లగడపాటిని బహిష్కరించాలి

      విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై రాష్ట్ర మంత్రి కొండ్రు మురళీమోహన్ మండిపడ్డారు. లగడపాటి మీడియాలో కనబడేందుకు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయింది అవాస్తమని తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న లగడపాటిని ముందు పార్టీ నుండి బహిష్కరించండి. ఇదే విషయం కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కోరుతున్నా అని అన్నారు.   చంద్రబాబు నాయుడు , వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖలు ఇచ్చారు. మరి జగన్ మాత్రం ఆ విషయం ఎవరితోనూ చెప్పడం లేదు. రాహుల్ గాంధీని ప్రదానిని చేయాలన్నది జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి కోరిక అని జగన్ కు తెలియదా ? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా సమైక్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం లేదని తాను భావిస్తున్నానని మురళీమోహన్ అన్నారు.

జగన్ తో కేంద్రం కుమ్మక్కు

      కేంద్రంతో జగన్ కుమ్మక్కయ్యారని, అధిష్ఠానం ఆయన్ని దత్తపుత్రుడిగా భావిస్తోందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. ఇక వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీ పడ్డాయన్న విషయాన్ని జగన్ సభను చూసిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని అన్నారు. సమైక్య సభ బలపడాలని జగన్ ప్రయత్నించారని, అయితే ఆయన పార్టీ బలపడటం లేదని అధిష్ఠానానికి ఆలస్యంగా అర్థమైందన్నారు. రాష్ట్రం జగన్ గుప్పిట్లో ఉందన్న భ్రమతో కాంగ్రెస్ అధిష్ఠానం విభజన ప్రకియను వేగవంతం చేస్తోందన్నారు.   సమైక్యవాదంతో ముందుకెళ్తున్న ఏపీఎన్జీవో సభకు అడ్డంకులు సృష్టించిన టీఆర్ఎస్.. జగన్‌తో కుమ్మక్కయినందునే ఆయన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. జగన్, కేసీఆర్ తోడు దొంగల్లా కూడబలుక్కుని హైదరాబాద్‌లో శంఖారావం సభను నిర్వహించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లు వచ్చినా, తీర్మానం వచ్చినా ఓడిస్తామని, ఆ తర్వాత రాజీనామా చేయడానికి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి, ప్రజల గుండెల్లోని భావనను తెలియజేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ప్రజల భావోద్వేగాలను తేలిగ్గా తీసుకోవద్దని అధిష్ఠానానికి చెప్పామన్నారు.

తమలపాకుతో నువొకటంటే తలుపు చెక్కతో నేను రెండంటిస్తా..

  తమలపాకుతో నువొకటంటే తలుపు చెక్కతో నేను రెండంటిస్తా.. అందిట వెనకటికికో గడుసు ఇల్లాలు. జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర సెంటిమెంటు పట్టుకొని సీమాంధ్రలో దూసుకుపోదామని ప్రయత్నిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు చూసినా ఆయన కంటే రెండడుగులు ముందే ఉంటున్నారు.   జగన్ సమైక్య శంఖారావం పూరించడానికి సిద్దం కాగానే కిరణ్ రచ్చబండ ముచ్చట్లకి సిద్దం అయ్యారు. కోట్లు ఖర్చుపెట్టి జగన్ శంఖారావం చేస్తే, కిరణ్ తన ఏసీ ఆఫీసు గదిలో కూర్చొని, పైసా ఖర్చు, ప్రయాస లేకుండా ప్రధానికి, రాష్ట్రపతికి రెండు చిన్న లేఖలు వ్రాసి పడేసి, జగన్ సభకి దక్కవలసిన మీడియా ఫోకస్ అంతా తన వైపు తిప్పుకొని చిద్విలాసంగా చిర్నవ్వులు చిందిస్తున్నారు.   జగన్ అంత చెమటోడ్చినా దక్కని ఫలం, కిరణ్ సందించిన లేఖాస్త్రాలు బాంబులవలె పేలుతూ అటు సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణాలో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. ఆయన వ్రాసిన లేఖను రాష్ట్రపతి హోంశాఖకు పంపి సంజాయిషీ కోరడమే అందుకు కారణం. రాష్ట్రవిభజన కీలకదశకి చేరుకొన్న ఈ తరుణంలో కిరణ్ ఈవిధంగా లేఖలు వ్రాసి తెలంగాణాకి అడ్డుపడుతున్నాడని తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతలు ఆయన మీద చాలా ఫైర్ అయిపోతున్నారు. తెరాస మరియు టీ-కాంగ్రెస్ నేతలు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణాకి అడ్డుపడుతున్నావని ఎంతగా దూషిస్తే, అవతల సీమాంధ్రలో ఆయన రేటింగ్స్ అంతగా పెరిగిపోతున్నాయి.   పైగా ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారారని, ఆయన ఆ కుర్చీలో కూర్చోనంత కాలం రాష్ట్రవిభజన అసాధ్యమని తెలిసినప్పటికీ అధిష్టానం అయనను ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని, మీడియాలో వస్తున్నవార్తలు, రాజకీయ విశ్లేషణలు ఆయన రేటింగ్స్ కి మరిన్ని స్టార్స్ జోడిస్తున్నాయి.   అందువల్ల ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ మరో కొత్త ఉపాయం ఆలోచించవలసి ఉంటుంది. అయితే రాష్ట్రవిభజన అనివార్యమని అందరికీ తెలిసినప్పటికీ వీరిద్దరిలో ఎవరు సమైక్య ఛాంపియన్ షిప్ ట్రోఫీ గెలుస్తారా అని ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

బీహారీలను ఆకట్టుకొన్ననరేంద్రమోడీ ప్రసంగం

  ఈరోజు (ఆదివారం) పాట్నాలో మోడీ సభ మొదలయ్యే రెండు గంటల ముందు ఏడు వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి.అందులో ఐదుగురు మరణించగా దాదాపు డబ్బై మంది ప్రజలు గాయపడ్డారు. అయినప్పటికీ నరేంద్ర మోడీ సభకు భారిగా జనాలు తరలివచ్చారు.   మోడీ స్థానిక భోజ్ పురీ బాషలో కొంత సేపు ప్రసంగించి బీహారీలను బాగా ఆకట్టుకొన్నారు. ఎటువంటి సభలో ఏ అంశాలు ప్రస్తావించాలో, ఏవిధంగా మాట్లాడాలో బహుశః మోడీకి తెలిసినంత బాగా నేటి రాజకీయ నాయకులలో చాలామందికి తెలియదని చెప్పవచ్చును. డిల్లీ వంటి నగర ప్రజలని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కొంచెం క్లిష్టమయిన అంశాలను, సాంకేతికమయిన పదాలను ప్రయోగించే మోడీ ఇక్కడ మాత్రం స్థానిక ప్రజలకు సులువుగా అర్ధం అయ్యే అంశాలను తనదయిన శైలిలో ప్రసంగించి వారిని ఆకట్టుకోవడమే ఆయన పరిణతికి ఒక మంచి నిదర్శనం.   పౌరాణిక యుగంలో సీతాదేవి పుట్టిన పుణ్యభూమి బీహార్ అని మొదలుపెట్టడంతోనే 'ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్' అన్నట్లు ఆ తరువాత ప్రజలచేత జేజేద్వానాలు పలికించుకొంటూ అలవోకగా ఆయన ముందుకు సాగిపోయారు. బీహార్ గత వైభవం గురించి వారి కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ బుద్ధుడు, అశోకుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు, మౌర్యులు వంటి మహామహులు బీహార్ గడ్డ మీదనే జన్మించారని, నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు యావత్ ప్రపంచంలో మేటి విద్యాలయాలుగా పేరు తెచ్చుకొన్నాయని చెప్పడంతో ప్రజలు హర్షద్వానాలు మిన్నంటాయి.   అదేవిధంగా స్వాతంత్రోద్యమంలో గాంధీ మహాత్ముడు చంపారణ్ లో చేసిన ఉద్యమం గురించి చెప్పి, బీహార్ రాష్ట్రం దేశానికి ఎప్పుడు అవసరమయిన జయప్రకాశ్ నారయణ్ వంటి గొప్ప నేతలను అందిస్తూనే ఉందని, అటువంటి మహానీయుడితో కలిసి పనిచేసే భాగ్యం తనకి దక్కనప్పటికీ, ఇప్పుడు బీహార్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు తను చాల సంతోషిస్తున్నాని అన్నారు.   బీహార్ లో అత్యధికంగా ఉన్నయాదవ కులస్తులను ఆయన మెప్పించిన తీరు అసమాన్యం. వారు ఆరాధించే శ్రీకృష్ణుడు గుజరాత్ లో ఉన్న ద్వారకలో నివసించాడని, అందువల్ల యాదవులతో తనకున్న అనుబంధం ప్రత్యేకమయిందని, అందుకే వారికోసం ద్వారక నుండి ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీసులు తీసుకువచ్చానని ఆయన అన్నపుడు ప్రజల స్పందన ఏవిధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.   అయితే వారి కులానికే చెందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పశువుల దాణా కేసులో ఐదేళ్ళు జైలు శిక్షపడినప్పటికీ ఆయన పేరు పలికి వారి మనసులు నొప్పించకుండా ఆయన జాగ్రత్త పడుతూనే, లాలూ హయంలో సాగిన ఆటవిక రాజ్యం నుండి వారికి విముక్తి కలిగించదానికే బీజేపీ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి చెందిన జేడీ(యు)కి మద్దతు ఇచ్చిందని, గానీ ఆయన అధికారంలో స్థిరపడిన తరువాత బీజేపీని కాదని కాంగ్రెస్ హస్తం అందుకొని మిత్రద్రోహం చేసాడని విమర్శించారు.   నితీష్ కుమార్ కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు రాష్ట్రం కోసం రూ.50వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీగా కోరారని, అయితే బీహార్ ప్రజలు ఇక కాంగ్రెస్ ముందు ఎంత మాత్రం చేతులు జాపవలసిన అవసరం లేదని, తనను ఇంతగా ఆదరిస్తున్న బీహార్ ప్రజలకు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, రూ.50వేల కోట్లని వడ్డీతో సహా చెల్లించి ప్రజల ఋణం తీర్చుకొంటానని చెప్పి ప్రజల జేజే ద్వానాలు అందుకొన్నారు.   జాతులు, మతాలు, ప్రాంతాల పేరిట విభజించి పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆరు దశబ్దాల పాలనలో చేసిందేమీ లేదని, కనీసం నేటికీ కోట్లాది పేద ప్రజలు రెండు రొట్టెలు తినడానికి కూడా నోచుకోలేదని, అందువల్ల తమ ఈ పరిస్థితుల్లోమార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాక తప్పదని ఆయన చెప్పారు. నిరుపేద హిందూ, ముస్లిం ప్రజలు ఒకరితో ఒకరు పోరాడుకోకుండా, తమ పేదరికంపైనే పోరాటం చేయాలని, హిందు, ముస్లిం ప్రజలు సంఘటితంగా కలిసిపనిచేసినప్పుడే ఒక ధృడమయిన భారతదేశాన్ని నిర్మించగలమని మోడీ సందేశం ఇచ్చారు. ఆయన తన ప్రసంగంతో బీహారీలను చాలా బాగా అక్కట్టుకోగాలిగారు. అందువల్ల మోడీ సభ ఊహించిన దానికంటే చాలా దిగ్విజయంగా ముగిసింది.

మోడీ సభకి బాంబులతో స్వాగతం

  అవేమి మోడీకి స్వాగతం పలకడానికి పేల్చిన దీపావళి టపాసులు కావు, ఉగ్రవాదులో మరెవరో పేల్చిన నిజమయిన బాంబులు. ఒకటి తరువాత మరొకటి చొప్పున మొత్తం ఏడూ బాంబులు పాట్నా నగరంలో ప్రేలాయి. అందులో ఐదుగురు మరణించగా డబ్బై మంది గాయపడ్డారు. సభ మొదలవడానికి కేవలం రెండు గంటల ముందు ఈ ప్రేలుళ్ళు జరగడం చాలా విచిత్రం. ఎందుకంటే ప్రధాని అభ్యర్ధిగా పోటీలో ఉన్న మోడీ సభకి చాలా ముందు నుంచే భద్రతాపరమయిన ఏర్పాట్లు అన్నీ జరిగి ఉంటాయి. అయినప్పటికీ వరుస ప్రేలుళ్ళు జరిగాయి. అయినప్పటికీ వేలాది మంది జనాలు మోడీ సభకి తరలివచ్చారు. అటువంటి సంఘటన తరువాత కూడా అన్నివేలమంది (అదే మన రాష్ట్రంలో అన్ని లక్షల మంది అని చెప్పుకొంటాము) సభకు హాజరవడం విశేషమే. బహుశః దీనినే మోడీయిజం అనాలేమో.   అటువంటి సంఘటన తరువాత కూడా అంతమంది నిర్భయంగా తనకు సభకు హాజరవడం చూసి మోడీ కూడా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెల్పుకొన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీతో సహా అతిరధ మహారధులందరూ మోడీని భూతంగా, బీజేపీని మతతత్వపార్టీగా చూపిస్తూ ప్రజలని ఎంతగా భయపెట్టాలని ప్రయత్నిస్తున్నపటికీ జనాలు మాత్రం మోడీ సభకి తరలివస్తుండటం కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం ముందుందని సూచిస్తోంది.   పైగా కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధిగా భావింపబడుతున్న రాహుల్ గాంధీ, పార్టీ ప్రచారనికని బయలు దేరి, తన ప్రసంగాలతో పార్టీకి మేలు చేయకపోగా తన ప్రసంగాలతో తనకి, తన పార్టీకి కూడా తలనొప్పులు తెచ్చిపెట్టడం నరేంద్ర మోడీకి కలిసివస్తోంది. మొట్ట మొదటి సారిగా ఇద్దరూ ప్రధాని అభ్యర్దులు జనాల ముందుకి ఒకేసారి రావడంతో ప్రజలు వారి రాజకీయ పరిణతి, నిజాయితీ మరనేక అంశాలను స్వయంగా బేరీజు వేసుకోగలుగుతున్నారు.   నవంబర్, డిశంబర్ నెలలో ఐదు రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం మరియు డిల్లీ) జరుగబోయే శాసనసభ ఎన్నికలు వారిరువురికీ సెమీ ఫైనల్స్ అంటివే గనుక దానిని బట్టి వారిరువురిలో ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలుసుకోవచ్చును.   ఇంతవరకు ఈ ప్రేలుళ్ళకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది.

చ్చాల బాధ కలుగుతోంది....

  ప్రజలు అడుగుతున్నారు...ఎప్పుడూ ఎవరినో ఒకరిని అనుకరిస్తూనే ఉంటావెందుకని? ప్రజలు అడుగుతున్నారు. సమైక్యాంధ్ర సభ అని చెప్పి ముప్పై పార్లమెంటు సీట్లు సంపాదించి డిల్లీని శాసిద్దామని ఓట్లు, సీట్లు గురించి ఎందుకు మాట్లాడుతున్నావని ప్రజలు అడుగుతున్నారు? వచ్చేఎన్నికల తరువాత తల్లీ, చెల్లీ, అన్న ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తామని చెపుతూ కూడా మళ్ళీ సోనియమ్మను ఆడిపోసుకోవడమెందుకని...ప్రజలు అడుగుతున్నారు. రాష్ట్ర విభజన చేయిస్తున్నకేసీఆర్ ఊసెత్తకుండా సమైక్యవాదం వినిపిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డినే ఎందుకు ద్వేషిస్తున్నావని ప్రజలు అడుగుతున్నారు.   జనగణమణ గీతం కూడా సరిగ్గా పాడలేననందుకు ప్రజలు చ్చాల బాధ పడుతున్నారు. ప్రజలకి బాధ కలుగుతోంది..జనగణమణ గీతం కూడా సరిగ్గా పాడలేని వారు వందేమాతరం గేయం పాడుతామని చెపుతుంటే...బాధ కలుగుతోంది...చ్చాలా బాధ కలుగుతోంది సమైక్యాంధ్ర సభ అని చెప్పి ఓట్లు సీట్లు గురించి మాట్లాడుతున్నపుడు.   చ్చాల బాధ కలుగుతోంది....రాహుల్ గాంధీని సోనియమ్మ ప్రధానిని చేస్తుంటే...ఇది అన్యాయం కాదా? అని నువ్వడుగుతున్నపుడు బాధ కలుగుతోంది. ప్రజలు అడుగుతున్నారు...ప్రజలు అడుగుతున్నారు మరి సోనియమ్మ చేయాలనుకొంటున్న తప్పునే విజయమ్మకూడా ఎందుకు చేస్తోందని? విజయమ్మ కలలు సోనియమ్మా కలలకి తేడా ఏమిటని ప్రజలు అడుగుతున్నారు.   రాజకీయాలలో విలువలు లేకుండా పోయినందుకు చ్చాల... బాధ.. కలుగుతోంది...చ్చాల బాధ కలుగుతోంది దేశంలో, రాష్ట్రంలో మరే పార్టీకి కూడా వైకాపా అంత నీతి నిజాయితీ లేకుండా పోయినందుకు చ్చాల.. బ్భాద కలుగుతోంది. ప్రజలు అడుగుతున్నారు...అయినా అటువంటి నీతినిజాయితీ లేని పార్టీలకే ఎందుకు మద్దతు ఇస్తావని?   సమైక్య సభపెట్టి డిల్లీలో చక్రం తిప్పుదామంటున్నావేమిటని ప్రజలు అడుగుతున్నారు...చ్చాల బాధ పడుతున్నారు....సమైక్యాంధ్ర సెంటిమెంటుని ఇలా క్యాష్ చేసుకోవాలని చూస్తునందుకు... ...నిజంగా చాలా బాధ పడుతున్నారు...

రేణుకని సాధిస్తున్నారు!

  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సాధించడానికి రేణుకా చౌదరి అప్పనంగా దొరికినట్టుంది. ఆమెని ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. రేణుకా చౌదరికి వున్న నాయకత్వ లక్షణాలు, ఎవరినీ లెక్కచేయనితనం, తాను చెప్పాలనుకున్నది నిర్భయంగా చెప్పే లక్షణమే ఆమెను తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు శత్రువుగా మార్చాయి. తె.కాం. నాయకులలోని పురుషాధిపత్య ధోరణి కూడా ఆమెకు శత్రువుల్ని పెంచుతోంది.   మహిళా కాంగ్రెస్ నాయకురాలంటే తాము చెప్పిన వాటికి తలూపడం తప్ప ఎదురు మాట్లాకూడదు. ఒకవేళ ఎదురు తిరిగి మాట్లాడితే.. ఇదిగో.. ఇలా రేణుకాచౌదరిని వెంటాడినట్టే వెంటాడి వేధిస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను రేణుకా చౌదరి మొదటి నుంచీ వ్యతిరేకిస్తూనే వున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే తెలంగాణని అభివృద్ధి చేయడమే ముఖ్యమని ఆమె చెప్పేవారు. అది మనసులో పెట్టుకుని ఆమె మీద తెలంగాణ ద్రోహి ముద్ర వేశారు.   ఆమధ్య తెలంగాణ కాంగ్రెస్ సమావేశానికి రేణుకా చౌదరి వెళ్తే పొన్నం లాంటి నాయకులు ఆమెని ఆ సమావేశంలోంచి బయటకి పంపేయాలని నానా యాగీ చేశారు. ఆ తర్వాత తెలంగాణ మంత్రి ఒకరు రేణుకా చౌదరి ఖమ్మం జిల్లా ఆడపడుచే కాని రేణుకని ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొనసాగించకూడదని ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా వున్న రేణుక వచ్చే ఎన్నికలలో ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.   అయితే కొంతమంది తె.కాం. నాయకులు ఈసారి రేణుకకు ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ ఇవ్వాలంటే ఆమె ఖమ్మం జిల్లాలో పుట్టినట్టు బర్త్ సర్టిఫికెట్ చూపించాలని డిమాండ్ చేశారు. ఈసారి రేణుకకు ఖమ్మం టిక్కెట్ రాకుండా చేయాలన్న ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఇదంతా ఇలా వుంటే, రేణుకకు చెక్ పెట్టడంతోపాటు, రాహుల్‌గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి ఖమ్మం జిల్లాలో వున్న రేణుక వ్యతిరేక వర్గం ఒకే దెబ్బకు రెండు పిట్టల్లాంటి ఒక ప్లాన్ వేసింది.   రాహుల్‌గాంధీ ఈసారి ఎన్నికలలో ఖమ్మం నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించింది. ఇది రేణుక వర్గీయులకి ఆగ్రహం తెప్పించింది. దాంతో వాళ్ళు ఖమ్మం జిల్లా ఎడిషన్ న్యూస్ పేపర్లలో ‘‘ఖమ్మం నుంచి రేణుకా చౌదరి పోటీ చేయాలంటే బర్త్ సర్టిఫికెట్ కావాలన్నారు. మరి రాహుల్‌గాంధీకి ఖమ్మం జిల్లాలో పుట్టినట్టు బర్త్ సర్టిఫికెట్ ఏదైనా వుందా’’ అనే అర్థం వచ్చేలా ప్రకటనలు ఇచ్చారు. రేణుకని దెబ్బతీయడానికి కాచుకుని కూర్చుని వున్న వాళ్ళకి ఆ ప్రకటనలు లడ్డులా దొరికాయి. ఆ ప్రకటనల కటింగ్‌ని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి శనివారం నాడు దిగ్విజయ్‌సింగ్‌కి అందజేశారు.   రేణుకా చౌదరి వ్యవహార శైలి మీద కూడా డిగ్గీకి ఫిర్యాదు చేశారు. యువరాజు మీదే కామెంట్లు చేయడానికి సాహసిస్తున్న రేణుకని, ఆమె వర్గాన్ని తగిన విధంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తమ్మీద తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తనను ఎంత సాధిస్తున్నా, వేధిస్తున్నా రేణుకా చౌదరి వెనకడుగు వేయడం లేదు. కాంగ్రెస్ పార్టీలో వున్న ఈ వర్గపోరు వచ్చే ఎన్నికలలో తెలుగుదేశానికి మరింత లాభం చేకూర్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు

      గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ సభ జరగనున్న భీహారు రాజధాని పాట్నాలో వరుస బాంబు పేలుళ్లు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ ఉదయం నుంచి మొత్తం ఆరు బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు పాట్నా రైల్వే స్టేషన్ లోని పదవ నెంబర్ ప్లాట్ ఫామ్ పై ఓ టాయిలెట్ సమీపంలో తొలి బాంబు పేలుడు జరుగగా, రెండో బాంబు ఓ సినిమా థియేటర్ వద్ద, మిగితా నాలుగు బాంబులు హుంకర్ ర్యాలీ జరిగే గాంధీ మైదాన్ వద్ద జరిగినట్టు సమాచారం. ఈ ర్యాలీలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఆదివారం పాట్నాలో మధ్నాహం ఒంటి గంటకు 'హుంకర్' ర్యాలీలో నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

జగన్ 'పిచ్చి వాగుడు'

      పదహారు నెలలు అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి బాగోలేదు. అందుకే మతి భ్రమించిన వాడిలా పిచ్చి వాగుడు వాగుతున్నాడు. సోనియాగాంధీ మోచేతి నీళ్లు తాగి రోజు ఆమె ఇటలీ నుండి వచ్చిన సంగతి తెలియదా ? అసలు వాళ్ల నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది సోనియాగాంధీ కాదా అని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాద్ సమైక్య శంఖారావం సభలో జగన్ ప్రసంగం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. జగన్ కు ఓట్లు సీట్లే ముఖ్యమని, తెలంగాణ వాళ్లు చీత్కరిస్తున్నా సిగ్గులేకుండా జగన్ కలిసి ఉందామని అంటున్నాడని పొన్నం విమర్శించారు. హైదరాబాద్ లో అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకునేందుకు హైదరాబాద్ లో మీటింగ్ లు పెట్టి జగన్ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాడని, జాతీయ గీతాన్ని అవమానించిన జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమిరెడ్డికి కిరణ్ షాక్

      ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు. తెలంగాణ విభజన నేపథ్యంలో క్యాబినెట్ సమావేశంతో సంబంధం లేకుండా చిత్తూరు జిల్లాకు తాగునీటి అవసరాల కొరకు ఏకంగా రూ.6 వేల కోట్లు కేటాయించుకున్నాడు. ఆర్థికశాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుండి చిత్తూరు జిల్లాకు తాగునీటి తరలించే పథకం ఇది. ఇది పూర్తయితే వందలాది గ్రామాలతో పాటు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకంలకు కూడా నీటి సమస్య ఉండదు.     అయితే కండలేరు జలాశయం నుండి కేటాయింపులు లేకున్నా ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాకు నీటిని తరలిస్తున్నారని, ఇక్కడ రైతులను ఎండబెట్టి ఎలా తరలిస్తారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డిని నిలదీస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే అనుకోకుండా ఓ ప్రైవేటు కార్యక్రమంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురయ్యారు. కనిపించిందే తడవు ముఖ్యమంత్రి సోమిరెడ్డితో చిత్తూరు జిల్లాకు నీరు తరలించొద్దని అంటున్నావు..అదే మాట మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో చెప్పించు..అప్పుడు ఆ పనులు నిలిపేస్తా అని చెప్పడంతో అవాక్కవడం సోమిరెడ్డి వంతయింది.

పులిని చూసి వాతలు పెట్టుకోనేల

  ఏపీ ఎన్జీవోల సభకు దీటుగా సమైఖ్య శంఖారావం సభను నిర్వహించి, సీమాంద్రాలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల కంటే సమైక్య రేసులో తామే ముందున్నామని చాటుకోవాలనే యావే తప్ప, సమైక్యాంధ్ర పట్ల ఏమాత్రం చిత్తశుద్దిలేని వైకాపా చాలా సాంప్రదాయబద్ధంగా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని సభను ఆరంభించింది. అయితే మధ్యలో వందేమాతరం గీతం కూడా అందుకొంటామని, తెలుగుజాతిని విడగొడుతున్నవారిని బంగాళాఖాతంలోకి విసిరేస్తామని భీకర ప్రతిజ్ఞలు కూడా చేసారు.   ఇంతకీ మధ్యలో వందేమాతరం గీతం అందుకొంటామని హెచ్చరించవలసిన అవసరంమేమిటో వారికే తెలియాలి. బహుశః వందేమాతరం పాడటానికి తమకు అభ్యంతరం లేదని చెప్పి బీజేపీ వాళ్ళని మంచి ప్రయత్నం ఉందేమో మరి. ఎందుకంటే దేశంలో కొందరు నేతలు వందేమాతరం పాడేందుకు బాహాటంగానే నిరాకరిస్తున్నందున వారిపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.   కానీ వైకాపా మహోదయులు వందేమాతరం గేయాన్నిసభలో ఆలపించకుండా దాని పరువు నిలిపారు. ఎందుకంటే సభ ముగింపులో వాళ్ళు జనగణమణ జాతీయ గీతాన్ని ఎంత కూనీ చేసారో చూస్తే ఎవరికయినా హృదయం కలుక్కుమానక మానదు. అసలు జాతీయ గీతాన్నిపాడకపోయినా ఎవరూ అడిగేవారు ఉండరు. కానీ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు ఏపీ ఎన్జీవోలు తమ ‘సేవ్ ఆంద్రప్రదేశ్’ సభని జనగణమణ జాతీయ గీతాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో ఆలపించి ముగించి అందరి మన్ననలు పొందడంతో, పోరాడితే పోయేదేముంది విభజన చిచ్చుతప్ప అని జనాలను ఊదరగొట్టినట్లుగానే పాడితే పోయేదేముంది పరువు తప్పఅని తప్పుల తడకలతో జనగణమణ జాతీయ గీతాన్నిపాడి ‘మమ’ అనిపించేసారు.   చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అని పెద్దలు ఊరకనే అనలేదు. అది అక్షరాల వైకాపాకి వర్తిస్తుంది. జాతీయ గీతాన్నితప్పుగా, ఆశ్రద్దగా పాడినందుకు తెలంగాణా న్యాయవాదుల జేఏసీ పోలీసులకి పిర్యాదు చేసింది. అయితే కొమ్ములు తిరిగిన సీబీఐ వాళ్ళే జగన్ కాలిగోరు కూడా తాకలేకపోయింది పోలీసులు మాత్రం ఏమి చేయగలరు పాపం!

కృతజ్ఞతలు వాయిదా!

  సోనియాగాంధీ తెలంగాణా ప్రకటించడంతో ఆమెకు తామెంతో రుణపడిపోయామని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. అర్జెంటుగా ఆమెకి కృతజ్ఞతలు చెప్పేయడానికి తహతహలాడిపోతున్నారు. దీనికోసం ఆదివారం నాడు కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో కృతజ్ఞతల సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొని, అమ్మగారికి కృతజ్ఞతలు తెలియజేసి, స్తోత్రాలు చెల్లించి అధిష్ఠానం దృష్టిలో పడాలని అనుకున్నారు.   అయితే కృతజ్ఞతల సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటి నుంచి సొంత పార్టీ నుంచి మాత్రమే కాకుండా బయటి పార్టీల నుంచి కూడా విమర్శలు తలెత్తాయి. తెలంగాణ ఏర్పాటుతో అసలే కడుపు మండిపోతున్న సీమాంధ్ర ప్రజల ఆగ్రహాగ్నికి ఇలాంటి సభలు మరింత ఆజ్యం పోసే అవకాశం ఉంది కాబట్టి ఈ సభను నిర్వహించకపోవడమే ఉత్తమమన్న అభిప్రాయం కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులే వ్యక్తం చేశారు.   అయినా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటైతే తెలంగాణ సీఎం అయిపోవాలని కలలు కంటున్న తెలంగాణ మంత్రులు సోనియమ్మకి కృతజ్ఞతలు చెప్పితీరుతాం అంటూ సభ నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా ఈ సభ మీద నిప్పులు చెరిగింది. ఏం సాధించాలరని కృతజ్ఞతలు చెబుతారని నిలదీసింది. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ప్రకటించినా ముఖ్యమంత్రి స్థానంలో వున్న కిరణ్ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రిని కట్టడి చేయడం చేతగాని మంత్రులు ఇలాంటి సభలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని టీఆర్‌ఎస్ విమర్శించింది. దాంతో నాలుక్కరుచుకున్న తెలంగాణ మంత్రులు కృతజ్ఞతల సభను వాయిదా వేసుకోవాలని అనుకున్నా ఏర్పాట్లన్నీ జరిగిపోవడంతో గత్యంతరం లేక ముందుకే వెళ్దామని అనుకున్నారు. కానీ లోలోపల అనవసరంగా సభ పెడుతున్నామేమోనని మథనపడుతూనే వున్నారు.   తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మథనను గుర్తించాడేమోగానీ, వరుణదేవుడు కరీంనగర్‌లో భారీ వర్షాలు కురిపించి అంబేద్కర్ స్టేడియంలో కాసిన్ని నీళ్ళ నిలిచేలా చేశాడు. దాంతో తె.కాం. నాయకుల బుర్రల్లో ఫ్లాష్ వెలిగింది. వెంటనే స్టేడియంలో నిలిచిన నీళ్ళ సాకుని చూపించి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతల సభని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. సభ ఎప్పుడు జరిపేదీ తర్వాత తెలియజేస్తామని చెప్పారు.

నీతి నిజాయితీలకు కేరాఫ్ ఎడ్రస్

  తన వెనుక పది చార్జ్ షీట్స్ పోగేసుకొని, ప్రతీ చార్జ్ షీట్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దేశంలో తనంత నిజాయితీ పరుడు, తన పార్టీ అంత నీతిగల పార్టీ మరొకటి లేదనడం నిజంగా గొప్ప విషయమే. తను ఇప్పుడు దూషిస్తున్నఇతర పార్టీలలో నేతలు వైకాపాలోకి రాగానే ఒక్కసారిగా మంచి వారెలా అయిపోతారనే ధర్మ సందేహం ఉంది. ఉదాహరణకు దాడి వీర భద్రరావు, మైసూరా రెడ్డి వంటి వారు ఒకప్పుడు ఆయనని అయన పార్టీని దొంగల మూటా అని అభివర్ణించినవారే. మరి అటువంటి వారు మళ్ళీ అదే దొంగల ముటాలో చేరి ఇప్పుడు తమ పాత పార్టీలను దూషించడం చూస్తే ఎవరెటువంటి వారో అర్ధం అవుతూనే ఉంది. మరి అటువంటి వారిని పోగేసుకొని తమ పార్టీ అంత గొప్ప నీతి నిజాయితీ గల పార్టీ మరొకటి లేదని, మిగిలిన పార్టీలు నమ్మదగినవి కావని జగన్ కాండక్ట్ సర్టిఫికెట్స్ జారీ చేయడం విడ్డూరం. అలాగని రేపు అదే పార్టీల నుండి వచ్చేనేతలను జేర్చుకోకుండా ఉంటారా? అంటే అదీ తప్పదు.   నిన్న గాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన ఆయన, తన బ్యాక్ గ్రౌండ్ సంగతి మరిచి ఎదుట పార్టీలను నేతలను నిందించడం విశేషం. ఇక సోనియాగాంధీ తన కొడుకుని ప్రధాని చేయాలనే తాపత్రయంతోనే రాష్ట్ర విభజన చేస్తోందని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి, మరి తను రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతోనే ఈ సమైక్యరాగం ఆలపిస్తున్నసంగతి మరిచిపోయినట్లున్నారు. సోనియాగాంధీ తన కొడుకుని ప్రధానిని చేయాలనుకొంటే, విజయమ్మ తన కొడుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయలనుకొంటున్న విషయం నిజం కాదా?   ఇక కాంగ్రెస్ అధిష్టానానికి వైకాపాకి మధ్య రహస్య అవగాహన ఉందన్న ఆరోపణలను ఎదుర్కోవడానికే సోనియాను విమర్శించారనుకొన్నా, రాష్ట్ర విభజనకి ముఖ్యకారకుడయిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రసక్తి ఎక్కడా తేకుండా జాగ్రత్తపడుతూ, చంద్రబాబుపైనే విమర్శలు ఎందుకు గుప్పిస్తున్నట్లు? అంటే కేసీఆర్ చేసిన ఉద్యమాల వలన గాక కేవలం చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లనే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన ఉద్దేశ్యమా? అలాగయితే వైకాపా ఇచ్చిన లేఖ సంగతేమిటి?   కేసీఆర్కి తెలంగాణా, జగన్కి ఆంధ్రా పంపకాలు అయినందున, సీమాంద్రాలో తనకి పోటీగా ఉన్న చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు తప్ప జగన్ ఎక్కడా తన ప్రసంగంలో కేసీఆర్ జోలికి పోలేదు. ఇదే కాంగ్రెస్-వైకాపా-తెరాసల మధ్య ఉన్నబంధం గురించి వివరిస్తోంది.మరి వెనక ఇంత కధ పెట్టుకొని నీతి నిజాయితీలకు తను, తన పార్టీయే కేరాఫ్ అడ్రెస్స్ అంటే ఎలా? 

ఆరు నెలలు గరిడి సాము నేర్చుకొని

  ఆరు నెలలు గరిడి సాము నేర్చుకొని మూల ముక్కుతున్న ముసలమ్మని ఒకే ఒక్క పెట్టుతో పడగొట్టేసాన్ననాడుట వెనకటికెవడో! అలాగే ఉంది వైకాపా నిర్వహించిన సమైక్యశంఖారావం సభ. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్వహించిన అంత భారీ సభలో ఇంతవరకు రోజూ చెపుతున్న విషయాలే తప్ప కొత్తగా చెప్పిన ముక్క ఒక్కటి లేదు. పైగా అందరూ చెప్పిందే చెప్పడం వలన కంఠ శోష, ఆయాసం తప్పపార్టీకి కానీ సమైక్య ఉద్యమానికి గానీ కొత్తగా ఒరిగిందేమీ లేదు.   అసలు అటువంటి సభ నిర్వహిస్తున్నపుడు దాని ద్వారా ఒక బలమయిన సందేశం, ఒక బలమయిన నిర్ణయం లేదా కనీసం పార్టీ శ్రేణులకు సరయిన దిశా నిర్దేశ్యం అయినా చేసి ఉంటే సభ ప్రయోజనం దక్కేది. కానీ సభలో ప్రసంగించిన వక్తలు ఒకరో ఇద్దరో తప్ప మిగిలినవారు ఏదో అందరూ, రోజూ జనాలందరూ మాట్లాడుకొనే ఆ నాలుగు ముక్కలే మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తూ ఒక మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొన్నారు. ఇది సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న సభ అని చెప్పుకొంటూనే వక్తలు ‘జగన్మోహన్ రెడ్డి భావి ముఖ్యమంత్రి,’ ‘రాష్ట్రాన్ని కాపాడాలంటే జగనే ముఖ్యమంత్రి అవ్వాలి’ అంటూ అప్రస్తుత ప్రసంగం చేస్తూ సమైక్యంగా జగన్ భజనలో తరించిపోయారు.   ఇక జగన్ ప్రసంగం కూడా చాలా నాటకీయంగా, కృతకంగా సాగింది. ఏదయినా ఒక ముఖ్య విషయాన్ని చెప్పదలచుకొంటే దానిని జనాల మనసులకు హత్తుకొనేలా చెప్పదానికి కొంత నాటకీయత జోడించవచ్చు. గతంలో స్వర్గీయ యన్టీఆర్ కూడా చాలా నాటకీయంగా ప్రసంగించేవారు. కానీ బాషాపై ఆయనకున్న పట్టు, ఆయన మాటలలో విరుపులు అవీ చూసి జనాలు మంత్రం ముగ్దులయ్యేవారు. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ తన ప్రసంగాలతో ప్రజలని ఏవిధంగా ఉర్రూతలూగిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.   జగన్ ఆ స్థాయిలో ప్రసంగించలేకపోవచ్చును. కానీ సభలో ఏవిధంగా ప్రసంగం సాగాలనే విషయమయినా జగన్ ఆయనను చూసి నేర్చుకొని ఉంటే సభలు రక్తి కట్టే అవకాశం ఉంటుంది.గానీ జగన్ అసలు విషయన్ని వదిలేసి ‘ప్రశ్నిస్తున్నాను’, ‘అడగదలుచుకొన్నాను’, ‘చ్చాలా’ బాధ కలుగుతోంది’ వంటివి ఆయన ప్రసంగంలో మరీ ఎక్కువయిపోవడంతో అవి అసలు విషయాన్నీ పూర్తిగా మింగేసాయి. ఆయన ప్రస్తావించిన నీటి సమస్యలు, విద్యాఉద్యోగ సమస్యల వంటి వాటిని ఆయన క్రుతకమయిన బాష, నాటకీయత మింగేసింది. దానికి పార్టీ పోగేసుకువచ్చిన జనాలు చప్పట్లు ఈలలు అని స్వంత డబ్బాకొట్టుకోవడం మరో ఎక్స్ ట్రా.   ఇక ఊళ్ళో ఉన్నఅక్కలు, చెల్లెళ్ళూ,అవ్వలు అంటూ సాగదీస్తూ చేంతాడంత తెలుగు చుట్టరికాల గురించి చెప్పి వారికి పేరుపేరునా దండాలు చెప్పుకొంటూ జనాల చేత చప్పట్లు కొట్టించుకొనే ఆనవాయితీ కూడా ఇక్కడ ఆయన తూచా తప్పకుండా చక్కగా పాటించారు. బలమయిన మీడియాను చేతిలో ఉంచుకొన్న ఆయన కనీసం వారి సలహాలు తీసుకొని ఉంటే ఆయన ప్రసంగం మరీ ఇంత పేలవంగా ఉండేది కాదని చెప్పవచ్చును.

‘యువరాజు’ అంటే ఒప్పుకోరట!

      కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, సోనియాగాంధీ తనయుడు రాహుల్‌గాంధీని ఇంతకాలం అందరూ ‘యువరాజు.. యువరాజు’ అని పిలిస్తే మురిసిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీని ‘యువరాజు’ అంటే ఒప్పుకోబోమని వార్నింగ్ ఇచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఈమధ్య తాను మాట్లాడే ప్రతి సభలోనూ రాహుల్‌గాంధీని ‘యువరాజు’ అని సంబోధిస్తున్నారు. ఆయన అలా అంటూ వుండటం కాంగ్రెస్ పార్టీకి చిరాకు తెప్పించినట్టుంది. దాంతో రాహుల్‌గాంధీని దేశంలో జనం అంతా ఎలా పిలుస్తున్నారో నరేంద్రమోడీ కూడా అలాగే పిలవాలి. ‘యువరాజు’ అని అమర్యాదకరంగా పిలిస్తే సహించం అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. నరేంద్రమోడీ మరోసారి రాహుల్‌ని ‘యువరాజు’ అని పిలిస్తే మర్యాదగా వుండదని వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే మన తెలుగు సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’లో జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవడు పడితే వాడు బుడ్డోడు.. బుడ్డోడు అంటే గుడ్డలిప్పి కొడతా’ అని చెప్పడం గుర్తొస్తోంది కదూ!

అన్నీ అడగదల్చుకోవడమేనా?

      సమైక్య శంఖారావ సభలో జగన్ మాట్లాడిన తీరు భలే వెరైటీగా వుంది. ఈ సభలో జగన్ అనేక విషయాలు మాట్లాడాడు. మీటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి జగన్ ఒక్కోవిషయాన్ని ప్రస్తావిస్తూ, ‘‘అడగదల్చకున్నా’’ అనే మాటని కనీసం వందసార్లయినా అన్నాడు. సోనియా గాంధీని ‘‘అడగదల్చుకున్నా’’, చంద్రబాబుని ‘‘అడగదల్చుకున్నా’’, విభజనవాదులను ‘‘అడగదల్చుకున్నా’’, కేంద్ర ప్రభుత్వాన్ని ‘‘అడగదల్చుకున్నా’’ అని బోర్ కొట్టించాడు. ఇంతకీ జగన్ ప్రస్తావించిన పాయింట్లు అడిగదల్చుకున్నట్టా? అడిగినట్టా? టోటల్‌గా జగన్ పద్ధతి ‘అడగదల్చుకోవడమే’ తప్ప అడగటం కాదన్నమాట! ఏం జగన్ గారూ.. అన్నీ అడగదల్చుకోవడమేనా? అడగడం లేదా అని రేపు జనం అడిగితే జగన్ ఏం సమాధానం చెబుతాడో?!

శంఖారావంలోనూ విలీనం మాటే!

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోదామా అని తహతహ ఎక్కువైనట్టుంది. అందుకే అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీతో తమకున్న అనుబంధం గురించి, కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం గురించి, కాంగ్రెస్ పార్టీలో కలసిపోవడం గురించి ప్రస్తావిస్తూ వుంటారు. మొన్నటి వరకూ జగన్‌తో చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన సబ్బం హరి ఆమధ్య జగన్‌కీ, కాంగ్రెస్‌ పార్టీకి వున్న అనుబంధం గురించి నోరుజారి చెప్పేశారు. అలా నోరు జారడం వల్ల ఆయన జగన్‌కి దూరమైపోయారు. మొన్నీమధ్యే వైకాపా నాయకుడు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తామని చెప్పినా సోనియా గాంధీ వినకుండా జగన్‌ని జైల్లో పెట్టించిందని చెప్పి, ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. ఆ తర్వాత మీడియా తన మాటలని వక్రీకరించిందని వివరణ ఇచ్చారు. తాజాగా వైకాపా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాటల్లో కాంగ్రెస్ పార్టీ మీద వైకాపా పార్టీకి వున్న అభిమానం నిందాస్తుతి రూపంలో బయటపడింది. సమైక్య శంఖారావ సభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, దిగ్విజయ్‌సింగ్ చెబుతున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వైఎస్సార్ ఎప్పుడూ కోరుకోలేదని, దీన్ని దిగ్విజయ్ నిరూపిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తామని సవాల్ విసిరారు. దిగ్విజయ్‌కి సవాల్ విసరదలచుకుంటే మరేదైనా సవాల్ విసరవచ్చు కదా.. కాంగ్రెస్‌లో వైకాపా విలీనం సవాలే ఎందుకు విసిరారన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. వైకాపా మనసులో వున్న ఉద్దేశాలే ఆ పార్టీ నాయకుల మాటల్లో బయట పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

జగన్ పై జెసి సంచలనం

      కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫిక్సింగ్ చేసుకున్నారు. దీనికి 144 కారణాలున్నాయి. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. జగన్ కు బెయిలు దక్కడమే ఇందుకు సాక్ష్యం. జగన్ కు బెయిలు రావడంలో ఎలాంటి తప్పు లేదని, అయితే ఆయనకు సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వడమే తప్పు అని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కేసు విచారణలో ఏం తేలిందని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ప్రశ్నించారు.   కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండదండల మూలంగానే హైదరాబాద్ లో జగన్ సభ విజయవంతం అవుతుందని, ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు ఆపి జగన్ సభ కొరకు 14 రైళ్లను మళ్లించారని జేసీ ఆరోపించారు. ఢిల్లీలో అధికారం కోసం కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో పార్టీని నాశనం చేసిందని, సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయినట్లేనని ఆయన అన్నారు. విభజనకు వ్యతిరేకంగా ప్రధానికి, రాష్ట్రపతికి లేఖలు రాసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ధైర్యాన్ని నిరూపించుకున్నారని జేసీ ప్రశంసించారు.