Moong dal Payasam
పెసర పప్పు పాయసం
లక్ష్మీదేవికి తీపి ఆరగింపుకి ఈ పెసరపప్పు పాయసం చేస్తారు మా ఇంట్లో. ఈ రోజు ఆఖరి శ్రావణ శుక్రవారం. సాయంత్రం దీపాలు పెట్టి, పూజ చేసి తీపి నైవేద్యం పెట్టాలి కదా ..ఇదిగో అమ్మవారికి ఇష్టమయిన తీపి వంటకం. చేయటం కూడా సులువే.
కావలసిన పదార్థాలు :
* పెసర పప్పు - ఒక కప్పుడు
* బెల్లం - 1 1/2 కప్పులు
* పాలు - ఒక లీటరు
* జీడి పప్పు - తగినంత
* కిస్మిస్ - తగినంత
* నెయ్యి- పావు కప్పుడు
* యాలకుల పొడి - రుచికి తగినంత
తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో ఒక నాలుగు చెమ్చాల నెయ్యి వేసి జీడి పప్పు, కిస్మిస్ లని ఎర్రగా వేయించాలి. వేగాక వాటిని తీసి పక్కన పెట్టుకుని, అదే బాణలిలో పెసర పప్పుని వేసి కొంచం ఎర్రబడే వరకు వేయించాలి. మరీ ఎర్రబడ కూడదు. అలా వేయించిన పెసర పప్పుకి ఒక నాలుగు కప్పుల నీరు పోసి కుక్కరులో పెట్టాలి. ఒక అయిదు విసుల్స్ వచ్చేదాకా ఉంచితే పప్పు మెత్తగా ఉడుకు తుంది. ఈ లోపు బెల్లం లో కొంచం నీరు పోసి స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించాలి. బెల్లం మొత్తం కరిగాక కొంచం తీగ పాకం వచ్చేదాకా వుంచి దించాలి.
అలాగే పాలని కూడా మరిగించి వుంచుకోవాలి. పాలు కొంచం చిక్కగా మరిగేదాక తిప్పుతూ వుండాలి. అలా మరిగిన పాలల్లో, ఉడికించి పెట్టుకున్న పెసర పప్పు ని బాగా మెదిపి ..ఉండలు లేకుండా చూసి అప్పుడు కలపాలి. బాగా తిప్పుతూ వుండాలి, లేదంటే అడుగు అంటి మాడు వాసన వస్తుంది పాయసం. పాలల్లో పెసరపప్పు పూర్తిగా కలిసాక, అప్పుడు బెల్లం పాకాన్ని పోసి ఒక పది నిముషాలు పాటు ఉడికించాలి. అలా ఉడికించి నంత సేపు గరిటతో కలియ బెడుతూ వుండాలి. దించేముందు నెయ్యి, ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ లని, అలాగే యాలకుల పొడి ని కూడా వేసి కలిపి దించాలి. యాలకుల పొడిని ఎప్పుడూ తీపి వంటకం అంతా పూర్తి అయ్యి దించేముందు వేస్తే ఆ పరిమళం వంటకానికి బాగా పడుతుంది.
అమ్మవారికి ఆరగింపు అయ్యాక, వేడిగా ఈ పాయసం తింటే బావుంటుంది. పిల్లలకి చల్లగా ఇష్టం అనుకుంటే ఫ్రిజ్ లో పెట్టి ఇవ్వచ్చు ..చాలా రుచిగా వుంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ పాయసం బెల్లం, పాకం పట్టి, పాలని బాగా మరిగించి చేస్తాం కాబట్టి ఆ రుచి చాలా ప్రత్యేకంగా వుంటుంది..
....Rama