సోము కోసం పట్టు.. రాజమండ్రి సీటుపై కమలం కన్ను
posted on Mar 27, 2024 @ 12:29PM
తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ జత కలవడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నాన్చి నాన్చి చివరకు కూటమిలో తాను భాగమే అని ప్రకటించిన బీజేపీ ఆ తరువాత సీట్ల సర్దుబాటు విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడేలా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో ఆ పార్టీ వాస్తవ బలాన్ని పరిగణనలోనికి తీసుకుంటే పొత్తులో భాగంగా ఆ పార్టీకి దక్కిన అసెంబ్లీ స్థానాలు, లోక్ సభ స్థానాలూ చాలా చాలా ఎక్కువన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అయినా కూడా బీజేపీ పొత్తులో భాగంగా తమకు ఇంకా పెద్ద వాటా కావాలంటూ పట్టుబట్టడమే అనుమానాలకు తావిస్తున్నది. చివరకు ఆ పార్టీ రాష్ట్ర నేతలూ, కార్యకర్తలూ కూడా పార్టీ అగ్రనాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం ఏమిటో? ఆ పార్టీకి ఉన్న ఓటు స్టేక్ ఏమిటో అందరికీ తెలిసిందే. గత ఎన్నికలలో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు నోటాతో పోటీ పడిన విషయమూ విదితమే. అటువంటి పార్టీతో రాష్ట్రంలో బలంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలూ పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాయంటే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి మరో సారి మోడీ సర్కార్ అధికారంలోకి వస్తుందన్న అంచనాతోనే. గత ఐదేళ్లుగా రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతి పాలైంది. రాష్ట్ర పునర్నిర్మానానికి, రాష్ట్ర ప్రగతికి కేంద్రం సహకారం అవసరం ఉంటుందన్న ఉద్దేశంతోనే కొన్ని త్యాగాలకు సిద్ధపడి కూడా తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీతో జట్టు కట్టింది. ఆ పార్టీ వాస్తవ బలాన్ని మించి స్థానాలను కూడా ఆ పార్టీకి పొత్తులో భాగంగా ఇచ్చింది. అయితే సీట్ల విషయంలో ఆ పార్టీ తెగేదాకా లాగుతున్నదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా ఆ పార్టీ తీరు ఉంది.
పొత్తులో భాగంగా దక్కిన పది అసెంబ్లీ స్థానాలకే బలమైన అభ్యర్ధులను నిలబెట్టే పరిస్థితి లేని బీజేపీ ఇప్పుడు అదనంగా మరో స్థానం కావాలని పట్టుబట్టడం, నిన్నటి వరకూ రాష్ట్రంలో వైసీపీకి గట్టి మద్దతుదారుగా నిలిచిన బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోసం పట్టుబట్టడం చూస్తుంటే.. కొందరు అభ్యర్థులను ఆ పార్టీ వైసీపీని గెలిపించడం కోసం నిలబెడుతోందా అన్న అనుమానాలు బీజేపీ వర్గాల నుంచే వ్యక్తం అవుతున్నాయి. తమకు అదనపు సీటు కావాలనీ, అది కూడా సోము వీర్రాజు కోసం అనీ బీజేపీ కోరడంపై తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. అదీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి రాజమండ్రి నుంచి సోములు పోటీకి నిలిపేందుకు బీజేపీ రాజమండ్రి రూరల్ లేదా అర్బన్ స్థానాన్ని కేటాయించాలని కోరడాన్ని తెలుగుదేశం, జనసేన శ్రేణులే కాదు, చివరాఖరికి రాష్ట్ర బీజేపీ నేతలూ, కార్యకర్తలూ కూడా తప్పుపడుతున్నారు.
తాజాగా మంగళవారం విజయవాడలో జరిగిన బీజేపీ కీలక భేటీలో పొత్తులో భాగంగా, మరొక అసెంబ్లీ సీటు కావాలని తెలుగుదేశం పార్టీని కోరాలని ఆ పార్టీ నిర్ణయించింది. అంతే కాదు తాము పదకొండు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టనున్నామని ఆ పార్టీ జాతీయ నేత సిద్దార్ద్‌నాధ్‌సింగ్ ఆ సమావేశంలో చెప్పిట్లు సమాచారం. ఆ అదనపు సీటు రాయలసీమలోని తంబళ్లపల్లె లేదా రాజం పేటఇవ్వాలని బీజేపీ తెలుగుదేశం పార్టీని కోరుతోంది. అదే విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బదులు, రాజమండ్రి రూరల్ లేదా రాజమండ్రి అర్బన్ సీటు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. ఆ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటికే తెలుగుదేశం ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించేసింది. ఆ రెండు నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం తమకు కేటాయిస్తే అక్కడ నుంచి పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును నిలబెడతామని చెబుతున్నది.
దీంతోనే పొత్తులో భాగంగా బీజేపీ ఏదైనా బ్యాక్ స్టాబింగ్ వ్యూహం పన్నిందా అన్న అనుమానాలు పరిశీలకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. సోము వీర్రాజు కోసం పార్టీలోని ఒక వర్గంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖుడితోపాటు, బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు ఒకరు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు కమలం శ్రేణులు అంటున్నాయి. మద్దతునిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీ కోరుతున్న రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేయడం, ఏ మాత్రం ప్రజా మద్దతు లేని సోము కోసం ఆ సీటు త్యాగం చేయడం అయ్యేపని కాదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అన్నిటికీ మించి సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పలు సందర్భాలలో సోము వీర్రాజు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో తనకు సత్సంబంధాలు లేవనీ, తాను ఏం మాట్లాడాలన్నా పార్టీ అధినాయకత్వంతోనే మాట్లాడతాననీ చెప్పిన సంగతి విదితమే. అలాగే సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీ వైసీపీకి బీటీమా అన్నట్లుగా వ్యవహరించారని తెలుగుదేశం శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. సోము వీర్రాజు వంటి వారిని అభ్యర్థులుగా నిలబెట్టడం వల్ల తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యే అవకాశాలు ఇసుమంతైనా ఉండవు. అయినా కూడా బీజేపీ సోము కోసం పట్టుబడుతోందంటే.. ఓటు ట్రాన్స్ ఫర్ కాకపోయినా ఫరవాలేదని భావిస్తోందా? అని పరిశీలకులు అంటున్నారు.
బీజేపీ ఓటు తెలుగుదేశం, జనసేనలకు ట్రాన్స్ ఫర్ కాకపోయినా ఆ రెండు పార్టీల అభ్యర్థులకూ వచ్చిన ఇబ్బందేమీ లేదు. అదే తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపీకి ట్రాన్స్ ఫర్ కాకపోతే ఒక్క స్థానంలో కూడా బీజేపీ గెలిచే అవకాశాలు ఉండవు. అది తెలిసి కూడా బీజేపీ బలం లేని నేతలకే సీట్లు ఇవ్వడానికి మొగ్గు చూపుతుండటం చూస్తుంటే.. ఆ పార్టీ ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగానే ఉందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.