బీజేపీది ద్వంద్వ వైఖరి.. గంగలో మునిగితే పాపాలు.. బీజేపీలో చేరితే అవినీతి ఆరోపణలూ మాయం?!
posted on Mar 27, 2024 @ 2:31PM
కేంద్రంలోని మోడీ సర్కార్ అవినీతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుంది. అస్మదీయులపై అవినీతి ఆరోపణలను పట్టించుకోదు. తస్మదీయులైతే మాత్రం తన అధీనంలో ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుంది. అదేమిటన్న ప్రశ్నకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మాకు ఏంటి సంబంధం అని ఎదురు ప్రశ్న వేస్తుంది.
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తడానికి మోడీ సర్కార్ తీరే కారణం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొదలు కల్వకుంట్ల కవిత వరకూ, మమతా బెనర్జీ మొదలు అరవింద్ కేజ్రివాల్, కేసీఆర్,కేటీఆర్ వరకూ,శరద్ పవార్ మొదలు ఉద్ధవ్ థాకరే వరకూ, చిన్నా పెద్ద అవినీతి అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న, ఎదుర్కొన్న రాజకీయ నాయకులు, ఆ నాయకుల మద్దతుదారులే ఇందుకు ఉదాహరణ.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ వరకు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలపై కక్షకట్టి కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలగుప్పిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ ఆరోపణలలో వాస్తవం లేకపోలేదని అనిపించక మానదు. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తోన్న కేసుల్లో సింహభాగం బీజేపీని వ్యతిరేకించే నేతలు, మోడీ అధికారన్ని ప్రశ్నించే పార్టీల అధినేతలవేనన్న విషయం తెలిసిందే. ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎవరైనా కమలం తీర్థం పుచ్చుకుంటే వారి అవినీతి మరక అంటని పునీతులుగా మారిపోతున్నారు. ఔను బీజేపీ పార్టీలో చేరిన తరువాత అప్పటి వరకూ అవినీతి పరులుగా వారిపై గుప్పిస్తున్న విమర్శలకు ఠక్కున ఫుల్ స్టాప్ పడిపోతుంది. ఉదాహరణకు అక్రమ మైనింగ్ సహా పలు కూసులను ఎదుర్కొంటూ, జైలుకు కూడా వెళ్లి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి బీజేపీ రెడ్ కార్పెట్ పరిచి మరీ పార్టీలోకి వెల్ కమ్ చెప్పింది.
అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసి జైలుకు తరలించింది. అదే సమయంలో ఏపీలో మద్యం అమ్మకాలలో జగన్ రెడ్డి సర్కార్ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పాపం ఈడీ ఆ ఫిర్యాదువైపు కూడా చూడలేదు. ఇందుకు కారణాలను ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. బిజెపి కక్షపూరిత రాజకీయాలు అవలంబిస్తోందనడానికి ఇవే ఉదాహరణలు.