Mixed sprouts chaat
మొలకెత్తిన గింజలతో ఛాట్
పండగ పిండివంటలు బాగా చేసారుకదా ..పండగ పేరుతో కొంచం స్వీట్స్ ఎక్కువే తిన్నాం కాబట్టి , ఈ రోజు కొంచం ఆరోగ్యకర వంట నేర్చుకుందాం . మొలకలతో చాట్...
కావలసిన పదార్థాలు:
పెసలు - ఒక కప్పు
సెనగలు - అర కప్పు
బొబ్బర్లు - అర కప్పు
వేరుశనగలు - అర కప్పు ( ఉడికించినవి )
ఉల్లిపాయ - 1
టమాటో - 1
పచ్చిమిర్చి - 2
పోపు దినుసులు - ఒక చెమ్చా
చాట్ మసాలా - అర చెమ్చా
డ్రై మాంగో పౌడర్ - పావు చెమ్చా
ఉప్పు - రుచికి సరిపడా
కారం - రుచికి సరిపడా
తయారీ విధానం:
పెసలు వంటి గింజలని నానబెట్టి, ఆ తర్వాత మొలకలు వచ్చాక ఈ చాట్ చేస్తే బావుంటుంది. వేరుసెనగలని మాత్రం కొంచం ఉడక బెట్టుకుంటే టేస్ట్ బావుంటుంది. కాబట్టి వేరుసెనగలలో కొంచం ఉప్పు వేసి ఉడికించాలి. ఉల్లి, టమాటోలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి పోపుగింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి వేయించి, ఆ తర్వాత ఉల్లి, టమాటో లని కూడా వేసి ఒక్క నిమిషం పచ్చి వాసన పోయే దాక వేయించాలి. ఆ తర్వాత ముందు ఉడికించిన వేరు శనగలని, ఆ తర్వాత మొలకెత్తిన గింజలని వేసి కలపాలి. ఉప్పు, కారం, చాట్ మసాలా, డ్రై మాంగో పౌడర్ కూడా వేసి కలపాలి. గింజలు వేసాక రెండు నిముషాలు ఉంచాలి అంతే. ఆ తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టి రెండు నిముషాలు ఉంచితే ఆ వేడికి గింజలు కొంచం మగ్గుతాయి. పూర్తిగా పచ్చిగా కాకుండా, అలా అని పూర్తిగా మెత్త గా కాకుండా వుండి, ఈ చాట్ తినటానికి రుచిగా వుంటుంది .
టిప్: పూర్తిగా హెల్తి చాట్ తినాలనుకుంటే పచ్చిగింజలలో పోపు తప్ప మిగితా అన్ని వేసి కలిపి తినచ్చు. పిల్లలు తినాలంటే కొంచం ఉడికించి, చాట్ చేసుకోవచ్చు. చాట్ చేయటానికి గింజలు కాంబినేషన్ ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు.
-రమ