ఒక్కటొక్కటిగా వెలుగులోకి పిన్నెల్లి అరాచకాలు
posted on May 23, 2024 6:09AM
మాచర్ల నియోజకవర్గం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. నియోకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో పోలింగ్ రోజు నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు, వారి అనుచరులు ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడి భయ బ్రాంతులకు గురిచేశారు. నియోజకవర్గంలో ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇందుకు అద్దంపడుతూ పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పిన్నెల్లి పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసంచేసి, అధికారులను, టీడీపీ పోలింగ్ ఏజెంట్‌ను బెదిరించిన వీడియో వైరల్ అయింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పిన్నెల్లిపై చర్యలుకు ఈసీని ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకిదిగి పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించడం.. ఆయన తప్పించుకొని పారిపోవటం అంతా కొద్ది గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. అయితే, పోలింగ్ రోజు ఎమ్మెల్యే అరాచకాలపై పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇన్నాళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈవీఎం ధ్వంసం వీడియో బయటకు వచ్చేవరకు పోలీసులు ఈ వ్యవహారంపై తమకేమీ తెలియదన్నట్లుగా వ్యవహరించడం గమనార్హం.
మాచర్ల నియోకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి చెప్పిందే వేదం. వారు గీసిన గీతదాటితే అవతలివ్యక్తులు ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పిన్నెల్లి సోదరుల అరాచకాలు పెచ్చిమీరిపోయాయి. వారి అనుచరులు నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడులకు తెగబడ్డారు. వారికి వ్యతిరేకంగా ఓటేసిన వారిపై దాడులు, వేధింపులకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీకి పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీ నేతలను గ్రామ బహిష్కరణ చేసి తరిమికొట్టారు. దుర్గి మండలంలోని ఆత్మకూరు, జంగమేశ్వరపాడు గ్రామాల్లో తెలుగుదేశం నేతల కుటుంబాలను కట్టుబట్టలతో గ్రామం నుంచి తరిమేశారు. పిన్నెల్లి సోదరులు, వారి అనుచరుల ఇబ్బందులు తట్టుకోలేక పలు గ్రామాల నుంచి అనేక మంది తెలుగుదేశం మద్దతు దారులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. పెందుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన తెలుగుదేశం నేత చంద్రయ్యను రాజకీయ ప్రత్యర్థులు 2022లో నడిరోడ్డుపై పట్టపగలే గొంతుకోసి చంపేశారు. ఈ దారుణ ఘటన వెనుక పిన్నెల్లి సోదరులు ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరిగింది. అంతేకాదు.. అదే ఏడాది దుర్గి మండలం జంగమేశ్వరపాడులో తెలుగుదేశంకు చెందిన జంగయ్యను అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత హత్య చేశాడు. గత ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో నిత్యం దాడులు, హత్యలకు పిన్నెల్లి అనుచరులు తెగబడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఏ వ్యాపారం నిర్వహించుకోవాలన్నా పిన్నెల్లి సోదరులకు కప్పం కట్టాల్సిందే. లేదంటే వారిపై దాడులు జరగడంతో పాటు, వారి వ్యాపారాలు మూసివేస్తారు. దీంతో గత ఐదేళ్లుగా పిన్నెల్లి సోదరులు, వారి అనుచరుల పేరు చెబితేనే వ్యాపారులు భయపడే పరిస్థితి ఏర్పడింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల వికృత కాండ తారాస్థాయికి చేరిపోయింది. మరో వైపు బెట్టింగ్ బుకీలతోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిన్నెల్లి సోదరులు బీభత్సం సృష్టించారు. పలు గ్రామాల్లో టీడీపీ నుంచి నామినేషన్ వేయకుండా చేశారు. మాటవినని వారిపై దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం సానుభూతి పరుల వ్యాపారాలపై దాడులు చేయడం, ఆ పార్టీ నేతలను బెదిరింపులకు గురిచేయడం గత ఐదేళ్ల కాలంలో మాచెర్లలో నిత్యకృత్యంగా మారింది. అధికారులు, పోలీసులు సైతం పిన్నెల్లి సోదరులు ఏం చెబితే అది చేస్తూ వచ్చారన్న విమర్శలున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ అనుకూల పోలీసులు, అధికారుల సహకారంతో ఏకపక్షంగా పోలింగ్ జరిపించుకునేందుకు పిన్నెల్లి సోదరులు ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో తెలుగుదేశంకు పట్టున్న గ్రామాలను టార్గెట్ గా చేసుకొని దాడులకు తెగబడ్డారు. పలు గ్రామాల్లో పోలింగ్ బూత్ లలో తెలుగుదేశం ఏజెంట్లు లేకుండా చేసే ప్రయత్నాలు చేశారు. నియోజకవర్గంలో తానేం చేసినా అడ్డుకునేవారు లేరన్న రీతిలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఓ పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసి అధికారులను, టీడీపీ పోలింగ్ ఏజెంట్ ను బెదిరించాడు. అక్కడున్న పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమకేమీ తెలియదన్నట్లుగా ఉండిపోయారు. తాజాగా, పోలింగ్ బూత్ లో పిన్నెల్లి ఈవీఎంను ద్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం సీఈవోపై సీరియస్ అయింది. ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ప్రశ్నించింది. దీంతో రంగంలోకి దిగిన ఈసీ పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు సెక్షన్లతో కేసులు సైతం నమోదయ్యాయి. పోలీసులు అలర్ట్ అయ్యేలోపే పిన్నెల్లి పరారయ్యాడు. పిన్నెల్లి వాహనాలను సంగారెడ్డి జిల్లాలో సీజ్ చేశారు. పిన్నెల్లి డ్రైవర్ ను అరెస్టు చేశారు. కారులో పిన్నెల్లి ఫోన్ ఉండటంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసుల కంటపడకుండా వైసీపీ అనుకూల మీడియా వాహనంలో తరలించారన్న ప్రచారం జరుగుతున్నది. ఒక దశలో పిన్నెల్లి కూడా అరెస్టయ్యారని వార్తలు వచ్చాయి. స్వయంగా పోలీసులే అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అంతలోనే పోలీసుల కళ్లు కప్పి పిన్నెల్లి పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో గత ఐదేళ్లుగా పిన్నెల్లి సోదరులు నియోజకవర్గంలో చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పిన్నెల్లి సోదరుల అకృత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారు మీడియా, పోలీసుల ముందుకొచ్చి తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారు. ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈసీ సీరియస్ గా ఉండటంలో పిన్నెల్లిని ఇవాళ లేదా రేపు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అరెస్టు తరువాత ఆయనపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. గత ఐదేళ్ల కాలంలో పిన్నెల్లి సోదరుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు పిన్నెల్లిని అరెస్టు చేసి జైలు పంపించాలని, అతన్ని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.