పాపం స్పీకర్ తమ్మినేని.. నిద్రపడితే ఒట్టు!

స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఎవరూ కూడా ఆ తరువాతి ఎన్నికలలో విజయం సాధించలేరు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ బెంగే కాకుండా నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలూ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. స్పీకర్ గా తమ్మినేని వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండటం అటుంచితే.. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఆముదాలవలసలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.   వైసీపీ సీనియర్ నాయకుడు సువ్వారి  గాంధీ ఇప్పటికే పార్టీ వీడి  ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో సువ్వారి గాంధీ ఆముదాలవలసలో తమ్మినేని విజయం కోసం అంతా తానై పని చేశారు. అందుకు అప్పట్లో జగన్ వచ్చే ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ సువ్వారి గాంధీకి ఇస్తానని ఇచ్చిన హామీయే కారణమని చెబుతారు. అయతే జగన్ ఆ హామీ నిలబెట్టుకోకపోవడంతో సువ్వారి గాంధీ వైసీపీకి రాజీనామా చేశారు. అంతే కాదు ఆయన సోదరుడి సతీమణి  కూడా తన నామినేటెడ్ పోస్టుకు రాజీనామా చేశారు. గాంధీ ఆముదాలవలస నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవనున్నారు. వైసీపీ అధిష్ఠానం అంటే జగన్ తనను మోసం చేశారని గాంధీ ఆరోపిస్తున్నారు. సువ్వారీ గాంధీ పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతుంటే.. తమ్మినేని సీతారాంకు ఖంగారెందుకు అంటే గాంధీ నియోజకవర్గంలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెుందిన వ్యక్తి. పైగా ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేత. దీంతోనే తమ్మినేని సీతారాం తన విజయంపై ధీమా కోల్పోయారు. అలాగే వైసీపీలో కూడా ఖంగారు మొదలైంది. దీంతో గాంధీని బుజ్జగించడానికి జగన్ దూతగా వైవీ సుబ్బారెడ్డి శతధా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది.  అదీగాక చాలా కాలంగా సువ్వారి గాంధీ నియోజకవర్గంలో తనదంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమ్మినేని సీతారాం చేపట్టే అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. పార్టీలోనే తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ విషయం పార్టీ అధినేత జగన్ కు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు.   ఇక ఆముదాలవలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయనున్న కూన రవికుమార్ తమ్మినేనికి సమీప బంధువు కూడా కావడంతో దానినే సువ్వారి గాంధీ తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.  తమ్మినేతి, కూన రవికుమార్ లు డబుల్ గేమ్ ఆడుతున్నారనీ, వారి రాజకీయ నాటకానికి తెరదించేందుకు తనకు ఓటు వేయాలంటూ ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు.  అంతే కాకుండా స్థానిక వైసీపీ క్యాడర్ లో కూడా తమ్మినేని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఆముదాలవలసలో వైసీపీ క్యాడర్ చాలా వరకూ  తమ్మినేనికి మద్దతుగా ఆయన వెంటే నడుస్తున్నారు.  దీంతో తమ్మినేని నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారన్న సెటైర్లు పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి.  మొత్తం మీద ఆముదాలవలస నుంచి తమ్మినేని ఓటమి ఇప్పటికే ఖరారైపోయిందంటూ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 

పార్టీ టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య

ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన సిట్టింగ్ ఎంపీ గణేష్ మూర్తి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈడోర్ నియోజకవర్గ ఎండీఎంకే ఎంపీ గురుమూర్తికి పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో  ఆయన మూడు రోజుల కిందట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ( మార్చి 28) ఉదయం కన్నుమూశారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మరణించారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.   ఎండీఎంకే పార్టీ అభ్యర్థిగా  గణేశమూర్తి 2019 పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోడ్ నుండి భారీ మెజార్టీతో  విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.  ఎన్నికలలో పోటీకి అవకాశం లేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతులలో ఇద్దరు మహిళా మావోలు ఉన్నారు.   బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాల్పేరు నది సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.  యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్లు   డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా సిబ్బంది కూంబింగ్ జరుపుతుండగా తొలుత నక్సల్స్‌ కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.   ఘటనా స్థలం నుంచి భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరి కొందరు నక్సల్స్ గాయపడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. 

జ‌గ‌న్‌..! ఇక ఏడ్చేస్తాడేమో?!

నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని   అని చెప్ప‌డం మిన‌హా,    ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది.   స‌ర్వేల‌న్నీ బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మికే జై కొడుతుండ‌టంతో జ‌గ‌న్ శిబిరం కంగారెత్తిపోతున్నది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు చేసిన పాపాలు అన్నీఇన్నీకావు.. ఏకంగా బాబాయ్ హ‌త్య‌, కోడి క‌త్తి  దాడి.. ఇలా చాలానే ఉన్నాయి. పోనీ ఇన్ని చేసి అధికారం దక్కించుకున్న తరువాత పాలన అయినా సక్రమంగా  సాగించారా అంటే అదీలేదు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌ను రోడ్డున ప‌డేశారు. అంతెందుకు ఉన్న కంపెనీల‌ను పంపించేసి నిరుద్యోగుల‌కు ఉపాధి లేకుండా చేశారు. ఫ‌లితంగా చిన్న‌చిన్న ప‌నుల‌కోసం సైతం ఏపీ ప్ర‌జ‌లు హైద‌రాబాద్ బాట ప‌డుతున్నారంటే ఏపీలో   ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయ్యింది.  వీట‌న్నింటిని వ‌దిలేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ  చంద్రబాబే కారణమని జనం ముందు ప్రసంగాలు ఇస్తున్నారు.   వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలో ఉన్న‌న్నిరోజులు బ‌య‌ట‌కు రావాలంటే ప‌ర‌దాలు కట్టుకుని జనానికి ముఖం చూపకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవలసిన పరిస్థితి. అయితే ఇప్పుడు  ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని జ‌గ‌న్‌ ప్రారంభించాడు. మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర చేప‌ట్టిన జ‌గ‌న్.. ప్రొద్దుటూరులో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. జ‌గ‌న్ ప్ర‌సంగం మొత్తం.. క‌లియుగ స‌త్య హ‌రిశ్చంద్రుడిని నేనే అని డ‌బ్బాకొట్టుకోవ‌డానికి పరిమితమైంది.  ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చెప్ప‌కుండా.. నేను మీ బిడ్డ‌ను.. అంద‌రూక‌లిసి నాపై దండ‌యాత్ర చేస్తున్నారు.. మీరే న‌న్ను కాపాడాలి అంటూ ప్ర‌జ‌ల‌ను  దీనంగా జ‌గ‌న్ అభ్య‌ర్ధించారు. ఐదేళ్ల పాల‌న‌పై ఆగ్రహంతో ఉన్న ప్ర‌జ‌ల‌ను సానుభూతి అస్త్రంతో త‌న‌వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. బాబాయ్ హ‌త్య‌కేసు విష‌యంపై మాట్లాడిన జ‌గ‌న్‌.. తన వాళ్ల‌నే చంద్ర‌బాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ ప్ర‌జ‌ల ముందు క‌న్నీరు పెట్టుకునంత ప‌నిచేశాడు. వివేకానందను అన్యాయంగా, అతిదారుణంగా చంపారు.. ఆ హంత‌కులెవ‌రో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్ర‌జ‌ల‌కు తెలుసు.. అని చెప్పిన జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి.. వారి పేర్ల‌ను మాత్రం చెప్ప‌లేదు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబాయ్ హ‌త్య‌కు కార‌ణం చంద్ర‌బాబే అంటూ మొత్తుకున్న జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బాబాయ్ హ‌త్య‌కేసును ఎందుకు సీరియ‌స్ గా తీసుకోలేద‌నే విష‌యాన్ని మాత్రం జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో  ఎక్కడా పొరపాటున కూడా ప్ర‌స్తావించ‌లేదు. త‌న ఇద్ద‌రు చెల్లెళ్లు, సీబీఐ అధికారులు వివేకా హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయి వైసీపీ ఎంపీ అవినాశ్  రెడ్డి అని బ‌హిరంగంగానే చెబుతున్నారు.  సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు   క‌డ‌ప వెళ్లారు.. బాబాయ్ పై జ‌గ‌న్ కు నిజంగా ప్రేముంటే అవినాశ్ అరెస్టును ఎందుకు అడ్డుకోవాల్సి వ‌చ్చింద‌నే విష‌యంపై ప్ర‌జ‌లకు చెప్పేందుకు జ‌గ‌న్ సాహ‌సించ‌లేదు. కేవ‌లం అభాండాలు వేయ‌డమే తన పని అన్నట్లుగా జగన్ తీరు ఉందని జనం బాహాటంగానే అంటున్నారు త‌న ఇద్ద‌రు చెల్లెళ్ల‌ను చంద్ర‌బాబు త‌న‌పై ఉసిగొల్పుతున్నాడ‌ని జ‌గ‌న్ పేర్కొనడం విడ్డూరంగా ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ష‌ర్మిల‌, సునీత‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక వారిని కూడా చంద్ర‌బాబు మ‌నుషులుగా వైసీపీ నేత‌లు చిత్రీక‌రించే ప్ర‌య‌త్న చేస్తూ వ‌చ్చారు. తాజాగా జ‌గ‌న్ కూడా త‌న ప్రంస‌గంలో అదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం జ‌గ‌న్ లో ఓట‌మి భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఇన్నాళ్లు చెల్లెళ్లు రోడ్డెక్కి మొత్తుకుంటున్నా క‌నీసం మాట‌ కూడా మాట్లాడ‌ని జ‌గ‌న్‌  ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఓట్లు కావాలి కాబ‌ట్టి సానుభూతికో సం అంతా చంద్ర‌బాబే చేస్తున్నారని చెప్ప‌డం వైసీపీ నేత‌ల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. జ‌గ‌న్ చెల్లెళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ముందు స‌మాధానం చెప్పిన త‌రువాత చంద్ర‌బాబు పేరు ఎత్తితే బాగుంటుంద‌ని   విశ్లేష‌కులు సూచిస్తున్నారు.   ఇటీవ‌ల విశాఖ తీరంలో దొరికిన డ్ర‌గ్స్ కేసుపైనా జ‌గ‌న్‌ స్పందించాడు. డ్ర‌గ్స్ తో ఉన్న కంటైన‌ర్ లో పేర్కొన్న అడ్ర‌స్సు చంద్ర‌బాబు వ‌దిన చుట్టం కంపెనీది అంటూ జ‌గ‌న్ అన్నాడు. అయితే, ఆ కంపెనీ వాళ్లు వైసీపీ నేత‌ల‌ని, ఇటీవ‌ల సంక్రాంతి పండుగ‌కు వాళ్లు జ‌గ‌న్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీల‌ను ఎందుకు వేయించార‌నే విష‌యంపై మాత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నోరువిప్ప‌క పోవ‌టం గ‌మ‌నార్హం. త‌న‌పై, త‌న వ‌ర్గీయుల‌పై వ‌చ్చే ప్ర‌తీ ఆరోప‌ణ‌ను చంద్ర‌బాబు చేసేదే అని చెప్ప‌డం మిన‌హా బ‌స్సు యాత్ర ప్ర‌సంగంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడింది పెద్ద‌గా ఏమీలేద‌నే చెప్పొచ్చు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం ప్ర‌జల సానుభూతికోసం  జ‌గ‌న్ పాకులాడిన‌ట్లు క‌నిపించింది. మొత్తంగా చెప్పాలంటే.. క‌న్నీళ్లు పెట్ట‌డం త‌ప్పితే అన్ని విన్యాసాలు ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్ చేశాడ‌ని చెప్పొచ్చు.

ఉప్పల్ స్టేడియంలో రాత్రి సన్ రైజ్! ముంబై బౌలర్లకు సిక్సర్ల వడదెబ్బ!

క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై  ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది. పరుగుల వరద అంటే ఏమిటో స్టేడియంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రేక్షకులతో పాటు కోట్లది మంది టీవీ వీక్షకులకు కళ్లకు కట్టినట్లు కనిపించింది. 40 ఓవర్లలో ఏకంగా 523 పరుగులు నమోదయ్యాయి. సిక్సర్లు మోత మోగిపోయాయి. స్టేడియంలోని ప్రేక్షకులు, టీవీ వీక్షకులే కాదు.. గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రేక్షకులు సైతం గుడ్లప్పగించి చూడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. పరుగుల తుపాన్ లో అంతా తడిసి ముద్దయ్యారు. ఈ మ్యాచ్ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే  ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఇక ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ కూడా దీటుగానే బదులిచ్చినా లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయారు. మొత్తం మీద ఈ మ్యాచ్ క్రికెట్ ను, క్రికెట్ మజాను గెలిపించింది.   టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు.   ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ ట్రోఫీలలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (263) నిలువగా, తాజాగా హైదరాబాద్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.  ఓపెనర్ హెడ్ (62),   అభిషేక్ శర్మ (63) విధ్వంసం సృష్టించగా, ఆ తరువాత ఆ విధ్వంసాన్ని  క్లాసేన్ (80 నాటౌట్) మరో లెవెల్ కు తీసుకువెళ్లాడు. మార్కరం (42 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ గల్లీ క్రికెటర్ల మాదిరిగా కనిపించింది.     ఇక 278 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కూడా ధాటిగానే పరుగుల వేట మొదలు పెట్టింది. అయితే క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండటంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఈ సీజన్ లో సన్ రైజర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. 

ఐదేళ్ల తరువాత దేనికి ‘సిద్ధం’ జగన్?

జగన్ ధైర్యంగా జనంలోకి వచ్చి ఐదేళ్లయ్యింది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర తరువాత ఆయన జనం ముఖం చూడటం మానేశారు. తన అధికారాన్ని ప్రత్యర్థులు, వ్యతిరేకులపై కక్ష సాధించుకోవడానికీ, సంక్షేమ పథకాల పేర లబ్ధిదారులకు అరకొరగా సొమ్ముల పందేరానికి అప్పుల వేటకీ పరిమితమైపోయారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేయడానికీ, ఆ ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చిన పారిశ్రామిక వేత్తలను రాష్ట్రం నుంచి తరిమేయడానికీ ఉపయోగించడానికే పరిమితమైన జగన్ జనం కష్టాలు, సమస్యలను అసలు పట్టించుకోనే లేదు. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేక జనాలకు ముఖం చాటేశారు. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగిన తరువాత ఓట్లు అభ్యర్థించడానికి జనం ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో గత్యంతరం లేక మేమంతా సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ యాత్రను పులివెందులలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించి బస్సు యాత్ర ప్రారంభించారు. మేము సిద్ధం తొలి సభ  ప్రొద్దుటూరులో  జరిగింది.  ఇంత కాలం జనం ముఖం చూడడానికి ఇష్టపడకుండా బారికేడ్లు, పరదాలు కట్టుకుని మరీ బయటకు వచ్చిన జగన్ ఇప్పుడు తన ఓట్ల అవసరం కోసం అవేమీ లేకుండా బయటకు వస్తే జనం ఆయన ముఖం చూడడానికి ఇష్టపడటం లేదా అన్న అనుమానం కలిగేలా ప్రొద్దుటూరు సభ జరిగింది.  నానా కష్టాలూ పడి సభకు జనాలను తరలించినా.. జగన్ ప్రసంగానికి వారిలో ఇసుమంతైనా స్పందన కనిపించలేదు.  ప్రొద్దుటూరులో జగన్ కు ఇలాంటి స్వాగతమే లభిస్తుందని పరిశీలకులు మొదటి నుంచీ చెబుతూనే ఉన్నారు.  ప్రొద్దుటూరులో వైసీపీలో అంతర్గత కుమ్ములాటల గురించి తెలిసి కూడా జగన్ తన ప్రచారాన్ని ప్రారంభించడానికి ప్రొద్దుటూరునే ఎన్నుకోవడం రాంగ్ ఛాయిస్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి సభ ప్లాప్ ప్రభావం ఆయన  యాత్ర మొత్తం రిఫ్లెక్ట్ అవుతుందని రాజకీయవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.  నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉంది. కడప లోక్‌సభ సెగ్మెంట్‌లోని ప్రొద్దుటూరు జగన్ అడ్డాగా నిన్నటి వరకూ ఉండేది. అందులో సందేహం లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చివరిసారిగా గెలిచింది 2009లో మాత్రమే. 2014, 2019 ఎన్నికలలో ఈ స్థానంలో తెలుగుదేశం పరాజయం పాలైంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇక్కడ నుంచి గత రెండు ఎన్నికలలో కూడా సునాయాసంగా విజయం సాధించారు. అయితే 2024లో మాత్రం పరిస్థితులు ఆయనకు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేకతకు తోడు  సిట్టింగ్ ఎమ్మెల్యే   ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్‌లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్త మౌతోంది.  దీంతో క్యాడర్ ముందుకు వచ్చి పని చేయడానికి సిద్ధంగా లేదు. అలాగే యాదవ సామాజిక వర్గం కూడా రాచమల్లుకు దూరమైంది.  కౌన్సిలర్లు కూడా రాచమల్లుకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి  వరదరాజులు రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. వరదరాజులు రెడ్డికి తెలుగుదేశం శ్రేణుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది. దీనికి జనసేన, బీజేపీ క్యాడర్ కూడా కలవడంతో రాచమల్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక గత కొద్ది కాలంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు జోరందుకున్నాయి. ఆ వలసల జోరు చూస్తుంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోతోందా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు.   ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే ప్రొద్దుటూరులో జగన్ మనమంతా సిద్ధం ప్రొద్దుటూరు సభ పార్టీలో జోష్ నింపే అవకాశం లేదని అంటున్నారు.  మనమంతా సిద్ధం అంటున్న జగన్ దేనికి సిద్ధమో  ఈ సభతో రుజువు అయ్యిందని చెబుతున్నారు. ప్రొద్దుటూరు   బహిరంగసభలో  జగన్ సుదీర్ఘ ప్రసంగం సభకు వచ్చిన వారి సహనానికి పరీక్షగా మారింది.  ఈ సభలో ఆయన తనపై వస్తున్న ఆరోపణలు ఖండించే ప్రయత్నం చేశారు. విశేషం ఏమిటంటే వివేకా హత్య విషయంలో ఇంకా చంద్రబాబునే నిందించే ప్రయత్నం చేశారు. వివేకాను తాము చంపలేదని .. చంపించలేదని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అంతా దేవుడికి తెలుసు, అలాగే జిల్లా ప్రజలకూ తెలుసు అంటూ అతి తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేశారు.  చిన్నాన్నను అన్యాయంగా చంపి.. నన్ను దెబ్బ తీసే రాజకీయం చేస్తున్నారు.  ఇంత కన్నా అన్యాయం ఉంటుందా?  అంటూ బేలగా ప్రజలను ప్రశ్నించారు.   చిన్నాన్నను  దారుణంగా చంపి  బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడని ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వివేకాను చంపిన వారిని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు మద్దతు ఇస్తుంటే..  ఆ చంద్రబాబుకు  రాజకీయ లబ్ధి చేకూ ర్చేందుకు  తపించి పోతున్న ఒకరిద్దరు తన వాళ్లు ఆయనకు వంత పాడుతున్నారని జగన్ చెప్పారు. అయితే జగన్ ఎంతగా చెప్పినా జనం నుంచి స్పందన కనిపించలేదు. వివేకా హంతకులకు చంద్ర బాబు  మద్దతుగా ఉన్నారని జగన్ చెప్పినప్పుడు సభకు వచ్చిన జనం కనీసం చప్పట్లు కొట్టలేదు. జగన్ చెబుతున్నదంతా అబద్ధమని తమకు తెలుసునన్నట్లు మౌనంగా ఉండిపోయారు.   ఇక డ్రగ్స్ కేసుపైనా సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు వదినగారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్‌ పేరుతో డ్రగ్స్‌ దిగుమతి చేస్తుంటే సీబీఐ వాళ్లు రెయిడ్‌ చేశారు. ఈ రెయిడ్‌ జరిగిందని తెలిసిన వెంటనే.. వైసీపీపై ఆరోపణలు చేయడం మొదలెట్టేశారని పేర్కొన్నారు.  విపక్షాల పొత్తులపైనా జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కడి మీదకు అందరూ కలిసి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు కళ్ల నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు.   తన చెల్లెళ్లను కూడా తన మీదకు యుద్దానికి తెస్తున్నారన్నాని బాధపడ్డారు. అయితే చెల్లెళ్లు జగన్ కు వ్యతిరేకంగా నిలబడడానికి కారణాలేమిటో రాష్ట్రంలో అందరికీ తెలుసు దాంతో జగన్ మెలో డ్రామా జనానికి పట్టలేదు. వారి నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదు. మొత్తంగా మనమంతా సిద్ధం పేరుతో యాత్ర ప్రారంభించిన జగన్ తొలి సభ చప్పగా ముగిసింది. జనం నుంచి స్పందన లేకపోగా, పార్టీ శ్రేణులను కూడా ఉస్సూరుమనిపించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తాము అధికారంలో రాగానే 25 లక్షల ఉద్యోగాలు: పలమనేరులో చంద్రబాబు 

తాము అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రజాగళం యాత్రలో భాగంగా ఆయన పలమనేరులో మాట్లాడుతూ యువతరం ఆశలను జగన్ వమ్ము చేశారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి కోసం జగన్ చేసింది శూన్యమన్నారు. అనంతపురంలో కియా పరిశ్రమ ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాము అభివృద్ధి చేశామని చంద్రబాబు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు అభివర్ణించారు. మే 13తో రాష్ట్రానికి పట్టిన జగన్ శని వదిలిపోతుందన్నారు.పలమనేరు ప్రజాగళం సభ జరుగుతున్నప్పుడు టిడిపి కార్యకర్తలు ఒక్కసారిగా సభాప్రాంగణం వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో తోపులాట జరిగింది. త్రి కూటమి జెండాలతో సభాప్రాంగణం కళ కళలాడింది. 

ఇడుపులపాయలో విజయమ్మ .. జగన్ ను క్షమించేశారా?

మేమంతా సిద్ధం అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను ఇడుపుల పాయలోని తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి ప్రారంభించారు. బుధవారం (మార్చి 27)న ఆయన తన ఎన్నికల ప్రచార బస్సు యాత్రకు ఇడుపుల పాయ నుంచి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఇడుపులు పాయలో జగన్ ను తల్లి  విజయమ్మ ఆశీర్వదించారు. అయితే ఇడుపుల పాయలో విజయమ్మ జగన్ పక్కన కనిపించడంతో రాష్ట్ర రాజకీయవర్గాలలో  పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది.  ఎందుకంటే.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తల్లి  వైఎస్ విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చాలా కాలం కిందటే రాజీనామా చేశారు. తన రాజీనామా నిర్ణయాన్ని ఆమె పార్టీ ప్లీనరీ వేదికపై నుంచి ప్రకటించారు. వాస్తవానికి పార్టీ  గౌరవాధ్యక్ష పదవి ఏమంత  క్రియాశీల పదవి కాదు.  అయినా విజయమ్మ ఆ పదవికీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. తన కుమార్తె తెలంగాణలో తన భర్త పేరుమీదనే ఏర్పాటు చేసిన పార్టీ కోసం పని చేయడానికి రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు. దీంతో వైసీపీ పార్టీకి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో ఉన్న రాజకీయ బంధం పుటుక్కుమని తెగిపోయినట్లే అప్పట్లో అంతా భావించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు కూడా అదే విషయాన్ని తేటతెల్లం చేశారు. పార్టీతో బంధం తెంచుకున్న తరువాత విజయమ్మ కూడా జగన్ తో ముభావంగానే ఉన్నారు. కుమార్తె తోడిదే లోకంగా సాగారు.   కాగా అమె వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా వెనుక ప్యాలెస్ కూ ఉందన్న ఆరోపణలు అప్పట్లో గట్టిగా వినిపించాయి. విజయమ్మను పార్టీ గౌరవాధ్యక్ష పదవి నుంచి అగౌరవంగా సాగనంపేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలూ అప్పట్లో వెల్లువెత్తాయి.   వాస్తవానికి వైఎస్ మరణం తరువాత  జగన్ రెడ్డికి రాజకీయంగా అండగా నిలిచింది తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల మాత్రమే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా తల్లి విజయమ్మ జగన్ కు అండగా నిలిచిన కారణంగానే వైఎస్ అభిమానులంతా జగన్ కు మద్దతుగా నిలబడ్డారు. ఇక జగన్ రెడ్డి  జైల్లో ఉన్న రోజుల్లో కానీ, 2019 ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర  సాగించిన సమయంలో కానీ, పార్టీ వ్యవహారాలను  నడిపించింది కూడా విజయమ్మ, షర్మిల మాత్రమే.  జగన్ సతీమణి   భారతి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటే, అమ్మ, చెల్లి రాజకీయ వ్యహారాలు చక్కపెట్టారు. ఇదే విషయాన్ని విజయమ్మ ప్లీనరీ వేదికనుంచి చేసిన వీడ్కోలు ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ముఖ్యంగా, జగనన్న విడిచిన బాణం అంటూ, షర్మిల చేసిన పాదయాత్రను అమె ఆ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేశారు. అయినా అంత చేసినా, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత  చెల్లిని కష్టాలలోకి నేట్టేశారు, దూరం పెట్టారు అని అర్ధం వచ్చేలా, అందరికీ అర్ధమయ్యేలా తన రాజీనామా సందర్భంగా చేసిన ప్రసంగంలో ఒకింత సున్నితంగానే అయినా స్పష్టంగా చెప్పారు.  ఇప్పుడు జగన్ రెడ్డికి తన అవసరం, చెల్లి అవసరం లేదని అందుకే పార్టీని వీడుతున్నాననీ పరోక్షంగానే అయినా కుండబద్దలు కొట్టేశారు.  ఇక అప్పటి నుంచీ జగన్ రెడ్డికి తల్లి, చెల్లితో సంబంధాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అన్నిటికీ మించి  వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చెల్లి షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత నేరుగా జగన్ పై విమర్శల బాణాలు సంధిస్తున్నారు. నేరుగా జగన్ కు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపు నిస్తున్నారు. షర్మిల కుమారుడి, సొంత మేనల్లుడి  వివాహానికి కూడా జగన్ రెడ్డి హాజరు కాలేదంటే ఇరువురి మధ్యా సంబంధాలు ఎంతగా బెడిశాయో ఎవరికైనా ఇట్టే అర్ధం అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకూ ఆ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడని తల్లి విజయమ్మ.. జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభ సమయానికి జగన్ పక్కన కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. జగన్ వేడుకోవడంతోనే విజయమ్మ మొక్కుబడి తంతుగా ఆ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద ఇడుపుల పాయలో జగన్ పక్కన తల్లి విజయమ్మ కనిపించడంతో మరో సారి జగన్ తల్లికీ, చెల్లికీ చేసిన ద్రోహం, వారి పట్ల వ్యవహరించిన తీరుపే రాష్ట్రంలో విస్తృత చర్చకు తెరలేచింది. 

ఔను ఫోన్ ట్యాపింగ్ నిజమే.. అయినా నాకు తెలియదు.. కేటీఆర్

చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎంత బుకాయించినా నిజం నోటి వెంట తన్నుకు రాక తప్పదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలోనూ అదే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ కేటీఆర్ తన నోటి వెంటే చెప్పేశారు. వెంటనే నాలుక కరుచుకుని ఏమో నాకు తెలియదు అంటూ సర్దుకున్నారు.  తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విస్తృత చర్చ జరుగుతోంది. సస్పెండ్ అయిన ఎస్ఐబీ డీఎఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ1గా ఉన్నారు. విచారణలో ఆయన వెల్లడించిన విషయాలను సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేతల ఆదేశాలతోనే తాను పలువురు రాజకీయనాయకుల ఫోన్లు ట్యాప్ చేశానని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లే కాకుండా, సినీ హీరోయిన్లు, బడా వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనీ, దీనినో దందాగా మార్చి వేల కోట్లు దండుకున్నారనీ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలెవరూ నోరెత్తలేదు. అయితే తాజాగా కేటీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ ఒప్పుకున్నారు. బుధవారం (మార్చి 27)మల్కాజ్ గిరి  పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు. ఔను కొన్ని ఫోన్ కాల్స్ ట్యాప్ అయి ఉంటాయి అని అంగీకరించారు. అయితే వెంటనే సర్దుకుని ఆ విషయం తనకు తెలియదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేస్తే మాత్రం తప్పేమిటని ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ ఈ విషయాన్ని ఏదో అంతర్జాతీయ కుంభకోణంగా చూపేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అయినా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేయడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందనీ, దాని వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని కేటీఆర్ పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు చెబుతున్నారు.  

పవన్ కళ్యాణ్ కలుసుకున్న ఒంగోలు ఎంపీ మాగుంట 

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం  జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని జనసేన పార్టీ వెల్లడించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. పవన్ కల్యాణ్ ను కలిసి ఆయనతో పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు.  మాగుంట ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన టీడీపీలో చేరడం తెలిసిందే.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒంగోలు లోకసభ నుంచి మాగుంట కుటుంబం నుంచి ఒకరికి టిడిపి  టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ను తండ్రీ కొడుకులు కలుసుకున్నారు. 

సిద్ధం అంటూ అంబటి రాయుడు ట్వీట్.. నిలకడేదిరా బాబూ అంటూ నెటిజనుల ట్రోల్

అంబటి రాయుడు తొందరపాటు నిర్ణయాలకూ, స్థిరత్వం లేని తీరుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడు. మాంచి ప్రతిభ గలిగిన క్రికెటర్ గా క్రీడాభిమానులకు చిరపరిచితుడైన అంబటి రాంబాబు తన క్రికెట్ కెరీర్ ను తొందరపాటు నిర్ణయాలతో, దుందుడుకు పోకడలతో చేజేతులా నాశనం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి ప్రవేశించడానికి వేచి చూసినంత కాలం పట్లలేదు ఆ క్రికెట్ కెరీర్ కు ముగింపు పలకడానికి. ఎంత ప్రతిభ ఉన్నా అతడిలో స్థిరత్వం కొరవడటంతో కెప్టెన్ విశ్వాసం పొందలే కపోయేవాడు. ఫలితంగా క్రికెట్ కెరీర్ అర్ధంతరంగా ముగిసింది. ఆ తరువాత ఆయన  రాజకీయ ప్రవేశం విషయంలో కూడా నిలకడలేని నిర్ణయాలు, ఎక్కడా స్థిరం లేకపోవడం, తొందరపాటు తనంతో నవ్వుల పాలయ్యాడు. క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికిన తరువాత అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో అడుగులు వేశాడు. నియోజకవర్గంలో కొంత కాలం చురుగ్గా పర్యటించి, ఒకింత ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు. గుంటూరు లోక్ సభ నియోకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న లక్ష్యంతో ఆయన వైసీపీ గూటికి చేరాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ గూటికి చేరారు.   గుంటూరు లోక్ సభ స్థానం హామీతో ఆయన వైసీపీ గూటికి చేరారని, అయితే చేరిన రోజుల వ్యవధిలోనే అక్కడి నుంచి పోటీకి అవకాశం లేదని గ్రహించి క్షణం ఆలోచించకుండా వైసీపీ గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆ వెంటనే తాను , విదేశాలలో క్రికెట్ టోర్నీలో పాల్గొనాల్సి ఉన్నందున  రాజకీయాల నుంచి చిన్న విరామం తీసుకున్నానని ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని రోజులకే వైసీపీ సామాజిక మాధ్యమంలో అంబటి రాయుడు తాడేపల్లిగూడెంలో జరిగి వైసీపీ సభలో పాల్గొన్న కొన్ని ఫొటోలను విడుదల చేసింది. ఇది జరిగిన వారం రోజుల వ్యవధిలోనే  జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. దీంతో అంబటిరాయుడు జనసేన తీర్ధం పుచ్చుకోనున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆయన జనసేన గూటికి చేరలేదు. ఇప్పుడు హఠాత్తుగా అండటి రాయుడు బుధవారం మార్చి 27) ఉదయం సిద్ధం అంటూ ట్వీట్ చేయడం ద్వారాతాను మళ్లీ వైసీపీ గూటికి చేరనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. దీంతో అంబటి రాయుడు స్థిరం లేని నిర్ణయాలు, నిలకడ లేని తీరుపై సామాజిక మాధ్యమంలో నెటిజనులు ఓ రెంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  అయినా అంబటి రాయుడు వైసీపీలో చేరి ఆ వెంటనే రాజీనామా చేసి, మళ్లీ ఇప్పుడు పార్టీకి మద్దతుగా నిలవడం వల్ల అంబటిరాయుడికి వచ్చే లాభం కానీ నష్టం కానీ ఏమీ ఉండదు కానీ.. వైసీపీకి మాత్రం ఆయన తీరు వల్ల జనాలలో నగుబాటు అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

లోక్ సభ తుది జాబితా కోసం ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి 

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేప‌టి క్రిత‌మే హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ బ‌య‌లుదేరారు. సీఎం వెంట మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ వెళ్లారు. లోక్‌స‌భ అభ్య‌ర్థుల తుది జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని స‌మాచారం. ఇక రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ స్థానాల‌కు గాను ఇప్ప‌టికే 9 స్థానాల‌కు కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మిగిలిన 8 స్థానాల‌కు నేడు చ‌ర్చ‌ల అనంత‌రం అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. మ‌రో కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీహెచ్‌ పార్ల‌మెంట్ టికెట్ ఆశించారు. కానీ, టికెట్ త‌న‌కు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆయన అల‌క‌బూనారు. దీంతో గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఈ సీనియ‌ర్ నేత దూరంగా ఉంటున్నారు.  ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల మీడియా స‌మావేశంలోనూ ఆయ‌న బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే, ఇలా పార్టీకి దూరంగా ఉంటున్న వీహెచ్‌ను మ‌హేశ్ కుమార్ గౌడ్ బుజ్జ‌గించి సీఎం వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి.. వీహెచ్‌కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.

బీజేపీది ద్వంద్వ వైఖరి.. గంగలో మునిగితే పాపాలు.. బీజేపీలో చేరితే అవినీతి ఆరోపణలూ మాయం?!

కేంద్రంలోని మోడీ సర్కార్ అవినీతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుంది. అస్మదీయులపై అవినీతి ఆరోపణలను పట్టించుకోదు. తస్మదీయులైతే మాత్రం తన అధీనంలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుంది. అదేమిటన్న ప్రశ్నకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మాకు ఏంటి సంబంధం అని ఎదురు ప్రశ్న వేస్తుంది.  సీబీఐ, ఈడీ, ఐటీ  వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తడానికి మోడీ సర్కార్  తీరే కారణం  సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొదలు కల్వకుంట్ల కవిత వరకూ, మమతా బెనర్జీ మొదలు అరవింద్ కేజ్రివాల్, కేసీఆర్,కేటీఆర్ వరకూ,శరద్ పవార్ మొదలు ఉద్ధవ్ థాకరే వరకూ, చిన్నా పెద్ద అవినీతి అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న, ఎదుర్కొన్న రాజకీయ నాయకులు, ఆ నాయకుల మద్దతుదారులే ఇందుకు ఉదాహరణ.     ఇటీవల కాలంలో  కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ వరకు ప్రతిపక్ష పార్టీలన్నీ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలపై కక్షకట్టి కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలగుప్పిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ ఆరోపణలలో వాస్తవం లేకపోలేదని అనిపించక మానదు.  సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తోన్న కేసుల్లో  సింహభాగం బీజేపీని వ్యతిరేకించే నేతలు, మోడీ అధికారన్ని ప్రశ్నించే పార్టీల అధినేతలవేనన్న విషయం తెలిసిందే.   ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎవరైనా కమలం తీర్థం పుచ్చుకుంటే వారి అవినీతి మరక అంటని పునీతులుగా మారిపోతున్నారు.  ఔను బీజేపీ పార్టీలో చేరిన తరువాత అప్పటి వరకూ అవినీతి పరులుగా వారిపై గుప్పిస్తున్న విమర్శలకు ఠక్కున ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఉదాహరణకు అక్రమ మైనింగ్ సహా పలు కూసులను ఎదుర్కొంటూ, జైలుకు కూడా వెళ్లి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి   బీజేపీ రెడ్ కార్పెట్ పరిచి మరీ పార్టీలోకి వెల్ కమ్ చెప్పింది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసి జైలుకు తరలించింది. అదే సమయంలో ఏపీలో మద్యం అమ్మకాలలో జగన్ రెడ్డి సర్కార్ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పాపం ఈడీ ఆ ఫిర్యాదువైపు కూడా చూడలేదు. ఇందుకు కారణాలను ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు.  బిజెపి కక్షపూరిత రాజకీయాలు అవలంబిస్తోందనడానికి ఇవే ఉదాహరణలు.   

మాజీ మంత్రి హరీష్ రావ్ పిఏ అరెస్ట్ 

 మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవితను  ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్రంలో బిజెపి సర్కార్ తిహార్ జైలుకు తరలించిన  మరుసటి రోజే కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావ్ పీఏ ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు మాజీ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) ను హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల దుర్వినియోగం కేసులో హరీశ్ రావు పీఏ నరేశ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంరిలీఫ్ ఫండ్  నిధులు దుర్వినియోగం అయ్యాయని, అనర్హులకు చెక్కులు అందించారని మెదక్ జిల్లా నారాయణఖేడ్ కు చెందిన రవినాయక్ ఫిర్యాదు చేశారు. తనకు మంజూరైన రూ.5 లక్షల చెక్కును నరేశ్ కుమార్ కాజేశాడని ఆరోపించాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ తర్వాత నరేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రి హరీశ్ రావు ఆఫీసులో నరేశ్ కుమార్, మరో ముగ్గురు ఆఫీసు సిబ్బంది సీఆర్ఎంఎఫ్ విభాగంలో పనిచేశారు. ఈ క్రమంలోనే చెక్కుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు సమాచారం. రవినాయక్ కు చెందిన రూ.5 లక్షల చెక్కును క్యాష్ చేసుకుని నరేశ్, వంశీ, వెంకటేశ్, ఓంకార్ లు పంచుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వారి దగ్గర మరికొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు దొరికినట్లు సమాచారం.

హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి సానియా మిర్జా ? 

హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మహిళను ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తుందా? మతపర సెంటిమెంట్ తో ఎన్నికల బరిలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాధవీలత ఉండటంతో ముస్లింలు వోట్లతో  గెలుపొందడానికి కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తోందా అంటే ఔననే సమాధానం వస్తుంది. తొలుత అలీ బిన్ మస్కతికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇటీవలె  మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో స్నేహ సంబంధాలు కొనసాగించడంతో అధిష్టానం వెనకడుగు వేసింది. అలీ బిన్ మస్కతీ పోటీ చేస్తే ముస్లింవోట్లు చీలిపోతాయని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. కెసీఆర్ ప్రభుత్వానికి సహకారం అందించిన మజ్లిస్ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దత్తు పలుకుతోంది.  హైదరాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ తరఫున భారతీయ టెన్నిస్ క్రీడాకారిణీ సానియా మీర్జా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలత పోటీ చేయనుండటంతో, దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన టెన్నిస్ తార సానియాను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించాలని అధిక సంఖ్యలో అభిమానులు కోరుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆమె తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన విషయం విదితమే. దీంతో ఆమె పలుకుబడిని కాంగ్రెస్ పార్టీ వినియోగించుకోవాలని అభిమానులతో సహా హైదరాబాద్ లోక్‌సభకు చెందిన మహిళా ఓటర్లు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.ఇటీవలె రాజ్య సభకు ఎంపికైన అనిల్ కుమార్ యాదవ్ సానియా మిర్జాకు అత్యంత సన్నిహితుడు కావడంతో హైదరాబాద్ ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తోంది. సానియా మిర్జా పాకిస్థాన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకున్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్  కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి సహకారం అందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 2003 నుంచి టెన్నిస్ క్రీడాకారిణిగా ప్రస్థానం మొదలు పెట్టి. అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ గా నిలిచి దేశానికి కీర్తిని తెచ్చి పెట్టింది. అంతే కాకుండా సానియా మీర్జా సోదరి అనం మీర్జా క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కోడలుగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో సానియాకు పలుకుబడి కూడా ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. అంతేకాకుండా 2021లో వైఎస్ కూతురు… షర్మిల వైఎస్సార్డీపీ అధ్యక్షురాలుగా ఉన్నపుడు మర్యాద పూర్వకంగా కలవడం, ఆపై షర్మిల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ హోదాలో ఉండటంతో సానియాను హైదరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ప్రోత్సహిస్తున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజారుద్దీన్ కూడా సానియా హైదరాబాద్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని సలహాలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ శ్రేణులు సైతం సానియా మీర్జా హైదరాబాద్ లోక్సభస్థానానికి తమ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థినే బరిలోకి దించాలన్న ఏకాభిప్రాయానికి దాదాపు వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరా బాద్ అభ్యర్థిగా సానియా మీర్జా టిక్కెట్ ఖరారైతే మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలే పోటీ చేస్తే, మహిళల చేతుల్లో ఓటమికి గురికాకూడదని మజ్లిస్ జాగ్రత్తలు తీసుకుంటుంది. దీంతో పాటు మజ్లిస్ పార్టీకి మిత్రపక్షమైన బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇదే స్థానం నుంచి బరిలోకి పార్టీ అధిష్టానం దించడం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అయోమయానికి గురిచేస్తోంది. 2024 లోక్ సభ ఎన్నికల వేడి పెరుగుతున్న క్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుకు పైగా స్థానాల్లో ఆధిపత్యం వహిస్తున్న మజ్లిస్ పార్టీ మరింత పట్టును పెంచుకుంటోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లలో ప్రచారాన్ని కొనసాగిస్తున్న మజ్లిస్.. బీజేపీ ఆధీనంలో ఉన్న గోషా మహల్ నియోజకవర్గంలో సైతం పట్టుకు పాగా వేసినట్లు సమాచారం. గత నలభై ఏళ్లుగా హైదరాబాద్ లోక్సభపై ఆధిపత్యం వహిస్తున్న మజ్లిస్ యథావిధిగా పతంగిని ఎగరేస్తుందా లేదా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరైనా గెలుస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

సోము కోసం పట్టు.. రాజమండ్రి సీటుపై కమలం కన్ను

తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ జత కలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాన్చి నాన్చి చివరకు కూటమిలో తాను భాగమే అని ప్రకటించిన బీజేపీ ఆ తరువాత సీట్ల సర్దుబాటు విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడేలా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ఆ పార్టీ వాస్తవ బలాన్ని పరిగణనలోనికి తీసుకుంటే పొత్తులో భాగంగా ఆ పార్టీకి దక్కిన అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ స్థానాలూ చాలా చాలా ఎక్కువన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అయినా కూడా బీజేపీ పొత్తులో భాగంగా తమకు ఇంకా పెద్ద వాటా కావాలంటూ పట్టుబట్టడమే అనుమానాలకు తావిస్తున్నది. చివరకు ఆ పార్టీ రాష్ట్ర నేతలూ, కార్యకర్తలూ కూడా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు.  వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం ఏమిటో? ఆ పార్టీకి ఉన్న ఓటు స్టేక్ ఏమిటో అందరికీ తెలిసిందే. గత ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు నోటాతో పోటీ పడిన విషయమూ విదితమే. అటువంటి పార్టీతో రాష్ట్రంలో బలంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలూ పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాయంటే  సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మరో సారి మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందన్న అంచనాతోనే. గత ఐదేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతి పాలైంది. రాష్ట్ర పునర్నిర్మానానికి, రాష్ట్ర ప్రగతికి కేంద్రం సహకారం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతోనే కొన్ని త్యాగాలకు సిద్ధపడి కూడా తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీతో జట్టు కట్టింది.  ఆ పార్టీ వాస్తవ బలాన్ని మించి స్థానాలను కూడా ఆ పార్టీకి పొత్తులో భాగంగా ఇచ్చింది.  అయితే సీట్ల విషయంలో  ఆ పార్టీ తెగేదాకా లాగుతున్నదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా ఆ పార్టీ తీరు ఉంది. పొత్తులో భాగంగా దక్కిన పది అసెంబ్లీ స్థానాలకే  బలమైన అభ్యర్ధులను నిలబెట్టే పరిస్థితి లేని బీజేపీ ఇప్పుడు అదనంగా మరో స్థానం కావాలని పట్టుబట్టడం,  నిన్నటి వరకూ రాష్ట్రంలో వైసీపీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోసం పట్టుబట్టడం చూస్తుంటే.. కొందరు అభ్యర్థులను ఆ పార్టీ వైసీపీని గెలిపించడం కోసం నిలబెడుతోందా అన్న అనుమానాలు బీజేపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. తమకు అదనపు సీటు కావాలనీ, అది కూడా సోము వీర్రాజు కోసం అనీ బీజేపీ కోరడంపై తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. అదీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి రాజమండ్రి నుంచి సోములు పోటీకి నిలిపేందుకు బీజేపీ రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ స్థానాన్ని కేటాయించాలని కోరడాన్ని తెలుగుదేశం, జనసేన శ్రేణులే కాదు, చివరాఖరికి రాష్ట్ర బీజేపీ  నేతలూ, కార్యకర్తలూ కూడా తప్పుపడుతున్నారు.  తాజాగా మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ కీలక భేటీలో పొత్తులో భాగంగా, మరొక అసెంబ్లీ సీటు కావాలని తెలుగుదేశం పార్టీని కోరాలని ఆ పార్టీ నిర్ణయించింది. అంతే కాదు తాము పదకొండు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టనున్నామని ఆ పార్టీ జాతీయ నేత సిద్దార్ద్‌నాధ్‌సింగ్  ఆ సమావేశంలో చెప్పిట్లు సమాచారం. ఆ అదనపు సీటు రాయలసీమలోని  తంబళ్లపల్లె లేదా రాజం పేటఇవ్వాలని బీజేపీ తెలుగుదేశం పార్టీని కోరుతోంది.  అదే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బదులు, రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి అర్బన్ సీటు కావాలని బీజేపీ పట్టుబడుతోంది.  ఆ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే  తెలుగుదేశం ఇప్పటికే  అభ్యర్ధులను ప్రకటించేసింది. ఆ రెండు నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం తమకు కేటాయిస్తే అక్కడ నుంచి పార్టీ రాష్ట్ర మాజీ  అధ్యక్షుడు సోము వీర్రాజును నిలబెడతామని చెబుతున్నది. దీంతోనే పొత్తులో భాగంగా బీజేపీ ఏదైనా బ్యాక్ స్టాబింగ్ వ్యూహం పన్నిందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. సోము వీర్రాజు కోసం పార్టీలోని ఒక వర్గంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడితోపాటు, బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు ఒకరు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కమలం శ్రేణులు అంటున్నాయి. మద్దతునిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అయితే బీజేపీ కోరుతున్న రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేయడం,  ఏ మాత్రం ప్రజా మద్దతు లేని సోము కోసం ఆ సీటు త్యాగం చేయడం అయ్యేపని కాదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.  అన్నిటికీ మించి సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పలు సందర్భాలలో సోము వీర్రాజు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో తనకు సత్సంబంధాలు లేవనీ, తాను ఏం మాట్లాడాలన్నా పార్టీ అధినాయకత్వంతోనే మాట్లాడతాననీ చెప్పిన సంగతి విదితమే. అలాగే సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీ వైసీపీకి బీటీమా అన్నట్లుగా వ్యవహరించారని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. సోము వీర్రాజు వంటి వారిని అభ్యర్థులుగా నిలబెట్టడం వల్ల తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకాశాలు ఇసుమంతైనా ఉండవు. అయినా కూడా బీజేపీ సోము కోసం పట్టుబడుతోందంటే.. ఓటు ట్రాన్స్ ఫర్ కాకపోయినా ఫరవాలేదని భావిస్తోందా? అని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ఓటు తెలుగుదేశం, జనసేనలకు ట్రాన్స్ ఫర్ కాకపోయినా ఆ రెండు పార్టీల అభ్యర్థులకూ వచ్చిన ఇబ్బందేమీ లేదు. అదే తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపీకి ట్రాన్స్ ఫర్ కాకపోతే ఒక్క స్థానంలో కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉండవు.   అది తెలిసి కూడా బీజేపీ బలం లేని నేతలకే సీట్లు ఇవ్వడానికి మొగ్గు చూపుతుండటం చూస్తుంటే.. ఆ పార్టీ ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే ఉందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. 

సాంకేతిక లోపంతో  మెట్రో రైళ్ల నత్తనడక 

సాంకేతిక సమస్యల కారణంగా మెట్రో రైళ్ల వేగం మందగించింది. బుధవారం (మార్చి 267) ఉదయం నుంచి జంటనగర ప్రజలు మెట్రో రైళ్లు నెమ్మదిగా నడవడం, ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  మెట్రో రైళ్లు సాంకేతిక లోపం కారణంగా తీవ్ర జాప్యం అవుతుండటంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సులపై రద్దీ భారం పడింది.   ఉదయం  వేళల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు తమ గమ్య స్థానాలకు సకాలంలో చేరుకోలేక ఇబ్చేబందులు పడుతున్నారు. ఇక మెట్రో స్టేషన్లలో అయితే ఇసుకేస్తే రాలనంతగా జనం కిక్కిరిసిపోయారు. వచ్చిన రైలులో ఎక్కే ప్రయాణీకులు, దిగే ప్రయాణీకుల మధ్య తోపులాటలు సైతం జరుగుతున్నాయి. కాగా సాంకేతిక లోపం కారణంగా రైళ్లు జాప్యం అవుతున్నందుకు చింతిస్తున్నామంటూ అనౌన్స్ చేస్తున్నారు.  

తెలుగుదేశం కూట‌మిదే హ‌వా .. శ్రీ ఆత్మసాక్షి సర్వే

ఏపీలో పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ అధికార పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్‌ పెరుగుతోంది. వైసీపీ అభ్య‌ర్థులు గెలుపుపై బ‌హిరంగంగా ధీమాను వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ లోలోపల ఓట‌మి భ‌యం వారిని వెంటాడుతోంది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల‌ పాల‌న‌పై ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టంతో దాదాపు ఓట‌మి ఖాయ‌మ‌న్న భావ‌న‌కు వైసీపీ అభ్య‌ర్థులు వ‌చ్చిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్నిప్ర‌ముఖ స‌ర్వే ఫ‌లితాల్లోనూ వైసీపీ అధికారాన్ని కోల్పోవ‌టం ఖాయ‌మ‌ని తేలుతుండ‌టంతో జ‌గ‌న్ శిబిరంలో రోజురోజుకు ఆందోళ‌న పెరుగుతోంది. ఆ ఆందోళన నుంచే కొన్ని ఫేక్ సర్వేలను వైసీపీ సోషల్ మీడియా ప్రచారంలో పెడుతోంది. తద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురిచేసేలా వైసీపీ నేత‌లు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ ఆత్మ‌సాక్షి స‌ర్వే ఫ‌లితాలు అంటూ  మూడు రోజుల క్రితం ఒక సర్వే  వెలుగులోకి వ‌చ్చింది. ఈ  స‌ర్వే ఫ‌లితాల్లో వైసీపీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. ఆ సర్వే శ్రీ ఆత్మ‌సాక్షి ఒరిజిన‌ల్ స‌ర్వే అంటూ వైసీపీ సోష‌ల్ మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అన్ని ప్ర‌ముఖ సంస్థ‌ల‌ స‌ర్వేల‌ ఫ‌లితాల్లో కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని తేలింది. కానీ, ఆత్మ‌సాక్షి స‌ర్వే అంటూ వైసీపీ నేత‌లు ప్రచారం చేసిన సర్వేలో మాత్రం వైసీపీ ప్ర‌భుత్వం మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో ప్ర‌జల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆ సర్వే విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్ర‌మంలో నే శ్రీ ఆత్మ‌సాక్షి తాజా స‌ర్వే ఫ‌లితాలు వెలుగులోకి రావ‌టంతో వైసీపీ నేత‌ల కుట్ర‌లు ఏమిటో మరోసారి తేటతెల్లమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డే కొద్దీ స‌ర్వేల‌పై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి పెరుగుతోంది. ఇప్ప‌టికే వెల్ల‌డైన ప్ర‌ముఖ స‌ర్వేల‌న్నింటిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ  కూట‌మిదే విజ‌యం అని తేలింది. తాజాగా ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ‌ల్లో ఒక‌టైన శ్రీఆత్మ‌సాక్షి త‌మ స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బిగ్ షాక్ త‌ప్ప‌ద‌ని సర్వే పేర్కొంది.   ఏపీలో ప్ర‌స్తుత ప‌రిస్థితిని బ‌ట్టిచూస్తే జ‌గ‌న్ పార్టీకి 21 నుంచి 25 అసెంబ్లీ సీట్ల‌కు మించి రావ‌ని శ్రీ ఆత్మ‌సాక్షి స‌ర్వే పేర్కొంది. ఈ స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం. అధికార వైసీపీకి 41.5శాతం, కూట‌మికి 53.5 శాతం ఓటింగ్ న‌మోద‌వుతుంద‌ని తేలింది.  మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 136 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, 21 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక 18 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి, వైసీపీ అభ్య‌ర్థుల మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంటుంద‌ని ఆ హోరాహోరీ స్థానాలలో కూడా  ప‌దికిపైగా స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులకే ఎడ్జ్ ఉంటుందనీ పేర్కొంది.  పార్ల‌మెంట్ ఫ‌లితాల్లోనూ కూట‌మిదే హ‌వా కొన‌సాగ‌నుంది. 25 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో 20 స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, రెండు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని స‌ర్వే ఫ‌లితాల్లో తేలింది. మూడు స్థానాల్లో కూట‌మి, వైసీపీ అభ్య‌ర్థుల మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులోనూ రెండు స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థి, ఒక స్థానంలో వైసీపీ అభ్య‌ర్థికి ఎడ్జ్ ఉంటుందని ఆత్మ‌సాక్షి స‌ర్వే పేర్కొంది. ఉమ్మ‌డి జిల్లాల వారిగా  శ్రీ ఆత్మ‌సాక్షి స‌ర్వే ఫ‌లితాల ప్ర‌కారం వివరాలిలా ఉన్నాయి..  శ్రీ‌కాకుళం ఉమ్మ‌డి జిల్లాలోని  10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌ని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.  విజ‌య‌న‌గ‌రం ఉమ్మ‌డి జిల్లాలోని తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం ఖాయ‌మ‌ని, నాలుగు నియోజ‌క వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, వైసీపీ అభ్య‌ర్థుల మ‌ధ్య హోరాహోరీ పోరు ఉంటుంద‌ని,  వీటిల్లోనూ మూడు సీట్ల‌లో కూట‌మి అభ్య‌ర్థుల‌కే విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని స‌ర్వే పేర్కొంది.  విశాఖ‌ప‌ట్ట‌ణం ఉమ్మ‌డి జిల్లాలోని  15 నియోజ‌క‌వ‌ర్గాల్లో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులే విజయం సాధిస్తార‌ని, కేవ‌లం ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని శ్రీ ఆత్మ‌సాక్షి స‌ర్వే పేర్కొంది. విశాఖప‌ట్ట‌ణాన్ని ప‌రిపాల‌నా రాజ‌ధానిగా మార్చుతాన‌ని సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ప్ప‌టికీ.. అక్క‌డి ప్ర‌జ‌లు జ‌గ‌న్, వైసీపీ నేత‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితిల్లో లేర‌ని శ్రీ ఆత్మసాక్షి సర్వే ఫలితాన్ని బట్టి అర్ధమౌతుంది. రాజ‌ధాని పేరుతో ఇప్ప‌టికే వైసీపీ నేత‌లు విశాఖ‌లో భూదందాకు భారీగా తెర‌లేపారు. దీంతో విశాఖ ప్ర‌జ‌లు రాజ‌ధాని అంటేనే ఆందోళ‌న చెందుతున్న ప‌రిస్థితి.  ఉమ్మడి తూర్పు గోదావ‌రి ఉమ్మ‌డి జిల్లాలో మొత్తం 19 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా వాటిలో  17 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధిస్తార‌ని స‌ర్వే తేల్చింది. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులోనూ టీడీపీ  కూటమి అభ్యర్థికే ఎడ్జ్ ఉంటుందని పేర్కొంది.  అదే విధంగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి  జిల్లాలో ని 15 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను.. 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని.. అందులో నూ ఒక నియోజ‌క‌వ‌ర్గంలో కూట‌మి అభ్య‌ర్థి, మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి ఎడ్జ్ సాధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.   ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా, 15 నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధింస్తార‌ని, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులోనూ కూట‌మి అభ్య‌ర్థుల‌కే విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని స‌ర్వే పేర్కొంది.  ఉమ్మడి గుంటూరు  జిల్లాలో ని 17 నియోజ‌క‌వ‌ర్గాల్లో 16 స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, ఒక స్థానంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులోనూ కూట‌మి అభ్య‌ర్థి విజ‌యానికే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. - ప్ర‌కాశం ఉమ్మ‌డి జిల్లాలో 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎనిమిది స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, మూడు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు, ఒక నియోజ‌క‌వ‌ర్గంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అందులో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యానికి అవ‌కాశాల ఉంటాయ‌ని స‌ర్వే ఫ‌లితాల్లో తేలింది.   ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలో ని 10 నియోజ‌క‌వ‌ర్గాల్లో తొమ్మిది స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, ఒక స్థానంలో వైసీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించే అవ‌కాశం ఉంది.  ఉమ్మ‌డి క‌డప జిల్లాలో 10 నియోజ‌క వ‌ర్గాల్లో ఐదు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, రెండు స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని స‌ర్వే ఫ‌లితాల్లో తేలింది. మూడు స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, వాటిల్లో రెండింటిలో వైసీపీ అభ్య‌ర్థులు, ఒక స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి విజ‌యం సాధించే అవ‌కాశం ఉంటుంద‌ని అంచనా వేసింది.  క‌ర్నూల్ ఉమ్మ‌డి జిల్లాలో ని 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆరు స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, ఆరు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని స‌ర్వే ఫ‌లితాల్లో తేలించింది. రెండు స్థానాల్లో హోరాహోరీ పోరు సాగుతుంద‌ని, వాటిల్లో ఒక‌టి కూట‌మి అభ్య‌ర్థి, ఒక‌టి వైసీపీ అభ్య‌ర్థి  గెలుచుకునే అవ‌కాశాలు ఉంటాయ‌ని పేర్కొంది. ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో 11 స్థానాల్లో కూమి అభ్య‌ర్థులు విజ‌యం సాధిస్తార‌ని, ఒక స్థానంలో వైసీపీ అభ్య‌ర్థి, మ‌రో రెండు స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని స‌ర్వే తేల్చింది. చిత్తూరు ఉమ్మ‌డి జిల్లాలో 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో 10 స్థానాల్లో కూట‌మి అభ్య‌ర్థులు, మూడు స్థానాల్లో వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించే అవ‌కాశాలు ఉన్నాయి. ఒక స్థానంలో హోరాహోరీ పోరు ఉంటుంద‌ని, అయితే ఆ ఒక్క స్థానంలో కూడా వైసీపీ అభ్య‌ర్థి విజ‌యానికి ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయ‌ని శ్రీ ఆత్మ‌సాక్షి స‌ర్వే పేర్కొంది. ​