ర‌చారాన్ని త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్ ద్వారా సుశాంత్ మ‌రో మాజీ ప్రేమికురాలు అంకిత లోఖండే ఖండించారు.