సీమాంధ్ర సీఎంగా చిన్నమ్మ?

      కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నట్టుగా రాష్ట్ర విభజన సజావుగా సాగిపోతే, సీమాంధ్రలో కాంగ్రెస్ గెలిస్తే సీమాంధ్ర సీఎంగా చిన్నమ్మ అనగా దగ్గుబాటి పురంద్రీశ్వరి అయ్యే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం రెండు ముక్కలు చేస్తే ఎలాగూ ఆ ముక్కలో కాంగ్రెసే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి.   ఇక ఈ ముక్కలో కూడా అధికారంలోకి రావాలంటే చిన్నమ్మని సీఎం అభ్యర్థిగా తెరమీదకు తేవాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా కనిపిస్తోంది. బొత్స, ఆనం లాంటి నాయకులు కూడా సీమాంధ్రకి సీఎం అయిపోవాలని కలలు కంటున్నప్పటికీ అధిష్ఠానం చిన్నమ్మ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరికి రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గం మద్దతు సంపూర్ణంగా లభించే అవకాశం వుంది. టీడీపీకి అండగా వుండే సామాజికవర్గం ఓట్లలో భారీ చీలిక తెచ్చే అవకాశం వుంది. అలాగే మహా నాయకుడు ఎన్టీఆర్ కుమార్తె కావడం, సమర్థురాలిగా పేరు  తెచ్చుకోవడం, తాజాగా రాష్ట్ర  విభజన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌కి మద్దతుగా మాట్లాడటం ఇవన్నీ  పురందేశ్వరికి  ప్లస్ పాయింట్లుగా మారాయి. రాష్ట్ర విభజన ద్వారా సీమాంధ్రలో కోల్పోయే పరువు, పవరు  పురందేశ్వరికి వల్ల తిరిగి పొందవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు వున్నట్టు తెలుస్తోంది. మహిళను ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా మహిళల ఓటు బ్యాంకుకు కైవసం చేసుకునే అవకాశం వుందని భావిస్తున్నారు. సీమాంధ్రలో బలంగా వున్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలంటే చిన్నమ్మనే రంగంలోకి దించడం కరెక్టని కాంగ్రెస్ భావిస్తోంది.

సమైక్య శంఖారావానికి రావద్దు

      వర్షాల మూలంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయక చర్యలలో పాల్గొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లో జరుగుతున్న సమైక్య శంఖారావం సభకు రావాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. తుఫాను మూలంగా ఇబ్బందులు ఉన్నా..తుపాను కంటే విభజన సమస్య చాలా తీవ్రమయినదని అందుకే సమైక్య శంఖారావం సభ యధావిదిగా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. సభను వాయిదా వేయాలా ? నిర్వహించాలా ? అన్న విషయంలో పార్టీలో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు నిర్వహించాలని నిర్ణయించారు. ఢిల్లీకి సమైక్య వాణి వినిపించేలా సభ నిర్వహించాలని, ఇబ్బందులు ఎన్ని ఉన్నా సభ కొనసాగించాలనే వైఎస్ జగన్ పట్టుబడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రియాంకకీ గాలమేశారు!

      మహబూబ్‌నగర్ స్థానం నుంచి లోక్‌సభకు రాహుల్‌గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర మంత్రిణి డి.కె.అరుణ ఎంతో అభిమానంతో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలుస్తున్న విషయమేమిటంటే, ఒకవేళ రాహుల్‌గాంధీ పోటీ చేయకపోతే, ప్రియాంకాగాంధీ చేతైనా పోటీ చేయించి, తద్వారా తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని అరుణ మేడమ్ భావిస్తున్నట్టున్నారు.   రాహుల్ లేదా ప్రియాంక ఎవరిచేతైనా పోటీ చేయించాలని దిగ్విజయ్‌సింగ్‌కి విన్నవించుకున్నారట. ఆయన నిందు మనసుతో స్పందించి సరే ఇద్దరి పేరుమీద సపరేట్ సపరేట్‌గా వినతిపత్రాలు సమర్పించండి నేను యువరాజుకి, యువరాణికి చెప్పి చూస్తానని అభయమిచ్చాడట. దాంతో జంట వినతి పత్రాలు సమర్పించి అరుణ గారు ఆనందంగా తిరిగొచ్చారట. సమయానికి సలహా ఇచ్చేవారెవరూ మంత్రిణి గారి దగ్గర ఉన్నట్టు లేరు. లేకపోతే సోనియాగాంధీ పేరు మీద ఒక వినతిపత్రం, రాబర్ట్ వధేరా పేరు మీద మరో వినతిపత్రం సమర్పించి వస్తే ఓ పనయిపోయేది. ఆ వినతిపత్రాలు చూసి ఆ నలుగురిలో ఎవరో ఒకరు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పావనం చేసేవారు.

అబ్బ! మళ్ళీ దెబ్బెసేసాడు మనోడు

  ఒక సిద్దాంతానికో నియమానికో కట్టుబడేవి కావు మన రాజకీయాలు, అయినా కట్టుబడిఉన్నట్లు అందరినీ భ్రమింపజేస్తాయి. అలా భ్రమింపజేయడమే రాజకీయం. ఇక సమైక్యాంధ్ర చాంపియన్ షిప్ ట్రోఫీ రేసులో అందరి కంటే ముందున్న కిరణ్, జగన్లు కూడా ఈ రాజకీయాలకు అతీతులు కారు. సమైక్యాంద్ర వాదనలతో కిరణ్ కుమార్ రెడ్డి తన రేటింగ్స్ పెంచుకొనేందుకు కష్టపడుతుంటే, సమైక్యాంద్ర సెంటిమెంటుతో సీమాంద్రాలో తన పార్టీని బలోపేతం చేసుకొని అధికారంలోకి రావాలని జగన్ ఆశపడుతున్నాడు.   కానీ పోటీలో ఒకరు గెలవాలంటే ప్రత్యర్ధిని తప్పనిసరిగా ఓడించాలి. అందుకు ఏదో ఒకటి చేయక తప్పదు మరి. దానిని భరించాలంటే చాలా స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. రేపు హైదరాబాదులో సమైక్య శంఖారావం పూరించి సీమాంద్రాపై మరింత పట్టు సాధించుకోవాలని జగన్ ఆలోచిస్తే, అతనికంటే నాలుగాకులు ఎక్కువ చదివిన కిరణ్ కుమార్ రెడ్డి రెండేళ్ళ క్రితం పెరట్లో పడేసిన ‘రచ్చబండ’ని మళ్ళీ దులిపి సిద్దం చేసుకొని ఆ మిషతో ప్రజలను మంచి చేసుకొనేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా ఒట్టి చేతులతో కాకుండా సామాన్య ప్రజలు ఆశించే రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ళు వంటి తాయిలాలను పట్టుకొని మరీ బయలు దేరుతున్నారు.   కుండపోతగా కురుస్తున్న వానల మధ్య సమైక్య శంఖారవం పూరించడానికి వీలవుతుందో లేదో, ఇంతా కష్టపడి ఊపిరి బిగబట్టి గట్టిగా శంఖం ఊదినా అది జనాలకి వినబడుతుందో లేదో అని దిగులుపడుతున్న వైకాపాకి, కిరణ్ కుమార్ రెడ్డి ఈసారి తమని ఏకంగా రచ్చబండతో కొట్టడంతో కంగు తిన్నారు.   సీమాంద్రాలో ఎలాగోలా నెగ్గుకు రావచ్చును. కానీ, మళ్ళీ తెలంగాణాలో మూసేసిన దుఖాణం తెరవాలంటే ఈ శంఖారావం చాలా అవసరమని వైకాపా భావిస్తుంటే, కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ అదే రచ్చబండతో అక్కడి మంత్రులతో వైకాపాకు కౌంటర్ ఇప్పించే వెసులుబాటు ఉంచుకోవడం కలవరపరుస్తోంది. తెలంగాణా సాధించింది తామేనని, కేవలం తమ పార్టీయే మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని వారు రచ్చబండ మీద నిలబడి మరీ టాం టాం చేసుకొంటూ పనిలోపనిగా అక్కడి జనాలకు కూడా వారు తాయిలాలు పంచి పెట్టి మంచి చేసుకోవచ్చును.   ఇంత జడివానలో తడిసి ముద్దవుతూ అష్టకష్టాలు పడినా దక్కని ఫలం, ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ నేతలు రచ్చబండ దగ్గిర కులాసాగా నాలుగు కబుర్లు చెప్పి, జనాలకి తాయిలాలు పంచిపెట్టి సంపాదించుకోవాలని ప్రయత్నించడం చాలా అన్యాయమని వైకాపా ఆక్రోశిస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవైపు సమైక్యవాదం చేస్తూనే మరోవైపు ప్రజలను సమైక్యం నుండి పక్కదారి పట్టించడానికే ఈ రచ్చబండ కబుర్లు చెప్పడానికి వస్తున్నారని వైకాపా ఆరోపణ.   స్పోర్టివ్ స్పిరిట్ లేకపోవడమంటే మరి ఇదే. అయితే యుద్దంలో గెలుపే ముఖ్యం తప్ప అందుకు ఎంచుకొన్న మార్గాలు ముఖ్యం కాదని అర్ధం అవుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి తమ మెడకు రచ్చబండను గుదిబండగా తగిలిస్తే, దానిని వదిలించుకొని మళ్ళీ జీవితాన్నే మార్చేసే మరో సరి కొత్త ఐడియా కోసం వైకాపా ఆలోచించక తప్పదు. చివరికి ఇద్దరిలో సమైక్య ట్రోఫీ ఎవరికి దక్కుతుందో చూడాలి.

పయ్యావులతో ఎర్రబెల్లి ఢీ

      రాష్ట్ర విభజన విషయంలో ఇతర పార్టీల నుంచి తీవ్రమైన విమర్శల దాడిని ఎదుర్కుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో తలనొప్పి వచ్చి పడింది. పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేయడంతో,తెదేపా ఆంధ్ర, తెలంగాణా నేతల మధ్య విభేదాలకు దారి తీస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియు అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పయ్యూవుల కేశవ్‌ పిల్‌ వేసిన నేపథ్యంలో ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో తలెత్తే సమస్యలు చెప్పుకోవచ్చని, అందుకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే విభజన ఆపాలని కోరడం పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమని, ఇది పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని దయాకర్ రావు అన్నారు. ఈవిషయమై చంద్రబాబుకి పిర్యాదు చేసి పయ్యావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

సమైక్య శంఖారావం వాయిదా?

      రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రేపు హైదరాబాదులో వైకాపా జరుపనున్నసమైక్య శంఖారావం సభ జరుగుతుందా లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. అయితే వానల కారణంగా ప్రజలు, పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో కూడా మడమ తిప్పకపోతే ఎలా? అని పార్టీ నేతలే కాక ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా బాధపడుతున్నారు. సాయంత్రం వరకు వేచి నిర్ణయం తీసుకోవాలా?లేక వెంటనే నిర్ణయం తీసుకోవాలా అన్నదానిపై వైకాపా నేతలు తర్జనభర్జనలు చేస్తున్నారు. సాయంత్రం రైళ్లలో బయల్దేరాక వాయిదా వేయాల్సి వస్తే ఇబ్బంది అవుతుందని భావిస్తన్నారు. బహుశా మధ్యాహ్నం లోగా తుది నిర్ణయం తీసుకోవచ్చు.

జైలుకు మోపిదేవి

      వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో అందరూ జైలు నుంచి బయటకు వస్తుంటే మోపిదేవి వెంకట రమణ మాత్రం మళ్లీ జైలుకు వెళ్లాడు. అందరి కన్నా మొదట జైలు నుంచి బయటకు వచ్చిన మోపిదేవి మళ్లీ జైలు కు వెళ్లాడు. వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి వెంకటరమణారావు గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. వెన్నునొప్పి శస్త్రచికిత్స కోసం కోర్టు మంజూరు చేసిన 45 రోజుల తాత్కాలిక బెయిల్ ఈ నెల 31తో ముగియనుంది. నవంబర్ 1న లొంగిపోవాలని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టులో లొంగిపోయాడు. అయితే వెనువెంటనే మోపిదేవి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడం విశేషం. దీనిపై విచారణను కోర్టు నేటికి వాయిదా వేస్తూ, ఆయనకు 31 వరకు రిమాండ్ విధించింది.

కొత్త సంవత్సరానికి 'తెలంగాణ'

      రాష్ట్ర విభజన విషయంలో ముందుకే వెళ్తాం. నవంబర్ 15 నాటికి ముసాయిదా బిల్లు రెడీ అవుతుంది. కొత్త ఏడాది నాటికి రెండు రాష్ట్రాలు ఏర్పడతాయ'ని తెలంగాణ ప్రాంత మంత్రులు, ముఖ్యనేతలతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. దీనిపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. 'విభజనపై మేం వెనక్కు పోయామని, సందిగ్ధంలో పడ్డామని ఎవరైనా అంటే నమ్మొద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని ప్రజలకు వివరించండి. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని వివరించండి. భారీ స్థాయిలో సమావేశాలు నిర్వహించండి. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజల్లోకి తీసుకువెళ్లండి' అని దిగ్విజయ్ పేర్కొన్నారు.

రచ్చబండ కాడ సమైక్యరాగం ఆలపిద్దుమా

  ఇటీవల ముఖ్యమంత్రి కాస్త మంద్ర స్థాయిలో సమైక్యరాగం ఆలపిస్తుండటంతో ఎవరికీ సరిగ్గా వినిపించడం లేదు. పైలిన్ తుఫాను సభలో కూడా ఆయన చాలా మంద్ర స్థాయిలో సమైక్య రాగం ఆలపించి, ప్రజలను కూడా తనతో కోరస్ పాడమని కోరారు. అయితే, ఆయన స్వరంలో వచ్చిన తేడాను దిగ్విజయ్ సింగ్ కూడా బాగానే పసిగట్టారు. అందుకే ఈసారి ఆయన చిన్నచిర్నవ్వుతో సరిపెట్టేసారు.   కానీ, త్వరలో తెలంగాణా బిల్లో, దాని నకలో మరొకటో శాసనసభకు వచ్చినప్పుడు, సభలో సభ్యులందరి ముందు పూర్తి స్థాయిలో సమైక్య కచేరీ ఈయవలసి ఉంటుంది గనుక, ఇలా క్యాంప్ కార్యాలయంలో ఒంటరిగా కూర్చొని కూని రాగాలు తీయడం కంటే అలా జనాల మధ్యకెళ్ళి రచ్చబండ మీద కూర్చొని జనాలతో కలిసి ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి భావించడంతో రచ్చబండ కచేరీకి ముహూర్తం ఖరారు అయిపోయింది.   వచ్చే నెల 6 నుంచి 24 వరకు, అంటే శాసనసభలో ఫైనల్ కచేరీ మొదలయ్యేవరకు మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. అయితే దీనికి ముఖ్యమంత్రి ఇంకా డేట్స్ ఇవ్వలేదని, త్వరలో తెలియజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సీమాంధ్ర మంత్రుల సమైక్య రాగాలాపన వినడానికి వచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, పెన్షన్లు, వికలాంగులకు పించెన్లు మంజూరు చేస్తామని మంత్రిగారు చెప్పారు.   ఒకవైపు సీమంద్రాలో రచ్చబండ మీద సమైక్యరాగాలాపన జరుగుతుంటే, అదే సమయంలో తెలంగాణా రచ్చబండ మీద తెలంగాణా సాధన గీతం, అదిగో నవలోకం, ఉందిలే మంచి కాలం ముందు ముందునా  వంటి గీతాలను అక్కడి కాంగ్రెస్ మంత్రులు ఆలపించే అవకాశం ఉంది.   కానీ, ఫైనల్ కచేరీలో మాత్రం ఎవరి రాగాలు వారే తీయాలని, ఒకరివి మరొకరు కాపీలు కొట్ట కూడదని, పైరసీకి అసలే తావీయకూదదని అందరూ సమైక్యంగా ముందే డిసైడ్ అయిపోయారు. అందువలన రెండు ప్రాంతాలలో ప్రజలు కాంగ్రెస్ నేతలకి కోరస్ పాడుతారో లేదో ముందే ఆలోచించుకొంటె మళ్ళీ అందరి తాళం తప్పకుండా పాట చక్కగా సాగుతుంది.

తుఫాను వచ్చినా మడమ తిప్పేది లేదుట

  రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఈనెల 26న హైదరాబాదులో వైకాపా జరుపనున్నసమైక్య శంఖారావం సభ జరుగుతుందా లేదా? అనే అనుమానాలను నివృత్తి చేస్తూ సభ తేదీలో మళ్ళీ ఎటువంటి మార్పు ఉండబోదని, 26న యధావిధిగా జరుగుతుందని పార్టీ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేసారు.   అయితే వానల కారణంగా ప్రజలు, పంటలు నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే ఈ సమయంలో కూడా మడమ తిప్పకపోతే ఎలా? అని పార్టీ నేతలే కాక ప్రత్యర్ధి పార్టీ నేతలు కూడా బాధపడుతున్నారు. అయితే ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన సభ మళ్ళీ మరో మారు వాయిదా వేసుకొంటే, ఏదో ఒక సాకు చూపి మడమ తిప్పేశారని మళ్ళీ వాళ్ళే విమర్శలు చేస్తారు గనుక ఇక ప్రళయమే వచ్చినా కూడా సభ విషయంలో మడమ తిప్పే ప్రసక్తే లేదని వైకాపా డిసైడ్ అయిపోయింది.   అయితే సభ మొదలయ్యే నాటికి వానలు తగ్గిపోవచ్చునని వారు అంచనా వేస్తున్నారు. తగ్గినా తగ్గకపోయినా ఇక మడమ తిప్పే ప్రసక్తి లేదు గనుక సభకి సరిపోయే జనాలను పోగేయక తప్పదు. ఇజ్జత్ కి సవాలాయే!ఇక కోర్టు వారు అనుమతిస్తే వర్షం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలను ఈ నెల 27, 28 తేదీల్లో ఓసారి పరామర్శించి రావాలని జగన్ కోరిక. అనుమతి రాకపోతే విజయమ్మ బయలుదేరవచ్చును.

రెచ్చగొట్టేందుకే జగన్ సభ

      తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకే హైదరాబాద్ లో సమైక్య శంఖారావం సభ పెడుతున్నాడని కొండా సురేఖ దంపతులు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య సభ పేరుతో రెచ్చగొడితే రెచ్చిపోమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తుండగా హైదరాబాదులో సమైక్య సభ పెట్టడమేమిటని ఆమె ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ వస్తుందన్న నమ్మకం తమకు ఉందని సురేఖ దంపతులు విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ తెలంగాణపై యూ టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఆగ్రహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిన కొండా సురేఖ దంపతులు ముఖ్యమంత్రి కిరణ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పయ్యావుల కేసుతో తెదేపాలో రచ్చ

  తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన అంశంలో ఎంతో లౌక్యంగా రోజులు నెట్టుకొస్తుంటే ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేయడంతో,తెదేపా ఆంధ్ర, తెలంగాణా నేతల మధ్య విభేదాలకు దారి తీస్తోంది. ఈ పిటిషనుతో పార్టీకి ఎటువంటి సంబందమూ లేదని, ఇది వ్యక్తిగతంగా వేస్తున్న పిటిషను అని ఆయన చెప్పినప్పటికీ, అది పార్టీలో కలకలం రేపింది.   తామంతా రెండు ప్రాంతాలలో పార్టీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణా ఉద్యమాలు తీవ్రంగా సాగుతున్నతరుణంలో కూడా వెనక్కి తగ్గిన సంగతిని గుర్తు చేస్తూ, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖ కూడా ఇచ్చి సమన్యాయం కోసం అధ్యక్షుడే పోరాడుతున్నవేళ, పయ్యావుల కేశవ్ ఈవిధంగా సుప్రీం కోర్టులో కేసు వేయడాన్ని పార్టీలో తెలంగాణా నేతలు తప్పుపడుతున్నారు. తెదేపా తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఈవిషయమై చంద్రబాబుకి పిర్యాదు చేసి పయ్యావులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.   రాష్ట్ర విభజనపై స్పష్టమయిన వైఖరి తెలియజేయని కారణంగా రెండు ప్రాంతాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెదేపా,ఇప్పుడు నేతల మధ్య మొదలయిన ఈ అంతర్యుద్దంతో ప్రత్యర్ది పార్టీలకి మరో అస్త్రం అందించినట్లవుతుంది. రేపు తెలంగాణా నోట్ శాసనసభకు వచ్చినప్పుడు కూడా తెదేపా ఇదే విధంగా ద్వంద వైఖరి అవలంభిస్తే పార్టీకి తీరని నష్టం జరగడం ఖాయం.

కాంగ్రెస్ గూటికి కేకే..?

      కాంగ్రెస్ పార్టీలో బోలెడంత సీనియారిటీ వుండి, ఎన్నో పదవులు అనుభవించి ఈమధ్యే టీఆర్ఎస్‌లోకి జంప్‌జిలానీ అయిన కె.కేశవరావు మళ్ళీ కాంగ్రెస్‌ గూట్లోకి తిరిగొచ్చే అవకాశాలున్నాయా? ఈమధ్యకాలంలో జరిగిన పరిణామాలు, తాజాగా కేకే వ్యవహారశైలి ఇలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనకి మరోసారి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వకపోవడంతో అలిగిన కేకే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి టీఆర్ఎస్‌లో చేరాడు. తాను టీఆర్ఎస్‌లోకి వెళ్ళగానే ఎక్కడికో వెళ్ళపోతానని కలలుగన్న కేకే అక్కడ ఏదో నామ్ కే వాస్తే పదవి దక్కడంతో నిరాశకు గురయ్యాడు.   టీఆర్‌ఎస్ పార్టీ మీటింగులలో సింహాసనం లాంటి కుర్చీలో కేసీఆర్ కూర్చుని ఉంటే, ఆ పక్కనే కాస్తంత దూరంగా విదూషకుడికి వేసేంత కుర్చీలో కూర్చుని సీరియస్ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం మినహా టీఆర్‌ఎస్‌లో కేకే సాధించిందేమీ లేదు. ఒకప్పుడు కేకే కూర్చున్నట్టు కేసీఆర్ పక్కనే కుర్చీలో కూర్చుని వుండే రాములమ్మ కూడా కాంగ్రెస్‌కి జై కొట్టేసింది. టీఆర్ఎస్‌లో కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆర్, ఆయన కుటుంబమే తప్ప బయట నుంచి వచ్చినవాళ్ళు బయటకే వెళ్తారన్న విషయం కేకేకి ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్ట్టుంది. నరేంద్ర, విజయశాంతి, రఘునందన్.. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూళ్ళేదనీ...! భవిష్యత్తులో టీఆర్ఎస్ తనకు ఎంపీ టిక్కెట్టో, ఎమ్మెల్యే టిక్కెట్టో ఇస్తుందనో, రాజ్యసభకో, మరో సభకో పంపుతుందనో ఆశించినా లాభం ఉండదన్న చేదు వాస్తవం కేకేకి ఇప్పుడిప్పుడే పూర్తిగా అర్థమవుతునట్టుంది. టీఆర్ఎస్ లాంటి నియంతల పార్టీలో ఉండటం కంటే కాంగ్రెస్ లాంటి ఏం మాట్లాడినా, ఎన్ని డ్రామాలాడినా చెల్లుబాటయ్యే, బోలెడన్ని పదవులు వచ్చే అవకాశం వున్న కాంగ్రెస్‌కే వెళ్తే బెటరనిపిస్తున్నట్టుంది. అందుకే కేకే దగ్గర మాతృసంస్థకి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. మొన్నామధ్య సీమాంధ్రలో ఎవరో సోనియాగాంధీ దిష్టిబొమ్మకి సమాధి కట్టారట. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే, ఏదో అమ్మగారి అనుగ్రహం కోసం అలా చేశారని సరిపెట్టుకోవచ్చు. కానీ టీఆర్‌ఎస్‌లో వున్న కేకే  ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాధని వ్యక్తం చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకెలా అర్థం చేసుకోవాలి.. కేకే మళ్ళీ కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నారనే అర్థం చేసుకోవాలి.

ఏం కొంప ముంచుతారో?!

      సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు గురువారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మూకుమ్మడిగా కలవబోతున్నారట. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయబోతున్నారట. ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి సీమాంధ్రులలో గుండె దడ మొదలైంది. రాష్ట్ర విభజన చేయొద్దని కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతిని అడగటానికి వెళ్తుంటే సీమాంధ్రులు భయపడటమెందుకు? అక్కడే వుంది అసలు తిరకాసు.   ఇప్పుడు రాష్ట్రం విభజన సమస్య ఎదుర్కోవడానికి ప్రధాన కారణం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలేనన్న వాస్తవం సీమాంధ్రులు అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం దగ్గర అతి వినయం ప్రదర్శించడం, సమైక్య వాదనను సమర్థంగా వినిపించకపోవడం, అధిష్టానం అభిప్రాయం అడిగినప్పుడల్లా, ‘‘కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం’’ అని చెప్పడం, రాష్ట్రాన్ని విభజించినా సీమాంధ్రులు పెద్దగా ఫీలవరని కేంద్రానికి నివేదికలు ఇవ్వడం.. ఇవన్నీ రాష్ట్ర విభజనకు ఆజ్యం పోశాయి. కేంద్రం విభజన నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయి. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉవ్వెత్తున జరుగుతున్న ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రపతి దగ్గరకి వెళ్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు అక్కడ ఏం మాట్లాడబోతున్నారో, ఏం కొంప ముంచబోతున్నారోన్న భయం సీమాంధ్రులలో వుంది. పైకి మాత్రం సమైక్య రాష్ట్రం కోసమే రాష్ట్రపతి దగ్గరకి వెళ్తున్నామని చెప్తున్నా, లోపల రహస్య ఎజండా ఏమైనా ఉందేమోనన్న అనుమానాలు సీమాంధ్రులలో కలుగుతున్నాయి. కలగవా మరి?

ప్రజల ప్రాణాలకు విలువలేదా రాహుల్ జీ?

  రాజస్తాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తన నాయనమ్మ, తండ్రి ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయినట్లే ఏదో ఒకరోజు తను కూడా చనిపోవచ్చునని, అయినప్పటికీ తను చావుకి భయపడనని జనాన్నిసెంటిమెంటుతో పడేయాలని చూసారు. అందుకే తను మతతత్వ పార్టీలను తీవ్రంగా వ్యతిరేఖిస్తానని ఆయన చెప్పారు.   నిజమే! ఉగ్రవాదాన్ని,మతత్వత్వాన్ని అందరూ ఖండించాల్సిందే. అందుకు కేవలం ఆయన కుటుంబ సభ్యులే కాక సాధారణ ప్రజలు కూడా వందలమంది ప్రతీ ఏటా బలయిపోతూనే ఉన్నారు. ఏనుగుకయినా చీమకయినా కాలు విరిగితే నొప్పి ఒకటే! ఏనుగు పెద్ద జంతువు గాబట్టి దానికి ఎక్కువ నొప్పి, చీమ చిన్నది గాబట్టి దానికి కొంచెం తక్కువ నొప్పి ఉండవని ఆయన గ్రహించాలి.   దాదాపు పదేళ్లుగా అధికారంలో ఉన్నతన పార్టీ నేటికీ దేశంలో ఉగ్రవాదుల దాడులను, మత ఘర్షణలను ఎందుకు సమర్ధంగా అరికట్టలేకపోతోంది? పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ లోకి చొరబడి పట్టపగలే ప్రజల మీద, సైనికుల మీద, పోలీసుల మీద దాడులు చేసి నిత్యం అనేకమందిని పొట్టన పెట్టుకొంటుంటే చనిపోయినవారిని లెక్కబెట్టడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది?   చివరికి నిన్న హోం మంత్రి షిండే జమ్ములో పర్యటిస్తున్న సమయంలో కూడా పాక్ ఉగ్రవాదులు భారత సరిహద్దు దళాలపై కాల్పులు జరిపి ఒక భారత సైనికుడిని పొట్టన పెట్టుకొన్నాయి. మరి దేశంకోసం పోరాడిన ఆ వీర జవాను ప్రాణానికి విలువ లేదా?   తమ ప్రభుత్వం తప్పులని, అసమర్ధతను కప్పిపుచ్చుకొని, ఇంతవరకు ఎటువంటి మత ఘర్షణలు జరుగని రాజస్థాన్ రాష్ట్రంలో మత ఘర్షణల ప్రస్తావన తేవడం దేనికి? అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించడం దేనికి?   గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషి కారణంగానే ఆయనకు ప్రజలలో ఆదరణ పెరిగిన సంగతి కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరు గుర్తుపెట్టుకొంటే తాము ఏమి చేయాలో తెలిసివస్తుంది.   మాటలకి చేతలకి లంకె లేనప్పుడు అవి కేవలం ఉత్తర కుమార ప్రగల్భాలే అవుతాయి అని ఆయన గ్రహిస్తే మంచిది.

రాహుల్ తీరుతో బీజేపీ హ్యాపీ

      తన తీరుతో, మాట తీరుతో రోజు రోజుకూ దేశ ప్రజల్లో గౌరవం పోగొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని చూసి బీజేపీ వర్గాలు లోపల లోపల హ్యాపీగా ఫీలవుతున్నాయి. రాబోయే ఎన్నికలలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీకి పోటీదారుడు అవుతాడని భావిస్తున్న రాహుల్‌గాంధీ క్రమక్రమంగా తన ఇమేజ్‌ని తానే డ్యామేజ్ చేసుకుంటూ, మరోవైపు తన పార్టీ ఇమేజ్‌ని కూడా డ్యామేజ్ చేస్తున్నాడు. ఇది నరేంద్రమోడీకి, భారతీయ జనతాపార్టీకి ఎంతో లాభించే అశం. కాగలకార్యం గంధర్వులే తీర్చుతారన్నట్టు రాహుల్‌గాంధీ తన కంట్లో తానే వేలు పెట్టి పొడుచుకుంటూ ఉండటం పరిస్థితులను బీజేపీకి అనుకూలంగా మార్చుతున్నాయి. రాహుల్‌గాంధీ ప్రధాని అభ్యర్థిత్వమే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఓడించే బ్రహ్మాస్త్రమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే జనాల్లో నరేంద్రమోడీ ఎక్కడ, రాహుల్ గాంధీ ఎక్కడ అనే కంపారిజన్ మొదలైంది. రాహుల్‌గాంధీ ప్రస్తుత వ్యవహార శైలి, ధోరణి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారాన్ని నరేంద్రమోడీకి, బీజేపీకి బంగారు పళ్ళెంలో పెట్టి అప్పగించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ పైపైకి రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నప్పటికీ, అబ్బాయిగారి వ్యవహార శైలి ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటోంది.

సమైక్యశంఖారావంపై అనుమానాలు

      రాష్ట్రంలో వరదపరిస్థితుల దృష్ట్యా సమైక్యశంఖారావం సభ నిర్వాహణపై అనుమానాలు వస్తున్నాయి. రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తుండటంతో జన సమీకరణకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు కలవరపడుతున్నారు. మరోవైపు 48 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఎల్బీ స్టేడియంలో సభా వేదిక ఏర్పాట్లు ఎలా జరపాలనే విషయమై పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఈ వర్షాల నేపథ్యంలో సీమాంధ్ర జనం హైదరాబాద్ కు రాగలరా అన్న సందేహంతో రంగారెడ్డి, హైదరాబాద్ లలో ఉన్న సీమాంధ్ర ప్రజల మీద ఎక్కువగా ఆధారపడాలని నిర్ణయించారు. ఇక సమైక్య శంఖారావం కోసం భారీ బందోబస్తు చేయనున్నారు.

టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్

      సచివాలయం ముందు సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. నష్టపోయిన రైతాంగాన్ని నష్టపరిహారం ఇచ్చి, వసతి సౌకర్యం, భోజనం అందించాలని డిమాండ్ చేశారు. అధికారులను నివేదికలు తయారు చేసే పనిలో కాకుండా వరదప్రాంతాల్లో వినియోగించాలని ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను సీఎం కిరణ్ చర్చలకు ఆహ్వానించినప్పటికీ తమ వద్దకే వచ్చి చర్చలు జరపాలంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తమను సీఎం చర్చలకు పిలవకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

రాహుల్ పిల్లచేష్టలు

      పిల్లచేష్టలు వదలిపోని నలభయ్యేళ్ళ రాహుల్‌గాంధీని వాళ్ళమ్మ సోనియమ్మ ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయడానికి నానా తంటాలు పడుతూ, అడ్డగోలు విభజనకు కూడా పూనుకుంది. అమ్మ మనసుని అర్థం చేసుకుని హుందాగా వ్యవహరించాల్సిన రాహుల్‌గాంధీ మాత్రం వీలైనప్పుడల్లా తన పిల్లచేష్టల్ని ప్రదర్శిస్తున్నాడు. ఆమధ్య కేంద్రప్రభుత్వ నేరచరితుల ఆర్డినెన్స్ విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడి నాలుక్కరుచుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా గొప్ప విషయంలా ఒప్పుకున్న నిర్ణయాన్ని ఒక్కమాటలో తిప్పికొట్టి కాంగ్రెస్ పార్టీ పరువుని నడిరోడ్డు మీదకి ఈడ్చాడు. తలలు పండిన కాంగ్రెస్ నాయకులు కూడా తనముందు దిగదుడుపేనని తేల్చేశాడు.     రాహుల్‌గాంధీ పిల్లచేష్టల ధాటికి కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు లోలోపల కుమిలిపోతున్నా, ఎందుకొచ్చిన గొడవ అని ఎవరూ కిక్కురుమనడం లేదు. తాజాగా రాహుల్‌గాంధీ రాజస్థాన్ ఎలక్షన్ మీటింగ్‌లో తన ప్రాణాలకు తీవ్రవాదుల నుంచి ముప్పు వుందని ప్రకటించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం, లేనిపోని ఇష్యూ క్రియేట్ చేయడం రాహుల్ పిల్లచేష్టలకు పరాకాష్ట అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓటర్లని ఆకర్షించడానికి ఎలాంటి మాటలు మాట్లాడొచ్చు, ఎలాంటి మాటలు మాట్లాడకూడదన్న కనీస జ్ఞానం కూడా రాహుల్‌గాంధీకి లేకపోవడం సహజమేనంటున్నారు. రాహుల్‌గాంధీ చేసిన కామెంట్లు రాజస్థాన్‌లో ఓట్లు రాల్చే విషయం అటుంచి, జనాలకి రాహుల్ అంటే చిరాకుపుట్టి కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. రాహుల్‌గాంధీ ఇప్పటికైనా పిల్లచేష్టలు మానుకుంటే మంచిదని అనుకుంటున్నారు.