Bread Pizza

 

 

 

బ్రెడ్ పిజ్జా

 

 

పిజ్జా పేరు వినగానే పిల్లలందరు ఎగిరి గెంతేస్తారు. అలా అని రోజూ బయట ఫుడ్ తినటం అంత మంచిది కూడా కాదు కదా.మరి ఏం చేద్దాం అని ఆలోచిస్తుంటే మంచి రెసిపి ఆలోచనలోకి వచ్చింది. అదే ఈ బ్రెడ్ పిజ్జా. తినగానే హాయిగా అరిగిపోయే బ్రెడ్ తో చక్కగా పిజ్జా చేసుకుని తింటే పిల్లలకే కాదు మనకి  కూడా  రోజు ఇదే తినాలనిపిస్తుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దామా.

కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్  -   ఆరు స్లైసెస్

వెన్న -   రెండు చెంచాలు

సన్నగా తరిగిన  ఉల్లిపాయ-1/2 కప్పు

సన్నగా తరిగిన  టమాట-1/2 కప్పు

పొడుగ్గా తరిగిన క్యాప్సికం - 1/4 కప్పు

చీజ్ తురుము  -  1/4 కప్పు

టొమాటో సాస్ లేదా పిజ్జా సాస్ - కొద్దిగా

ఉప్పు, మిరియాల పొడి -  తగినంత.

తయారి విధానం:

ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని కొద్దిగా వెన్న రాసి దానిపైన టొమాటో కెచప్ లేదా పిజ్జా సాస్ ను టాపింగ్ లా రాయాలి. దాని పైన తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలు పరిచి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లాలి. దానిపైన తగినంత చీజ్ తురుమును పరవాలి. ఇలా మిగిలిన బ్రెడ్ స్లైసెస్ ని కూడా తయారుచేసుకోవాలి. వీటన్నింటిని ఓవెన్ లో మూడు లేక నాలుగు నిముషాలు బేక్ చేస్తే సరిపోతుంది.  ఈ పిజ్జా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. ఇలాంటి పిజ్జాలు ఎన్ని తిన్నా ఏమి కాదు. ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం.

----కళ్యాణి