తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవలు ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల వేంకటేశ్వరుని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో వారంతంలోనే కాకుండా సాధారణ రోజులలో కూడా తిరుమలకు భక్తుల తాకిడి అధికంగా ఉంది. గురువారం (మే 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ కాంప్లెక్స్ దాటి ఏటీసీ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని మొత్తం 80 వేల048 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 35 వేల 403 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 17 లక్షల రూపాయలు వచ్చింది. 

ఒక్కటొక్కటిగా వెలుగులోకి పిన్నెల్లి అరాచ‌కాలు

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం పేరు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. నియోక‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఏపీలో  పోలింగ్ రోజు నియోజ‌క‌వ‌ర్గంలో పిన్నెల్లి సోద‌రులు, వారి అనుచ‌రులు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, కార్య‌కర్త‌ల‌పై దాడులకు తెగ‌బ‌డి భ‌య‌ బ్రాంతుల‌కు గురిచేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌లు నిర్వ‌హించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఇందుకు అద్దంప‌డుతూ పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పిన్నెల్లి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసంచేసి, అధికారుల‌ను, టీడీపీ పోలింగ్ ఏజెంట్‌ను బెదిరించిన వీడియో వైర‌ల్ అయింది. దీంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయ్యింది. పిన్నెల్లిపై చ‌ర్య‌లుకు ఈసీని ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకిదిగి పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. ఆయ‌న త‌ప్పించుకొని పారిపోవ‌టం అంతా కొద్ది గంట‌ల వ్య‌వ‌ధిలోనే జ‌రిగిపోయింది. అయితే, పోలింగ్ రోజు ఎమ్మెల్యే అరాచ‌కాల‌పై పోలీసులు, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఇన్నాళ్లు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌న్న అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈవీఎం ధ్వంసం వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చేవ‌ర‌కు పోలీసులు ఈ వ్య‌వ‌హారంపై త‌మ‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.  మాచ‌ర్ల నియోక‌వ‌ర్గంలో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఆయ‌న త‌మ్ముడు వెంక‌ట్రామిరెడ్డి చెప్పిందే వేదం. వారు గీసిన గీత‌దాటితే అవ‌త‌లివ్య‌క్తులు ప్రాణాల‌మీద‌కు తెచ్చుకున్న‌ట్లే.  2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పిన్నెల్లి సోద‌రుల అరాచ‌కాలు పెచ్చిమీరిపోయాయి. వారి అనుచ‌రులు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. వారికి వ్య‌తిరేకంగా ఓటేసిన వారిపై దాడులు, వేధింపుల‌కు పాల్ప‌డ్డారు. తెలుగుదేశం పార్టీకి ప‌ట్టున్న గ్రామాల్లో ఆ పార్టీ నేత‌ల‌ను గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేసి త‌రిమికొట్టారు.  దుర్గి మండ‌లంలోని ఆత్మ‌కూరు, జంగ‌మేశ్వ‌ర‌పాడు గ్రామాల్లో తెలుగుదేశం నేత‌ల కుటుంబాల‌ను క‌ట్టుబ‌ట్ట‌ల‌తో గ్రామం నుంచి త‌రిమేశారు. పిన్నెల్లి సోద‌రులు, వారి అనుచ‌రుల ఇబ్బందులు త‌ట్టుకోలేక ప‌లు గ్రామాల నుంచి అనేక మంది తెలుగుదేశం మ‌ద్ద‌తు దారులు ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లిపోయారు.  పెందుర్తి మండ‌లం గుండ్ల‌పాడుకు చెందిన తెలుగుదేశం నేత చంద్ర‌య్య‌ను రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు 2022లో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లే గొంతుకోసి చంపేశారు. ఈ దారుణ ఘ‌ట‌న వెనుక పిన్నెల్లి సోద‌రులు ఉన్న‌ట్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు.. అదే ఏడాది దుర్గి మండ‌లం జంగ‌మేశ్వ‌ర‌పాడులో తెలుగుదేశంకు చెందిన  జంగ‌య్య‌ను అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత హ‌త్య చేశాడు. గ‌త ఐదేళ్ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గంలో నిత్యం దాడులు, హ‌త్య‌ల‌కు పిన్నెల్లి అనుచ‌రులు తెగ‌బ‌డ్డారు. మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో ఏ వ్యాపారం నిర్వ‌హించుకోవాల‌న్నా పిన్నెల్లి సోద‌రుల‌కు క‌ప్పం క‌ట్టాల్సిందే. లేదంటే వారిపై దాడులు జ‌ర‌గ‌డంతో పాటు, వారి వ్యాపారాలు మూసివేస్తారు. దీంతో గ‌త ఐదేళ్లుగా పిన్నెల్లి సోద‌రులు, వారి అనుచ‌రుల పేరు చెబితేనే వ్యాపారులు భ‌య‌ప‌డే ప‌రిస్థితి  ఏర్ప‌డింది.  సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలో పిన్నెల్లి సోద‌రుల వికృత కాండ తారాస్థాయికి చేరిపోయింది. మ‌రో వైపు బెట్టింగ్ బుకీల‌తోనూ పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డికి సంబంధాలు ఉన్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పిన్నెల్లి సోద‌రులు బీభ‌త్సం సృష్టించారు. ప‌లు గ్రామాల్లో టీడీపీ నుంచి నామినేష‌న్ వేయ‌కుండా చేశారు. మాట‌విన‌ని వారిపై దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. తెలుగుదేశం సానుభూతి ప‌రుల వ్యాపారాల‌పై దాడులు చేయ‌డం, ఆ పార్టీ నేత‌లను బెదిరింపుల‌కు గురిచేయ‌డం గ‌త ఐదేళ్ల కాలంలో మాచెర్ల‌లో నిత్య‌కృత్యంగా మారింది. అధికారులు, పోలీసులు సైతం పిన్నెల్లి సోద‌రులు ఏం చెబితే అది చేస్తూ వ‌చ్చార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ త‌మ అనుకూల పోలీసులు, అధికారుల స‌హ‌కారంతో ఏక‌ప‌క్షంగా పోలింగ్ జ‌రిపించుకునేందుకు పిన్నెల్లి సోద‌రులు ప్ర‌య‌త్నాలు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశంకు ప‌ట్టున్న గ్రామాల‌ను టార్గెట్ గా చేసుకొని దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ప‌లు గ్రామాల్లో పోలింగ్ బూత్ ల‌లో తెలుగుదేశం ఏజెంట్లు లేకుండా చేసే ప్ర‌య‌త్నాలు చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో తానేం చేసినా అడ్డుకునేవారు లేర‌న్న రీతిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. ఈ క్ర‌మంలోనే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి స్వ‌యంగా ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసి అధికారుల‌ను, టీడీపీ పోలింగ్ ఏజెంట్ ను  బెదిరించాడు.  అక్క‌డున్న పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. త‌మ‌కేమీ తెలియ‌ద‌న్న‌ట్లుగా ఉండిపోయారు. తాజాగా, పోలింగ్ బూత్ లో పిన్నెల్లి ఈవీఎంను ద్వంసం చేసిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ అయింది.  వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీఈవోపై సీరియ‌స్ అయింది. ఎందుకు అరెస్ట్ చేయ‌లేదంటూ ప్ర‌శ్నించింది. దీంతో రంగంలోకి దిగిన‌ ఈసీ పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక‌.. పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిపై ప‌లు సెక్ష‌న్లతో కేసులు సైతం న‌మోద‌య్యాయి. పోలీసులు అల‌ర్ట్ అయ్యేలోపే పిన్నెల్లి ప‌రార‌య్యాడు. పిన్నెల్లి వాహ‌నాల‌ను సంగారెడ్డి జిల్లాలో సీజ్ చేశారు. పిన్నెల్లి డ్రైవ‌ర్ ను అరెస్టు చేశారు. కారులో పిన్నెల్లి ఫోన్ ఉండటంతో దానిని స్వాధీనం చేసుకున్నారు.  అయితే, పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పోలీసుల కంట‌ప‌డ‌కుండా వైసీపీ అనుకూల మీడియా వాహ‌నంలో త‌ర‌లించార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఒక దశలో పిన్నెల్లి కూడా అరెస్టయ్యారని వార్తలు వచ్చాయి. స్వయంగా పోలీసులే అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అంతలోనే పోలీసుల కళ్లు కప్పి పిన్నెల్లి పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే   కేంద్ర ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్ కావడంతో గ‌త ఐదేళ్లుగా పిన్నెల్లి సోద‌రులు నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. పిన్నెల్లి సోద‌రుల అకృత్యాల‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు మీడియా, పోలీసుల ముందుకొచ్చి త‌మ ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కుతున్నారు. ఈవీఎం ధ్వంసం ఘ‌ట‌న‌పై సీఈసీ సీరియ‌స్ గా ఉండ‌టంలో  పిన్నెల్లిని ఇవాళ లేదా రేపు అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. అరెస్టు త‌రువాత ఆయనపై ఎలాంటి చ‌ర్య‌లు ఉంటాయ‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌త ఐదేళ్ల కాలంలో పిన్నెల్లి సోద‌రుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు పిన్నెల్లిని అరెస్టు చేసి జైలు పంపించాల‌ని, అత‌న్ని ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

పిన్నెల్లి పాపాలపై డీజీపీ కీలక నివేదిక

మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కీలక నివేదికను ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం పంపించారు. సీఈఓ ఎంకే మీనా ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఈ నివేదిక అందజేశారు. పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు డీజీపీ పేర్కొన్నారు. సిట్ ఐజీ వినీత్ బ్రిజీలాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నట్టు డీజీపీ గుప్తా వివరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీప్యాట్ ధ్వంసం చేసిన కేసులో ఏ 1గా చేర్చామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.   

శేషగిరిరావును అభినందించిన చంద్రబాబు

మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రం ఘటనలో బాధితుడు శేషగిరిరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి, పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ అండగా ఉంటుందని... ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈవీఎంపై దాడిని ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని అభినందించారు. పోలింగ్ రోజున పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన సమయంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ ఏజెంట్‌గా ఉన్న శేషగిరిరావు నిలదీసే ప్రయత్నం చేశారు. దీంతో అతనిపై ఎమ్మెల్యే అనుచరులు మారణాయుధాలతో దాడి చేసినట్టు వార్తలొచ్చాయి.తనపై దాడి తర్వాత శేషగిరిరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో శేషగిరిరావు అజ్ఞాతం వీడారు. దాడి విషయం తెలుసుకున్న చంద్రబాబు అతనిని ఫోన్లో పరామర్శించారు. పిన్నెల్లి ఎమ్మెల్యేగా కాకుండా వీధిరౌడీలా ప్రవర్తించారని, ఆయన అనుచరులు ఈవీఎంను పగులగొట్టారని మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే చర్యలకు ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు.

తెలుగు వెలుగును చాటిన జస్టిస్ జయ బాడిగ!

శాంక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితురాలైన అచ్చ తెలుగు మహిళ జయ బాడిగ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఈ సందర్భంగా తెలుగు వెలుగును చాటారు. ప్రమాణ స్వీకారం  చేస్తున్న సమయంలో ఆమె తెలుగులో మాట్లాడారు. తన మాతృభాష తెలుగు మీద వున్న తన అభిమానాన్ని చాటారు. ప్రమాణ స్వీకార ప్రసంగాన్నిప్రారంభిస్తూ ఆమె ‘‘గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవరీవన్... మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం’’ అన్నారు. ఈ  గొప్ప సందర్భంలో తన మాతృభాషలో మాట్లాడ్డం తనకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం అని ఆమె చెప్పారు. ఇలాంటి సందర్భాలలో తెలుగును మాట్లాడ్డం మొదటిసారి ఆమె అన్నారు. ఈ సందర్భంగా ‘‘మృత్యోర్మా అమృతంగమయ.. ఓం శాంతి శాంతి శాంతిః’’ అనే సంస్కృత శ్లోకాన్ని కూడా జయ బాడిగ ఉటంకించారు. అమెరికాలో ఉన్నత స్థానానికి ఎదగడమే కాకుండా అక్కడ తెలుగు వెలుగును ప్రసరింపజేసిన జయ బాడిగకు అభినందనలు. జయ బాడిగ మరెవరో కాదు.. మచిలీపట్నం  పార్లమెంట్ మాజీసభ్యుడు బాడిగ రామకృష్ణ కుమార్తె. జయ బాడిగ తల్లి పేరు బాడిగ ప్రేమలత. బాడిగ రామకృష్ణ దంపతులకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. వారిలో ఒకరు జయ బాడిగ. ఆమధ్య న్యూజిలాండ్ పార్లమెంట్‌కి ఎంపీగా ఎంపికైన ఒక గిరిజన జాతికి చెందిన మహిళ పార్లమెంటులో తన జాతికి సంబంధించిన భాషను, వారి నినాదాన్ని చెప్పడం ప్రపంచమంతా వైరల్ అయింది. ఇప్పుడు జయ శాంటాక్లారా కోర్టులో తెలుగులో చేసిన ప్రసంగం ఆ పార్లమెంట్ సభ్యురాలు చేసిన ప్రసంగంలా వైరల్ అవుతుందో లేదోగానీ, ప్రతి తెలుగు హృదయంలో వైరల్ అవుతుంది.

పిన్నెల్లి బ్రదర్స్ దొరికారు.. కానీ తప్పించుకున్నట్టు పుకార్లు!

మాచర్లలో పోలింగ్ సందర్భంగా విధ్వంసాన్ని సృష్టించి, గృహ నిర్బంధం నుంచి హైదరాబాద్‌కి పారిపోయిన మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన సోదరుడిని పోలీసులు తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర వున్న ఇస్నాపూర్ వద్ద అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే, తమను అరెస్టు చేసిన పోలీసుల కళ్ళుగప్పి పిన్నెల్లి బ్రదర్స్ తప్పించుకుని పారిపోయారని తెలుస్తోంది. వీళ్ళ అరెస్టు గురించి గానీ, మళ్ళీ తప్పించుకుని పోయిన  విషయంలో గానీ, పోలీసుల నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు. పిన్నెల్లి సోదరులు ఆల్రెడీ మాచర్లలో పోలీసుల గృహ నిర్బంధం నుంచి గోడదూకి పారిపోయారు. అలా పారిపోవడమే ఒక పెద్ద నేరం.. ఇప్పుడు సంగారెడ్డి దగ్గర నుంచి కూడా పోలీసుల కళ్ళుగప్పి పారిపోయినట్టయితే, అది నిజంగా వారి పతనాన్ని వారే కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. తాజా సమాచారం ప్రకారం పిన్నెల్లి బ్రదర్స్.ని అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. మరి తమ నుంచి తప్పించుకుంటే మళ్ళీ పట్టుకున్నారా, అసలు తప్పించుకోనే లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. 

ఈవీఎంలో డేటా సేఫ్ : సీఈవో ముఖేష్ కుమార్ మీనా 

ఆంధ్రప్రదేశ్ పోలింగ్‌ రోజున మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని.. మాచర్లలో 7 ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించాం. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉంది. దీంతో కొత్త ఈవీఎంలతో పోలింగ్‌ కొనసాగించాం. డేటా భ‌ద్రంగా ఉండ‌డం వ‌ల్లే రీపోలింగ్ నిర్వ‌హించ‌లేద‌ని వివ‌రించారు.. ఈ కేసులో ఇంకా కొంద‌రిని గుర్తించాల్సి ఉంద‌ని సీఈఓ తెలిపారు. ధ్వంసం ఘ‌ట‌ల‌పై విచార‌ణ ప్రారంభించామ‌ని చెప్పిన ఆయ‌న.. సిట్‌కు పోలీసులు అన్ని వివ‌రాలు అందించార‌న్నారు.   ధ్వంసం ఘ‌ట‌నల‌పై విచార‌ణ ప్రారంభించామ‌ని చెప్పిన ఆయ‌న.. సిట్‌కు పోలీసులు అన్ని వివ‌రాలు అందించార‌న్నారు. 20వ తేదీన రెంట‌చింత‌ల కోర్టులో ఎస్ఐ మెమో దాఖ‌లు చేయ‌డంతో పాటు మొద‌టి నిందితుడిగా పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డిని పేర్కొన‌డం జ‌రిగింద‌న్నారు. ప‌ది సెక్ష‌న్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టిన‌ట్లు సీఈఓ వెల్ల‌డించారు. దీంతో ఆయ‌న‌కు ఏడేళ్ల వ‌ర‌కు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంద‌న్నారు.

కింగ్ విరాట్ కోహ్లీకి లైఫ్ థ్రెట్.. ఉగ్రకుట్రను భగ్నం చేసిన గుజరాత్ పోలీసులు?!

కిక్రెట్ రారాజు, రన్ మిషన్ కింగ్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు పొంచి ఉందా? అంటే ఔననే అంటున్నారు గుజరాత్ పోలీసులు. కచ్చితమైన సమాచారం మేరకు కింగ్ కోహ్లీ లక్ష్యంగా ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించిన నలుగురు టెర్రరిస్టులను అదుపులోనికి తీసుకున్నామని చెబుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పతనం అంచునుంచి పుంజుకుని నాకౌట్ స్టేజ్ కు చేరింది. ఈ ప్రయాణంలో ఆ జట్టు అసాధ్యమనుకున్నది సాధ్యం చేసి చూపించింది. వరుసగా ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకి  బుధవారం ( మే 22) రాజస్థాన్ రాయల్స్ లో ఎలిమినేటర్ లో తలపడడానికి సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ ఐపీఎల్ లో ఆర్సీబీ స్ఫూర్తిదాయక ప్రదర్శన వెనుక ఉన్న చోదక శక్తి కోహ్లీయే అనడంలో సందేహం లేదు. ఈ సీజన్ లో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ కూడా కోహ్లీయే.  ఈ తరుణలో ఆర్సీబీ జట్టు మంగళవారం (మే 21) అత్యంత కీలకమైన ప్రాక్టీస్ సెషన్ కు దూరమైంది. అంతే కాకుండా ప్రెస్ మీట్ కు కూడా ఆర్సీబీ ఆటగాళ్లు బయటకు రాలేదు. గుజరాత్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రాక్టీస్ చేయకుండా హోటల్ కే జట్లు పరిమితమవ్వడానికి గల కారణాలను గుజరాత్ పోలీసులు వెల్లడించారు. కోహ్లీ లక్ష్యంగా ఉగ్రదాడికి సంబంధించిన కచ్చితమైన సమాచారం మేరకు ఆర్సీబీ జట్టును ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకోమని తామే సూచించినట్లు చెప్పారు. అలాగే మీడియా మీట్ కు కూడా దూరంగా ఉండాల్సిందిగా కోరామన్నారు. ఈ ఉగ్రకుట్రకు సంబంధించి నలుగురు అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.  

అంబేడ్కర్‌ విగ్రహానికి ఘోర అవమానం! దళిత సంఘాల రాస్తారోకో...

పిఠాపురంలో అంబేద్కర్‌ విగ్రహానికి అవమానం జరిగింది. పట్టణంలోని అగ్రహారం పశువుల సంత సమీపంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్నిధ్వంసం చేశారు. అంత‌టితో ఆగ‌క, విగ్ర‌హం ముఖంపై క‌సిగా గాట్లు పెట్టారు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు అక్క డకు చేరుకుని అంబేద్కర్‌ విగ్రహాన్ని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ రాస్తారోకోకి దిగారు. అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న ప‌రిస్థితుల నుంచి, ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకే విగ్రహ ధ్వంసాలకు పాల్ప‌డుతున్నారా అనే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది. రాజ‌కీయ నాయ‌కుల‌కు ప‌రిమితులంటూ ఏమీ ఉండ‌వు. ఏ విష‌యాన్ని అయినా త‌మ‌కు రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌నుకుంటే ఎంత‌టికైనా తెగిస్తారు. త‌మ పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల పేరుతో ప్ర‌తి విష‌యానికి రాజ‌కీయ రంగు పులుముతుంటారు. అందుకు నాయ‌కుల విగ్ర‌హాలు  కూడా మిన‌హాయింపేమీ కాదు.  రాజ‌కీయ నేత‌లు విగ్ర‌హాల విధ్వంసానికి ఎందుకు పాల్ప‌డ‌తారంటే....? ఎందుకంటే వారి దృష్టిలో ఇదే సులువైన మార్గం. ఖర్చులేనిది, శ్రమ లేనిది, జన సమీకరణకు రాజకీయ పార్టీలు కష్ట పడాల్సిన‌ పని లేదు.  దేవతా విగ్రహాలు, లేదా రాజ‌కీయ ప్ర‌ముఖుల విగ్ర‌హాలు. ఎవ‌రి అవ‌స‌రం వారిది. ఎప్పుడు ఏలాంటి రాజ‌కీయాల‌కు పాల్ప‌డాలో మ‌న నేత‌ల‌కు బాగా తెలుసు.  పైసా ఖర్చులేకుండా  భారీ ఎత్తున ప్ర‌చారం ల‌భిస్తుంది. జ‌నాల్ని రెచ్చ‌గొట్ట‌వ‌చ్చు. లా అండ్‌ ఆర్డర్ రాష్ట్రంలో విఫలమైందని చూపించడం తేలిక. ఇప్పుడు ఏపీలో మ‌ళ్ళీ 'విగ్రహ ధ్వంస' రాజకీయానికి తెర లేచింది.   - ఎం.కె. ఫ‌జ‌ల్‌

జోగి రమేష్ నోట ప్రతిపక్షం మాట.. ఓటమి ఒప్పేసుకున్నట్లేనా?

విజయంపై విశ్వాసం వ్యక్తం చేయడంలో వైసీపీ కీలక నేతలంతా సైలెంట్ అయిపోయినప్పటికీ కొందరు మాత్రం ఇంకా గంభీరంగా ప్రకటనలు ఇస్తున్నారు. వీరిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్ లు ముందు వరుసలో ఉంటారు. వారి ప్రకటనలను నమ్ముతున్నదెవరు? నవ్వి పోతున్నదెవరు అన్నది పక్కన పెడితే.. వారి ప్రకటనల్లోని డొల్లతనం వారి మాటల్లోనే కనిపించేస్తోంది. తాజాగా జోగి రమేష్ జూన్ 4న సంబరాలకు సిద్ధం కండి అంటూ పార్టీ శ్రేణులకు ఓ పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా ఆయన సందర్భమో అసందర్భమో కానీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి విదేశీ పర్యటన గురించి ప్రస్తావించారు. కోర్టుల అనుమతి తీసుకోవలసిన అవసరం చంద్రబాబుకు లేకపోవడం చేత ఆయన విదేశీ పర్యటనకు పెద్దగా ప్రచారం లేదు. ప్రచారం అవసరం కూడా లేదు. వైద్య పరీక్షలకు విదేశాలకు వెళ్లడం ఆయనకు ఇదే మొదటి సారీ కాదు. కాకపోతే వైసీపీ అధినేత దేశం విడిచి వెళ్లాలంటే ఆయనకు కోర్టు అనుమతి కావాలి. బెయిలుపై ఉన్నందున, అందునా షరతులతో కూడిన బెయిలుపై ఉన్నందున ఆయన పాస్ పోర్టు కోర్టు అధీనంలో ఉంటుంది. కోర్టు అనుమతి తీసుకుని ఆ పాస్ పోర్టు తీసుకుని ఆయన విదేశీయానం చేయాల్సి ఉంటుంది. ఈ సారి కూడా ఆయన కోర్టు అనుమతి తీసుకునే విదేశాలకు వెళ్లారు. అయితే ఈ సారి ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం తెలిపింది. ఆ మేరకు సీబీఐ  కోర్టులో కౌంటర్ కూడా వేసింది. సరే అయినా ఆయన విదేశీపర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చింది. అది కూడా షరతులతో.. ఆయన ఫోన్ నంబర్, ఈమెయిల్ సంబంధిత అధికారులకు ఇచ్చి మరీ వెళ్లాలని షరతు విధించింది. అది పక్కన పెడితే.. జోగి రమేష్ తాను తాజాగా సంబరాలకు సిద్ధం కావాలంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిస్తూ పనిలో పనిగా చంద్రబాబు విదేశీ పర్యటనపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు చేస్తూ పొరపాటునో, గ్రహపాటునో వాస్తవం చెప్పేశారు. నిజమే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెడుతూ కనీసం ప్రతిపక్షానికి చెప్పను కూడా చెప్పలేదని గింజు కున్నారు. అంటే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెడుతూ ప్రతిపక్షానికి సమాచారం ఇవ్వాలన్నారు. అంటే ఏపీలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేననీ, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయేది చంద్రబాబేననీ అంగీకరించేశారు. అలాగే వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమౌతుందని చెప్పేశారు.  దీంతో వైసీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇంతకీ జోగి రమేష్ సంబరాలకు రెడీ కావాలంటూ ఇచ్చిన పిలుపు విపక్షం కాబోతున్నందుకా అని గందరగోళంలో పడ్డారు. 

ప్రాణం తీసిన చెట్టు!

ప్రాణవాయువు ఇచ్చే చెట్టు నిండు ప్రాణం తీసింది. చెట్టు విరిగి మీద పడటంతో రవీంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.  సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆస్పత్రిలో ఈ దారుణం జరిగింది. భార్య సరళాదేవితో కలసి రవీంద్ర ద్విచక్ర వాహనం మీద ఆస్పత్రి ఆవరణలో ప్రవేశించగానే చెట్టు విరిగి వారి మీద పడింది. చెట్టు మోడు  రవీంద్ర ఛాతీ మీద పడటంతో ఆయన అక్కడకక్కడే మరణించారు. సరళాదేవి తలకు గాయం తగిలింది. సరళాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమెకు కాలికి నొప్పిగా వుండటంతో చికిత్స కోసం భర్తతో కలసి కంటోన్మెంట్ ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ ఈ ఘోరం జరిగింది. ఈ దంపతుల మీద కూలిన చెట్టు ఎన్నాళ్ళక్రితమో వేళ్ళు పెకల్చుకుని బయటకి వచ్చింది. ఆస్పత్రి సిబ్బంది చెట్టును తొలగించకపోవడం వల్ల ఒప్పుడు ఒక నిండు ప్రాణం పోయింది. భర్త చనిపోయిన విషయం ఇంకా సరళాదేవికి తెలియదు..

రెడీ అవుతున్న లోకేష్ రెడ్‌బుక్‌!

ఐదేళ్ళుగా లోపల్లోపల రగిలిపోతున్న అగ్నిపర్వతం బద్దలయ్యే సందర్భం రాబోతోంది. ‘లోకేష్ రెడ్‌బుక్’ రెడీ అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు... వీటికి సహకరిస్తున్న ప్రభుత్వాధికారుల పేర్లు అన్నీ తన దగ్గర వున్న ‘రెడ్‌బుక్‌’లో చేరతాయని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్‌లో వున్న లిస్టు మీద తప్పకుండా చర్యలు... అది కూడా మైండ్ బ్లాక్ అయ్యే చర్యలు వుంటాయని లోకేష్ ఏనాడో ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చే సంకేతాలు పుష్కలంగా కనిపిస్తూ వుండటంతో లోకేష్ ‘రెడ్‌బుక్‌’లో లేటెస్ట్ ఎంట్రీలు వేస్తున్నారు. మొత్తం ఎవరెవరు ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారు. ఏయే అధికారులు అక్రమాలకు ఎలా సహకరించారు... ఇలాంటి వివరాలన్నిటినీ రెడ్ బుక్‌లో  నిక్షిప్తం చేస్తున్నారు. తెలుగుదేశం అధికారం చేపట్టిన  రోజునుంచే రెడ్ బుక్ పేజీల్లో ఎవరెవరి పేర్లు వున్నాయో... వారి పేజీలు చిరిగిపోవడం ప్రారంభమవుతుంది.

అత్తారింటికి పవన్ కళ్యాణ్? ఫ్యామిలీతో రష్యా టూర్?

ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్య నాయకులందరూ విదేశాలకు వెళ్ళిపోయారు. ఎన్నికల సందర్బంగా అందరి బుర్రలు వాచిపోయాయి. రిలాక్స్ అవడం కోసం కావచ్చు.. వైద్య పరీక్షల కోసం కావచ్చు.. ఇతర కారణాల వల్ల కావచ్చు ఎవరికి వారు విదేశాల బాట పట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళారు. అక్కడ ఆయన రిలాక్స్ అవడంతోపాటు వైద్య పరీక్షలు కూడా చేయించుకోబోతున్నారు. ఇక షర్మిలమ్మ అమెరికా వెళ్లారు. జగన్ అయితే లండన్, స్విట్జర్లాండ్ టూర్ వెళ్ళిపోయారు. ఇక మిగిలింది జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ కూడా ఈ ఎన్నికల సందర్భంగా హార్డ్ వర్క్ చేశారు. ఇక ఫలితాలు వెలువడే జూన్ తర్వాత ఆయన ఫుల్ బిజీ. అందుకే ఆయన కూడా రిలాక్స్ కావడానికి విదేశం వైపు చూస్తున్నట్టు సమాచారం. ఈసారి అటో ఇటో ఎటోకాకుండా తన భార్య అన్నా లెజ్నేవాతో కలసి తన అత్తగారి దేశమైన రష్యాకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారట. మన అత్తారింటికి దారేది స్టార్.. ఇప్పుడు అత్తగారి ఇంటికి వెళ్ళే దారిలో వున్నాడు.. భలే వుంది కదూ.  

ఇబ్రహీం రైసి చ‌నిపోతే... ఇరాన్ ప్ర‌జ‌లు పండ‌గ చేసుకున్నారు!

దివంగ‌త నేత‌ ఇబ్రహీం రైసిలో రెండు కోణాలున్నాయి. ఒకటి నిరంకుశ మతోన్మాదం, రెండవది తిరుగులేని సామ్రాజ్యవాద వ్యతిరేకత. ఆయ‌న చ‌నిపోయిన సంఘ‌ట‌న మతవర్గాలలో దిగ్భ్రాంతి క‌లిగించింది. మ‌రో వైపు ఇరాన్ దేశమంతటా సామాన్య జనంలో సంతోష ఛాయలు క‌నిపించాయి. ఎందుకంటే.... హిజాబ్‌ ధరించకుండా ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణతో మహషా అమీని ప్రాణాలు తీశారు. మత ఛాంద‌సంతో నైతిక పోలీసింగ్ పేరిట‌, ఆమెకు నీతి పాఠాలు బోధిస్తూ, చిత్ర హింసలు పెడుతూ ప్రాణాలు తీశారు. ఈ సందర్భంగా ఇబ్రహీం రైసి మతాధినేతకు చూపిన విధేయత కారణంగా ఖమేనీకి తగిన వారసుడు అతనే అనే అభిప్రాయం కలిగింది. అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసి తీసుకున్న చర్యలు జనంలో తీవ్ర అసంతృప్తి, నిరసనలకు దారితీశాయి. ముఖ్యంగా నైతిక పోలీసులను రంగంలోకి దించి సమాజాన్ని మత గిరి నుంచి కదలకుండా చేసేందుకు చూశాడు. ఈ క్రమంలోనే మహషా అమీ అనే యువతిని పోలీసు కస్టడీలో చంపివేయటంతో గడచిన ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దాదాపు ఐదు వందల మంది నిరసనకారులను చంపివేశారంటే అణచివేత ఎంత క్రూరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వందలాది మంది జాడ ఇప్పటికీ తెలియదు. వారిని కూడా చంపివేశారా, జైళ్లలో ఉంచారా అన్నది కూడా స్పష్టం కాలేదు.  1998లో 30వేల మందికి పైగా రాజకీయ ఖైదీలను ఉరితీశారు. వీరిలో అధికులు పీపుల్స్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ప్రత్యర్ధులే ఉన్నారు. చరిత్రలో అత్యంత హీన నేరగాండ్లుగా నమోదైన వారి జాబితాలో చేరి ఈ మారణకాండకు బాధ్యులైన ముగ్గురిలో ఇబ్రహీం రైసీ ప్రముఖుడు.  యువకుడిగా ఉన్నపుడే మత ఛాందసాన్ని వంటబట్టించుకున్న ఇబ్రహీం రైసి 1979లో ఇరాన్‌ ఇస్లామిక్‌ విప్లవం పేరుతో జరిగిన పరిణామాల్లో ఖమేనీ అనుచరుడిగా ఉన్నాడు. తరువాత మరింత సన్నిహితుడిగా, దేశ సర్వాధినేతను ఎంపిక చేసి, పర్యవేక్షణ చేసే నిపుణుల కమిటీలో 2006 నుంచి పనిచేశాడు. 2021లో దేశ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా వీర విధేయుడిగా ఎదిగాడు.  అనేక అక్రమాలు, అనేక మంది అభ్యర్థులను పోటీకి అనర్హులుగా చేసిన 2021 అధ్యక్ష ఎన్నికలలో అడ్డగోలు పద్ధతిలో గెలిచాడనే విమర్శలు ఉన్నాయి. రైసీకి మతపెద్దలతో పాటు మిలిటరీ మద్దతు కూడా ఉన్న కారణంగానే ఎన్నిక సాధ్యమైందని చెబుతారు.  ఖమేనీ న్యాయమూర్తుల అధిపతిగా ఉన్న రైసీ 2019లో తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేతలుగా ఉన్న వారితో సహా తరువాత తన పదవీ కాలంలో మొత్తం పదిహేను వందల మందిని ఉరితీయించాడు. తాను అధ్యక్షుడైన తరువాత 2022లో తలెత్తిన నిరసనల సమయంలో 750 మంది ఉన్నారు.  జైళ్లు, ఇతర నిర్బంధ శిబిరాలలో మధ్యయుగాలనాటి ఆటవిక పద్ధతుల్లో వేలాది మందిని చిత్రహింసలకు గురిచేశాడు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

ఫ్లాష్.. ఫ్లాష్.. పిన్నెల్లి అరెస్టు

వైసీపీ నేత పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ లో పోలీసులు  పిన్నెల్లిని అరెస్టు చేశారు.  మాచర్ల వైసీపీ అభ్యర్థి అయిన పిన్నెల్లి పోలింగ్ రోజున విధ్వంసానికి పాల్పడటంతో పోలీసులు ఆయనను హౌస్ అరెస్టు చేశారు. అయితే హౌస్ అరెస్టు నుంచి తప్పించుకుని ఆయన పరారయ్యారు. ఆ తరువాత తాపీగా సొంత పనిమీద హైదరాబాద్ వచ్చినట్లు సామాజిక మాధ్యమం ద్వారా ఓ ప్రకటన జారీ చేశారు. అదలా ఉంచితే తాజాగా ఆయన పోలింగ్ రోజున ఓ పోలింగ్ బూత్ లోకి జొరబడి ఈవీఎంను ధ్వంసం చేయడానికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనపై క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. సాయంత్రం ఐదు గంటల లోగా ఆయనను అరెస్టు చేయాలని పేర్కొనడంతో పోలీసులు పిన్నెల్లి కోసం వేట మొదలు పెట్టారు. తొలుత మధ్యాహ్నం ఆయన కారు డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఆయన కారును, అందులోని సెల్ ఫోన్ నూ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కొద్ది సేపటికే పిన్నెల్లి సంగారెడ్డి ఇస్నాపూర్ లో పోలీసులకు చిక్కారు.  

టిఎస్ ఆర్టీసీ ఇక నుంచి టీజీఎస్  ఆర్టీసి గా మార్పు 

ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ పేరు కాస్తా మారిపోయింది. తెలంగాణ ఆవిర్బావం తర్వాత అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం తన మార్కు ఉడేలా  జాగ్రత్తపడింది. ఇందుకు సరికొత్త రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి తెచ్చింది. టీఎస్ఆర్టీసీని త్వరలో టీజీఎస్ఆర్టీసీగా మార్చనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. త్వరలో లోగోలో మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక నుంచి బస్సులను టీజీ సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు మార్చింది. అయితే ఉద్యమం సమయంలో టీజీని తెలంగాణవాదులు, ప్రజలు ఉపయోగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చాక టీఎస్‌ను టీజీగా మార్చుతామని ప్రకటించింది. రాష్ట్రంలో టీజీ అమలుకు కేంద్రం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా, అన్ని ప్రభుత్వ సంస్థల పేర్లలో 'టీఎస్'కు బదులు 'టీజీ'ని ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల వేళ పీఓకే విలీనం మాట.. ఎన్డీయే కూటమిలో తగ్గిన ధీమాకు తార్కాణం?

సార్వత్రిక ఎన్నికలు ఇప్పటివరకూ ఐదు విడతలు పూర్తి అయ్యాయి. జూన్ 1వతేదీతో ఎన్నికలు పూర్తి అవుతాయి. మూడోసారి తమకు అధికారం రావడం గ్యారంటీ అని బీజేపీ ఘంటాపథంగా చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం మేరకు తొలి ఐది విడతలలో బీజేపీ భారీగా నష్టపోతున్నది. చివరి రెండు విడతలలో కూడా ఆ పార్టీ పెద్దగా పుంజుకుంటుందన్న నమ్మకం లేదని అంటున్నారు. ఎందుకంటే చివరి రెండు విడతలలో ఎన్నికలు జరిగే  లోక్ సభ నియోజకవర్గాలలో రైతుల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. దీంతో బీజేపీకి ఇక్కడ పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహం ప్రస్ఫుటమే. ఈ కారణంగానే ఒక్కో విడత పోలింగ్ పూర్తి అవుతున్న కొద్దీ బీజేపీ నేతలు సమాజంలో విద్వేషాలు రగిలేలా ప్రచారంలో స్వరం మార్చారు. తాజాగా అమిత్ షా మోడీ సర్కార్ మూడో సారి అధికారంలోకి రావడం తరువాయి..  పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో విలీనం చేస్తామని ఒక ఎన్నికల సభలో ప్రతిన చేశారు.  ఇక ఆ క్షణం నుంచీ బీజేపీ నేతలందరూ పీవోకే విలీనం అంటూ కోరస్ పాడుతున్నారు. నిజమే పీవోకేలో ఇప్పుడు పరిస్థితులు అంత సవ్యంగా లేవు.  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటాయి.పెట్రోలు ధరలు కూడా ఐదు రెట్లు పెరిగాయి. ప్రజల  నిరసనలు వెల్లువెత్తు తున్నాయి.ఇటీవల భారత్ కు అనుకూలంగా పీవోకేలో  నిరసనకారులు నినాదాలు చేసినట్లు వార్తలు వచ్చాయి.  పీవోకే లో కొన్ని పార్టీలు భారత్ లో విలీనం చేయాలన్న డిమాండ్ ను కూడా తెరమీదకు తీసుకుచ్చాయి. సరిగ్గా దీనినే ఎన్నికలలో తనకు అనుకూలంగా మార్చుకుని లబ్ధి పొందాలన్న వ్యూహానికి బీజేపీ తెరతీసింది.   ఈసారి తాము 400 కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో  ఊదరగొడుతూ, ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే వాస్తవంగా బీజేపీకి విజయంపై నమ్మకం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతి ఎన్నికల ముందూ ఏదో ఒక ప్రజాకర్షక నినాదంతో ఒడ్డెక్కుతున్న బీజేపీ ఈ సారి భారత ప్రత్యేకత అయిన భిన్నత్వంలో ఏకత్వాన్ని దెబ్బతీసేందుకు కూడా వెనుకాడకపోవడం ఆ పార్టీలో నెలకొన్న ఓటమి భయమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తలైతే మూడో సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతూనే.. ఆ పార్టీ ఊదరగొడుతున్న సంఖ్య మాత్రం చేరుకునే అవకాశం ఇసుమంతైనా లేదని ఢంకా బజాయించి చెబుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకున్నా  అధికారం చేపట్టవచ్చని గుర్తు చేస్తున్నారు. మరో వైపు అనూహ్యంగా ఈ సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకున్న ఇండియా కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గట్టిపోటీ ఇస్తున్నది. తొలి ఐదు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే ఎన్డీయే, ఇండియా కూటముల్లో దేనికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. మొత్తం మీద ఎన్డీయే కూటమికి 400 ప్లస్ స్థానాలు అంటూ మోడీ అండ్ కో చేస్తున్న ప్రచారం కేవలం ఆర్భాటం మాత్రమేననీ, క్షేత్రస్థాయిలో అంత సీన్ కనిపించడం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కవిత అరెస్ట్ వెనుక సంతోష్ హ‌స్తం? బీజేపీతో సంతోష్‌కున్న లింక్ ఏంటి?

ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అయినపుడు.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు 2017 లో ప్రభుత్వ స్పెషల్ జీ.ఓ ద్వారా కార్పొరేట్ మద్యం దుకాణాన్ని తెరిచి.. పన్నులు చెల్లించకుండా యథేచ్చగా అక్రమాలకు పాల్పడిన టానిక్ ది, స్కామ్ అని బీజేపీ పెద్దలు భావించలేదు? ఎందుకు కవితను మాత్రమే టార్గెట్ చేశారు? రెండు మధ్యానికి సంబందించిన కుంభకోణాలే కదా! రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవే కదా! అక్కడ కేజీవాల్ ప్రభుత్వం రూపొందించిన పాలసీ తప్పు అయితే….. ఇక్కడ ప్రత్యేక జీవోతో నాటి కేసీఆర్ ప్రభుత్వం అనుమతిచ్చిన మద్యం వ్యాపారమే కదా! కేవలం టానిక్ వెనుక ఉన్నది సంతోష్ అని పట్టించుకోకుండా పదిలేశారా!  టానిక్ విషయానికి వస్తే అదొక పెద్ద స్కామ్ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక విచారణ చేపట్టింది. ఎలాంటి అనుమతులు లేకుండా టానిక్ పేరుతో కార్పొరేట్ మద్యం దుకాణాలు నడిపించిన యాజమాన్యం.. విదేశీ ఖరీదైన మద్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తూ లాభాలు గడించడమే కాకుండా వంద కోట్లకు పైగా జీఎస్టీ ని ఎగవేసినట్లుగా గుర్తించారు. అంతే కాదు పొరుగున ఉన్న మహారాష్ట్ర లో కూడా తమ దుకాణాలను విస్తరించినట్లుగా గుర్తించారు. మహారాష్ట్ర పూణే నగరంలో టానిక్ వైన్ షాప్స్ ఏర్పాటు చేశారు.  ఢిల్లీలో కీలకంగా వ్యవహరించిన సంతోష్ ప్రమేయంలేకుండానే ఢిల్లీ లిక్కర్ పాలసీ లో కవిత పెట్టుబడి పెట్టిందా! అసలు కవిత చేత పెట్టుబడి పెట్టించాలని ప్రోత్సహించింది ఎవరు అనే ప్రశ్నలూ ఉత్పన్నమౌతున్నాయి. ఒక వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేయించిన పెద్దలు అంత కంటే ముందు నుండే లిక్కర్ వ్యాపారాన్ని పరోక్షంగా నిర్వహిస్తున్న సంతోష్ ని ఎందుకు వదిలేశారు! ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేవ‌లం వంద కోట్లు పెట్టుబడి పెట్టిందని కవితను అరెస్ట్ చేశారు! మరి అంతకంటే పెద్ద లిక్కర్ స్కామ్ ను వెనకుండి నడిపించిన సంతోష్ ని ఎందుకు వదిలేశారు? అసలు సంతోష్ ఎలా త‌ప్పించుకున్నారు?  కేసీఆర్ వెన్నంటి ఉంటూ, ఎప్ప‌ట్టిక‌ప్పుడు బీజేపీ పెద్దలకు స‌మాచారం అందించి, కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని ఇరుకున పడేలా చేశారా?  అసలు సంతోష్ లక్ష్యమేమిటి, రాజకీయంగా తన ఎదుగుదలకు కేటీఆర్, కవిత, హరీష్ రావు అడ్డుగా ఉన్నారని బావించాడా! వారిని అడ్డులేకుండా చేసుకోవడానికే లోపాయికారిగా బీజేపీ తో చేతులు కలిపాడా! అనే అనుమానాలు ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో వ్యక్తమవుతున్నాయి!  సంతోష్, త‌న స్వప్రయోజనాల కోసం, అవినీతి దందాలలో కేసుల బారిన పడకుండా ఉండటం కోసమే, క‌విత‌ను బ‌లిపీఠం ఎక్కించారు. నమ్మకంగా వెంట బెట్టుకున్న కేసీఆర్ ను నట్టెట్ట ముంచడమే లక్ష్యంగా సంతోష్ పావులు కదిపారు.  కేసీఆర్ కుటుంబసభ్యుల కదలికలపై సంతోష్ నిఘా పెట్టించాడు! పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్, కవిత, హరీష్ రావు వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సంతోష్ ఒక ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్నే నడిపించాడనేది బహిరంగ రహస్యమే! తమపై సంతోష్ నిఘా పెట్టిన విషయం గ్రహించిన కవిత, కేటీఆర్ కి, తండ్రికి చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ,  సంతోష్ పైనే కేసీఆర్‌ చాలా విశ్వాసం ఉచేవారనేది పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.  ఢిల్లీలో కీలక వ్యవహారాలన్నీ సంతోషే చూసుకునే వారు. అలాంటిది కవిత పేరు లిక్కర్ స్కామ్ లో బయటకు రాగానే కేసీఆర్ ఉలిక్కి పడ్డాడు! ఢిల్లీలో అత్యంత కీలకంగా రాజకీయ వ్యవహార నడిపించిన సంతోష్ కు లిక్కర్ స్కామ్ గురించి ముందే తెలియదా అన్న అనుమానాలు కేసీఆర్ లో మొదలయ్యాయి! తెలిసే కావాలనే గోప్యంగా ఉంచాడా అని అనుమానం వచ్చింది! దీంతో కేసీఆర్ మెల్లిగా సంతోష్ ను దూరం పెట్టడం మొదలెట్టాడు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న అత్యంత కీలక సమయంలో సంతోష్ ని కేసీఆర్ దూరం పెట్టడం పార్టీ శ్రేణుల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది! ఇదిలా ఉండగానే అసెంబ్లీ, ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడం, కేసీఆర్ జారిపడి అనారోగ్యానికి గురవ్వడం వంటి పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. అధికారం కోల్పోయిన తర్వాత పూర్తిగా అశక్తుడిగా మారిపోయిన కేసీఆర్ ఎవరిని ఏమీ అనలేని దయనీయ స్థితిలోకి పడిపోయాడు. అదే సరైన సమయంగా భావించిన సంతోష్.. మళ్ళీ వచ్చి కేసీఆర్ వద్ద మెల్లిగా చేరిపోయాడు. సంతోష్ గురించి అన్ని తెలిసినా.. అతన్ని ఏమి చేయలేని దీనావస్థలో కేసీఆర్ ఉన్నట్లుగా సొంత పార్టీ నేతలకు సహా అందరికీ అనిపించింది. ఈలోగా కవిత అరెస్ట్ శరాఘాతంలా కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడింది. అసలే అధికారం కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడిన కేసీఆర్ కుటుంబ సభ్యులను కవిత అరెస్ట్ మరింత సంక్షోభంలోకి నెట్టేసింది, ఎవరినీ ఎవరు రక్షించలేని స్థితిలో కేసీఆర్ కుటుంబసభ్యులు పడిపోయారు. ఒక వైపు సంక్షోభం నుండి ఎలా బయట పదాలో తెలియకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత సహా ఇతర కుటుంబ సభ్యులు సతమతమౌతుంటే.. సంతోష్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండడం అందరిని విస్మయ వరుస్తోంది. కవిత అరెస్ట్ తీహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉండి దాదాపు యాభై రోజులు కావస్తున్నా… సంతోష్ మాత్రం జైలుకు వెళ్లి కనీసం పలకరించిన పాపాన పోలేదు. ఓవైపు కేటీఆర్, కవిత కుటుంబం, హరీష్ రావు తీహార్ జైలుకు వెళ్లి కవితను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి వస్తున్నా.. సంతోష్ మాత్రం అటువైపు చూడటంలేదు! అసలు కవిత ఆరెస్ట్ అయినా నాటి నుండి సంతోష్ ఢిల్లీ కి వెళ్లడమే మానేసాడు!. సంతోష్ వ్య‌వ‌హారం మొత్తం కేసీఆర్‌కు తెలుసు. అయినా ఎందుకు నోరువిప్పడం లేదు.  కేవ‌లం రాజకీయ కక్షతోనే నా కూతురిని మోడీ అరెస్ట్ చేయించాడని కన్నీళ్లు కారుస్తున్న కేసీఆర్,  సంతోష్ను ఎందుకు వదిలేస్తున్నారు. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీలో, కేసీఆర్ కుటుంబంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. - ఎం.కె. ఫ‌జ‌ల్‌