Easy Mysore Pak Recipe
మెత్తటి మైసూర్ పాక్
మైసూర్ పాక్‌లలో రెండు రకాలు వుంటాయి. ఒకటి గట్టిగా వుండే మైసూర్ పాక్. మరొకటి మెత్తగా వుండే మైసూర్ పాక్. ఈ రెండిటిలో మెత్తగా వుండే మైసూర్ పాక్ అంటేనే చాలామందికి ఇష్టం. ఒక ముక్కను తుంచుకుని నోట్లో వేసుకంటే అలా కరిగిపోయే ఈ మైసూర్ పాక్ అంటే ఇష్టం వుండనిదెవరికి? ఒక మైసూర్ పాక్‌ని తుంచి నోట్లో వేసుకున్న తర్వాత మొత్తం మైసూర్ పాక్‌ని నోట్లో వేసేసుకోవాలనిపించేలా వుంటుంది కాబట్టే ఇది చాలా స్పెషల్ స్వీట్‌గా ఆదరణ పొందుతోంది. మరి ఇప్పుడు మెత్తటి మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా?
కావలసిన వస్తువులు:
శనగపిండి - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
ఆలివ్ ఆయిల్ - 1 కప్పు
పంచదార - 2 కప్పులు
నీరు - సగం కప్పు
తయారు చేసే విధానం:
నెయ్యి, ఆలివ్ ఆయిల్‌ని కలిపేసి బాణలీలో పోసుకుని వేడి చేసుకోవాలి. మరో పాన్‌లో శనగపిండిని బాగా వేయించుకోవాలి. శనగపిండిని వేయించే సమయంలో పిండిలో కాస్తంత నెయ్యి కూడా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం పిండిలో పూర్తిగా కలిసిపోయేలా చేయాలి. ఆ తర్వాత పిండిని ఉండలు లాంటివేవీ లేకుండా జల్లించుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద బాణలీ పెట్టి అందులో నీరు, పంచదార పోసుకోవాలి. బాగా బాయిల్ చేసి గ్లిజరిన్ మాదిరిగా చిక్కగా అనిపించేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న వేయించిన శనగపిండిని మెల్లమెల్లగా దానిలో కలుపుకోవాలి. కలుపుకునే సమయంలో ఉండలు రాకుండా జాగ్రత్తపడాలి. పిండి మొత్తం కలిపిన తర్వాత సిద్ధం చేసుకుని ఉంచుకున్న నెయ్యి, ఆలివ్ ఆయిల్ కూడా ఇందులో కలుపుకోవాలి. స్టవ్‌ని సిమ్ మీద వుంచి మెల్లగా కలుపుతూ బాగా చిక్కబడేవరకూ కలుపుతూనే వుండాలి. ఆ తర్వాత ఆ పదార్ధం మొత్తాన్ని నెయ్యి రాసిన పళ్ళెంలో పోసుకుని చదును చేసుకోవాలి. బాగా చల్లబడిన తర్వాత మొత్తం గట్టిగా అయిపోతుంది. అప్పుడు కత్తితో మనకు కావలసిన విధంగా ముక్కలుగా కోసుకోవాలి. తియ్యటి, రుచికరమైన మెత్తటి మైసూర్ పాక్ రెడీ.