Rasam Powder
ఆహా... రసం పొడి
రసం, కూర, చారు, పులుసు, పచ్చడి, ఇలా రోజు చేసే వంటలలోకి కొన్ని పొడులు ముందే చేసి పెట్టుకుంటే వంట త్వరగా అవుతుంది, రుచి చక్కగా కుదురుతుంది. మన తెలుగు ఇళ్ళల్లో చారు అని పెడతారు చింతపండుతో, రసం లానే వున్నా దీని రుచి వేరు. ఇందులో వేసే పొడితోనే ఆ రుచిలో మార్పు వస్తుంది. ఆ చారు పొడి చేసుకోవటం ఎలాగో ఈ రోజు చెప్పుకుందాం. ఈ చారు పొడి ఒక్కసారే చేసిపెట్టుకుంటే ఓ నెల వరకు ఫ్రెష్ గానే వుంటుంది. మా పెద్దమ్మ గారు ఈ పొడి, పచ్చి మిర్చి, కరివేపాకు, చింతపండు, పసుపు, ఉప్ప్డు వేసి పోపు లేకుండా చారు పెట్టేవారు. చాలా రుచిగా వుండేది ఆ చారు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చారు అన్నం తినటం చాలా ఇష్టంగా వుండేది మా పిల్లలందరికి. ఆమె దగ్గర నేను గమనించింది ఏంటంటే చారు మరిగాక, ఆఖరిలో చారుపొడి వేసి వెంటనే స్టవ్ ఆపేసేవారు. ఎందుకలా అంటే పొడి వేసాక మరగకుండా, మూత పెడితే ఆ వేడికి పొడి లోని సారమంతా నీటిలోకి వచ్చి చాలా బావుంటుంది అనే వారు. మీరు ఒకసారి అలా చారు పెట్టి చూడండి.
కావలసిన పదార్ధాలు:
కందిపప్పు ... ఒక కప్పు
ధనియాలు ... అర కప్పు
జీలకర్ర ... పావు కప్పు
మిరియాలు ... పావు కప్పులో సగం ( ఘాటు గా తినటం ఇష్టం అయితే పావు కప్పు వేసుకోవచ్చు)
ఎండుమిర్చి ... 2
తయారీ విధానం:
ముందుగా కందిపప్పుని పొడి బాణిలి లో వేయించాలి. ఏ దినుసు మరీ ఎర్రగా వేగకూడదు. కొంచం పచ్చిదనం పోతే చాలు. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, మిర్చి కలిపి వేయించాలి. మిరియాలు వేయించాల్సిన అవసరం లేదు. అన్ని దినుసులు వేయించాక, చల్లారనివ్వాలి. ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చారు చేయటానికి ఓ చెమ్చా ఈ పొడి వేస్తే చాలు.
-రమ