English | Telugu

టాలీవుడ్‌లో కాంప్రమైజ్‌ అయితేనే హీరోయిన్‌ ఛాన్స్‌.. అంకిత షాకింగ్‌ కామెంట్స్‌!

గత 20 ఏళ్ళుగా పలు టీవీ కార్యక్రమాల్లో సందడి చేస్తున్న నటి అంకిత లోఖండే. ఆమధ్య కంగనా రనౌత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘మణికర్ణిక’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత మరో నాలుగైదు సినిమాల్లో నటించింది. 2004 నుంచి ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌తో పాపులర్‌ అయిన ఈమె ఉత్తమనటిగా అవార్డులు కూడా గెలుచుకుంది. బాలీవుడ్‌లో ఇంత పాపులారిటీ సంపాదించుకున్న అంకితని టాలీవుడ్‌లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు? అని ప్రశ్నిస్తే.. ఆమె దగ్గర నుంచి ఒక షాకింగ్‌ సమాధానం వచ్చింది. అదేమిటంటే.. ఇక్కడ అంకిత కాస్టింగ్‌ కౌచ్‌కి గురైందట. 

వివరాల్లోకి వెళితే.. చిన్నతనం నుంచి హీరోయిన్‌ అవ్వాలన్నదే అంకిత లక్ష్యం. దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఓ పక్క టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే సినిమా ప్రయత్నాలు కూడా చేసేది. ఆ క్రమంలోనే టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ నిర్మాత కొత్త సినిమా తీయబోతున్నాడని తెలిసి హైదరాబాద్‌ వచ్చి అతన్ని సంప్రదించింది. సినిమా కోసం ఆడిషన్‌ కూడా నిర్వహించారట. 

ఆ తర్వాత ముంబాయి వెళ్ళిపోయిన అంకితకు ఒక ఫోన్‌ వచ్చింది. సినిమాలో హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యావని, ఇక్కడికి వచ్చి అగ్రిమెంట్‌ మీద సంతకం చెయ్యాలని చెప్పారట. అంత ఈజీగా హీరోయిన్‌ ఎలా అయిపోయాను అనే అనుమానంతోనే హైదరాబాద్‌లో దిగింది. ఆ సినిమా ఆఫీస్‌కి తన అసిస్టెంట్‌ని వెంటబెట్టుకొని వెళ్లింది. అంకితను ఒంటరిగా ప్రొడ్యూసర్‌ రూమ్‌కి వెళ్లమని చెప్పారట. అప్పుడా ప్రొడ్యూసర్‌.. హీరోయిన్‌ అవ్వాలంటే కొంత కాంప్రమైజ్‌ అవ్వాల్సి ఉంటుందని అన్నాడట. అప్పుడు అంకిత వయసు 19 సంవత్సరాలు. కాంప్రమైజ్‌ అవ్వడం అనే మాటకు అర్థం తెలియక ‘అంటే నేనేం చెయ్యాలి’ అని అడిగింది. దానికా నిర్మాత తనతో బెడ్‌ షేర్‌ చేసుకుంటేనే హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇస్తానని అన్నాడట. దాంతో షాక్‌ అయిన అంకిత విషయం అర్థం చేసుకొని ఆ నిర్మాతను ఇష్టమొచ్చినట్టు తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్‌ రాలేదట. బాలీవుడ్‌లోనే అవకాశాలు దక్కించుకుంటూ ముందుకెళ్తున్నానంటూ చెబుతోంది. ప్రస్తుతం సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో, వెబ్‌ సిరీస్‌లలో తన టాలెంట్‌ చూపిస్తోంది అంకిత.